కొత్త మున్సిపల్ చట్టంతో జవాబుదారీ పెంచాం

KTR

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పిస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి కె.టి. రామారావు అన్నారు. ఇది కొంత సవాలుతో కూడుకున్నదని, అయినా దశలవారీగా అభివృద్ది పనులు చేపడుతున్నామ ని చెప్పారు. పట్టణ ప్రాంతాలలో వేగంగా మౌలిక వసతుల ఏర్పాటుకు టియుఎఫ్‌ఐటిసి ద్వారా నిధులు సమకూర్చుతున్నామని వెల్లడించారు. అసెంబ్లీలో మంగళవా రం సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కెటిఆర్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 42.6 శాతం జనాభా పట్టణాల లో ఉంటోందని, మరో ఐదారేళ్లలో ఈ సంఖ్య 50 శాతానికి చేరుకుంటుందని తెలిపారు. దేశంలో పట్టణీకరణలో తెలంగాణ 5వ స్థానంలో ఉందని వివరించారు. ప్రణాళికబద్ధంగా పురోగతి ఉండాలని, దాని ప్రకారమే ప్రభుత్వ పరంగా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా కొత్తగా 68 మున్సిపాలిటీలు, 7 కార్పోరేషన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఇళ్ల నిర్మాణాలకు సత్వర అనుమతులు
గతంలో ఇళ్ల నిర్మాణానికి లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం సత్వరం ఇళ్ల నిర్మాణ అనుమతులు ఇచ్చే విధానం తీసుకువచ్చామని మంత్రి కెటిఆర్ అన్నారు. మున్సిపాలిటీల్లో జవాబుదారీతనం పెంపొందించేందుకు ఇటీవలే కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకువచ్చామని చెప్పారు. పారదర్శకత కోసం పాలక సంస్థల్లోని కౌన్సిలర్, ఛైర్‌పర్సన్ వంటివారిని జవాబుదారీ చేశామని వివరించారు. స్వఛ్చ సర్వేక్షణ్‌లో నాలుగు మున్సిపాలిటీలకు జాతీయ అవార్డులు లభించాయని తెలిపారు. ఘన, ద్రవ వ్యర్థ నిర్వహణలో ఇప్పుడిప్పుడే కొత్త పురోగతి సాధిస్తున్నామని వెల్లడించారు. ద్రవ వ్యర్థ నిర్వహణ మిషన్ భగీరథతో లింక్ అయి ఉన్నందున ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వ్యర్థ నిర్వహణపై పూర్తిగా దృష్టి సారిస్తామని తెలిపారు. జవహార్ డంప్ యార్డ్ నుంచి చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. చెత్త రీసైక్లింగ్ కోసం రెండు ప్లాంట్‌లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జియాగూడ స్లాటర్ హౌజ్‌కు పిపిపి పద్దతిలో మూడు టెండర్లు పిలిచినా స్పందన రాలేదని, అందుకే ఎన్‌ఆర్‌సిఎంను, గోట్ డవలప్‌మెంట్ కార్పోరేషన్‌తో సంప్రదించామని, వారి సలహాలతో మరింత సరళతరం చేసి సాధ్యమైనంత వేగంగా జియాగూడ స్లాటర్ హౌజ్‌ను వినియోగంలోకి తీసుకువస్తామని వెల్లడించారు.

హైదరాబాద్‌లో డెంగీ వంటి వ్యాధుల ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలకు వైద్య సేవలందించేందుకు ఇప్పటికే 106 బస్తీ దావఖానాలు ప్రారంభించామని, వాటిని మరింత పెంచుతామని వెల్లడించారు. విపత్తుల సంభవించినప్పుడు ప్రజలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రయోగాత్మకంగా డిజాస్టర్ రెస్పాన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారన్నారు. నగరంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోడ్ల విస్తరణ చేపట్టడంతో పాటు పాడైన రోడ్లను బాగు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ప్రజా రవాణా వ్యవస్థకు అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. నగరంలో మెట్రో రైలు ప్రారంభం కాగా, ఇప్పటివరకు 3 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న మెట్రోలైన్లను ప్రారంభించడంతో పాటు శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తామని వెల్లడించారు. వినూత్న పద్దతులలో హైదరాబాద్‌ను అభివృద్దికి కార్యాచరణ అమలు చేస్తున్నామని, హైదరాబాద్‌లో మున్సిపల్ బాండులు తీసుకువచ్చామని అన్నారు. హైదరాబాద్‌లో నిర్మాణాల వ్యర్థాల రీసైక్లింగ్‌కు రెండు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ ఆదా కోసం ఇఎస్‌ఎల్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ సహాకారంతో ఎల్‌ఇడి బల్బులను వినియోగంలోకి తీసుకువచ్చామని చెప్పారు.
ప్రతి మున్సిపాలిటీలోనూ హరితహారం అమలు
సిఎం కెసిఆర్ మానసపుత్రిక అయిన హరితహారంను ప్రతి మున్సిపాలిటీలోనూ పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటుపై దృష్టి సారించామన్నారు. హైదరాబాద్ పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. 195 మ్యాన్వల్ స్కావెంజర్ కొత్త యంత్రాల ద్వారా పారిశుద్దర్య నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు. ముసీ సుందరీకరణ హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మురికి నీటి శుద్ధికి అవసరమైన ప్లాంట్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అన్ని రకాల పౌరసేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. గత ప్రభుత్వాలు 55 ఏళ్లలో చేయని అభివృద్ధి పనులను తమ ప్రభుత్వం చేసిందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదని అన్నారు. కోర్టు కేసులు వేసి కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు యత్నించాయని పేర్కొన్నారు. చెన్నైకి వచ్చినట్లు నీటి సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ తాగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని కెటిఆర్ తెలిపారు.
కోమటిరెడ్డికి కెటిఆర్ కౌంటర్
తమ ప్రభుత్వం ఇప్పటివరకు చేసింది ట్రైలర్ మాత్రమే అని, ముందు ముందు సినిమా చూపిస్తామని కెటిఆర్ వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం 70 ఎంఎం సినిమా చూపిస్తుందని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్న వ్యాఖ్యలకు కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు. 55 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండి, నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు ప్రభుత్వంలో ఉన్నా ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించలేకపోయారని చెప్పారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ద్వారా నల్గొండ జిల్లాకు రక్షిత మంచినీరును అందిస్తున్నామని కెటిఆర్ తెలిపారు. దశాబ్దాలపాటు ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించలేకపోయిన కాంగ్రెస్ సభ్యులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు.

KTR Comments On new Municipal Act

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కొత్త మున్సిపల్ చట్టంతో జవాబుదారీ పెంచాం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.