బల పరీక్షకు రెడీ.. సమయం ఇవ్వండి

Kumaraswamy

 

బెంగళూరు: బలపరీక్షకు తాను సిద్ధం అని, ఇందుకు సమయం ఖరారు చేయాలని కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి పేర్కొన్నారు. ఇందుకు సమయం కేటాయించాలని అసెంబ్లీలోనే స్పీకర్ రమేష్ కుమార్‌ను శుక్రవారం అభ్యర్థించారు. ఎమ్మెల్యేల రాజీనామాలు, సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు, క్యాంప్‌ల నేపథ్యంలోనే కర్నాటక అసెంబ్లీ శుక్రవారం 11 రోజుల సమావేశాలు ఆరంభం అయ్యాయి. రాజకీయ దిగ్బంధంలో ఉన్న కుమారస్వామి సభలోనే విస్మయకర రీతిలో బలపరీక్ష ప్రకటన చేశారు. రాజీనామాలతో రాష్ట్రంలో అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయని, పరిపాలనాపరమైన చిక్కులు ఏర్పడుతున్నాయని, అయితేసభలో తనకు బలం ఉందని, దీనిని నిరూపించుకునేందుకు స్పీకర్ తేదీని ఖరారు చేయాలని సిఎం పేర్కొన్నారు.

ప్రస్తుత దశలో విశ్వాస పరీక్షకు దిగడం మంచిదని తాను నిర్ణయించుకున్నట్లు, స్పీకర్ ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు బలపరీక్షకు సిద్ధం అని సిఎం స్పష్టం చేశారు. సభలోని బిజెపి సభ్యులు సిఎం ప్రకటనకు అభ్యంతరం తెలిపారు. సంతాప ప్రస్తావనల సమయంలో ముఖ్యమంత్రి ఈ అంశం గురించి మాట్లాడటం సరికాదని నిరసన వ్యక్తం చేశారు. సభ్యుల అభ్యంతరాలను సిఎం లెక్కచేయలేదు. తాను బలం ఉన్న విషయాన్ని సభలోనే రుజువు చేసుకుంటానని, పదవిని దుర్వినియోగం చేసే వ్యక్తిని కానని సిఎం తేల్చిచెప్పారు. పదవికి అతుక్కుని ఉండే తత్వం తనకు లేదని, బలం ఉందని తెలియచేసుకుంటానని, ఇందుకు సమయం ఇస్తే మంచిదని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత దశలో కొందరు ఎమ్మెల్యేల తీరుతో గందరగోళ పరిస్థితి నెలకొందని , తాను అన్నింటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

సిఎం ఎప్పుడంటే అప్పుడే : స్పీకర్
సిఎం కోరుతున్నట్లుగా విశ్వాస తీర్మానానికి సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పీకర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి సమయం ఎంచుకుని చెపితే ఆ మేరకు బలపరీక్షకు సెషన్ నిర్వహించడం జరుగుతుందని శుక్రవారం స్పీకర్ స్పందించారు. పదవికి అతుక్కుని ఉండదల్చుకోలేదని, అంతకు మించి అనిశ్చితత అవాంఛనీయం అని సిఎం చెపుతున్నారని, దీనితో తాను ఏకీభవిస్తున్నానని స్పీకర్ రమేష్ కుమార్ విలేకరులతో చెప్పారు. బలపరీక్షకు ఆయన సమయం తెలియచేస్తే ఆ మరుసటి రోజే తాను సభా కార్యకలాపాల అజెండాలో పొందుపరుస్తామని స్పీకర్ వెల్లడించారు.

సంతాప తీర్మానాల సమయంలో ముఖ్యమంత్రి వేరే విషయం ప్రస్తావించడం భావ్యమేనా ? అని విలేకరులు ప్రశ్నించగా ఈ ప్రశ్నను సిఎంనే అడగాల్సి ఉందన్నారు. ఇప్పటికిప్పుడు బలపరీక్ష జరగదని, అయితే సిఎం తన మనస్సులోని మాటను చెప్పారు కాబట్టి , ఆయన చెప్పే తేదీని ఖరారు చేయడం స్పీకర్‌గా తన బాధ్యత అని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాజీనామాలపై కానీ ఎమ్మెల్యేలపై కానీ తదుపరి చర్యలు ఉంటాయా? అని విలేకరులు అడిగారు. ప్రక్రియ తన ముందుకు వస్తే తాను చేపడుతానని, లేకపోతే ఇంట్లో నిద్రపోతానని స్పీకర్ చమత్కరించారు.

అసెంబ్లీలో బలాబలాలు
మొత్తం సభ్యులు 224.. సంకీర్ణ మొత్తం బలం 116. ఇందులో కాంగ్రెస్ 78, జెడిఎస్ 37, బిఎస్‌పి 1 ..ఇక ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతు సభలో బిజెపి బలం 107. అయితే 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే సంకీర్ణబలం వందకు పడిపోతుంది.

Kumaraswamy wants floor test

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బల పరీక్షకు రెడీ.. సమయం ఇవ్వండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.