మరోసారి పెద్ద మనస్సు చాటుకున్న కెటిఆర్…

చదువుల తల్లులకు కెటిఆర్ అండ
నిరుపేద విద్యార్థినీలకు ఆర్థిక సాయం
ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఇరువురికి సూచన
మన తెలంగాణ/హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్ మరోసారి తన పెద్ద మనస్సును చాటుకున్నారు. చదువుల తల్లులకు ఆయన అండగా నిలిచారు.  జగిత్యాల జిల్లా కథలాపూర్‌ గ్రామానికి చెందిన రచన అనే యువతి ఇంజినీరింగ్‌ చదువు బాధ్యతను కేటీఆర్‌ తీసుకున్నారు. రచన ఇంజనీరింగ్ పూర్తి అయ్యేదాకా ఆర్థిక సాయం అందిస్తానని కెటిఆర్ హామినిచ్చారు. రచనకి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. పదవ తరగతి వరకు స్థానిక బాల సదనంలో ఉంటూ జగిత్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. తర్వాత హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని స్టేట్ హోమ్‌లో ఉంటూ పాలిటెక్నిక్‌లో డిప్లమా పూర్తి చేసి, ప్రస్తుతం ఈ సెట్‌లో మంచి ర్యాంకు సాధించి చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (సిబిఐటి) కంప్యూటర్ సైన్స్‌తో పాటు ఇంజినీరింగ్‌లో సీటు సాధించింది. అయితే తనకు ఫీజులు కట్టే స్తోమత లేకపోవడంతో ఆపన్నుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో మీడియా ద్వారా విషయం తెలుసుకున్న కెటిఆర్ సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.

రచనతో పాటు ఐఐటి ఫీజులు చెల్లించలేని మేకల అంజలికి కూడా కెటిఆర్ ఆర్థిక సాయాన్ని అందించారు. అంజలి తండ్రి రమేష్ అటో డ్రైవర్. గతేడాది తన పెద్ద కూతురు మెడిసిన్ ఫీజులకు తనకున్న భూమిని అమ్మిన రమేష్ ఈ ఏడాది తన చిన్న కూతూరు ఐఐటిలో సీటు సాధించడానికి ఫీజులకు ఇబ్బంది పడుతుండడంతో కెటిఆర్‌కు అంజలి ట్విట్టర్ ద్వారా తన సమస్యను విన్నవించింది. పేదరికాన్ని జయించి చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ ఇద్దరు విద్యార్థినీల సమస్యలపై కెటిఆర్ వెంటనే స్పందించి వారిని ఆదుకోవడానికి ముందుకొచ్చి భరోసా అందించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.

KTR gives Aid for Rachana studies

The post మరోసారి పెద్ద మనస్సు చాటుకున్న కెటిఆర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.