అసాధారణ సాహితీమూర్తి ఇనాక్

  ఆరున్నర దశాబ్దాలుగా సాహిత్యరంగంలో అలుపెరుగకుండా నిరంతరం రచనావ్యాసంగంలో మునిగితేలడం ఆషామాషీ విషయమేమీ కాదు. పైగా ఊపిరిసలపని పనిలో తీరికలేకుండా ఒక విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడిగా ఉంటూ కూడా సాహితీ సేద్యం చేయడం అసాధారణమే. ఆ అసాధారణ సాహితీమూర్తే ‘జ్ఞానపీఠ మూర్తి దేవి’ పురస్కార విజేత కొలకలూరి ఇనాక్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల జాబితాలో ఆయన ఇటీవల స్థానం పొందారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు కుల వివక్షల మధ్య సాగిన ఇనాక్ ఎనభై ఏళ్ల ప్రస్థానంలో […]

 

ఆరున్నర దశాబ్దాలుగా సాహిత్యరంగంలో అలుపెరుగకుండా నిరంతరం రచనావ్యాసంగంలో మునిగితేలడం ఆషామాషీ విషయమేమీ కాదు. పైగా ఊపిరిసలపని పనిలో తీరికలేకుండా ఒక విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడిగా ఉంటూ కూడా సాహితీ సేద్యం చేయడం అసాధారణమే. ఆ అసాధారణ సాహితీమూర్తే ‘జ్ఞానపీఠ మూర్తి దేవి’ పురస్కార విజేత కొలకలూరి ఇనాక్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల జాబితాలో ఆయన ఇటీవల స్థానం పొందారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు కుల వివక్షల మధ్య సాగిన ఇనాక్ ఎనభై ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో మలుపులు, మరెన్నో మైలురాళ్లు. కొన్ని పోరాట స్ఫూర్తిని రాజేస్తాయి, మరికొన్ని ఆత్మసై ్థర్యాన్ని కలిగించే ఆశాదీపాలవుతాయి.

గుంటూరు జిల్లాలోని వేజెండ్ల అనే గ్రామంలో రామయ్య, వీరమ్మ అనే పేద దంపతులకు 1939 జూలై 1న జన్మించారు. దళిత కుటుంబంలో పుట్టినందుకు కుల వివక్షకు, పేద కుటుంబానికి చెందినవాడైనందుకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కష్టాల నావకు ఎదురీది, 1959లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ. ఆనర్స్ పట్టా అందుకున్నారు. కాలేజీ రోజుల్లో వరుసగా మూడేళ్లు కథానిక, కవిత, నాటకాలకు ప్రథమ బహుమతి స్వీకరించారు. అనంతరం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు పొందారు. ఈ రెండు విశ్వవిద్యాలయాల్లోనూ ఆయన ఉద్యోగబాధ్యతలు కూడా నిర్వర్తించడం విశేషం. డిగ్రీ పట్టా అందించిన ఆంధ్రా విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆయన ఆరంభించారు.

పిహెచ్.డి. అందజేసిన శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడయ్యారు. ఇనాక్ ఏ ప్రక్రియలో కాలిడినా ఉత్తమ సాహిత్యసృజనకారుడిగా పేరు తెచ్చుకున్నారు. ‘ముని వాహనుడి’ని పరిశీలిస్తే ఉత్తమ నాటక రచయితగా కనిపిస్తారు. ‘రేడియో నాటికలు’ ఆయనను ఉత్తమ నాటికల రచయితగా పరిచయం చేస్తాయి. ‘ఊర బావి’, ‘తల లేనోడు’ కథానికా రచయితగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఇవన్నీ కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఆయన కలం నుండి వెలువడిన ఏ రచన అయినా దానికదే సాటి. కవిత్వం, కథానిక, నాటిక, నాటకం, నవల, విమర్శ, పరిశోధన, అనువాదం ఇలా ఏ ప్రక్రియ చేపట్టినా అద్వితీయుడిగా నిలిచారు ఇనాక్.

సాహిత్యంలో తొలి అడుగులు ఇనాక్ తన జీవితంలో ఎదుర్కొన్న చేదు సంఘటనల నుండే ప్రారంభమయ్యాయి. ఆయన రచనలు బలమైన సామాజిక సంఘటనల సమాహారంగా ఉండేందుకు ఆయా చేదు సంఘటనలే భూమికగా నిలిచాయి. ఇనాక్ పదిహేనేళ్లు ఉన్నప్పుడు ఆయన తాత ఆ గ్రామ మునసబు కొట్టిన దెబ్బల కారణంగా మరణించారు. ఆ సంఘటన ఆయన మనోఫలకంపై నిలిచిపోయింది. ఆ సంఘటన కారణంగా చిన్నారి ఇనాక్ మనసు ఎంతో కుమిలిపోయింది. ఆ బాధ కథ రాయడానికి ప్రేరణగా నిలిచింది. ఆ విధంగా ఆయన తొలి కథానిక ‘ఉత్తరం’ వెలుగు చూసింది. అనంతరం అదే సమయంలో ‘లోకం పోకడ’ అనే కథానికను కూడా రాశారు.

పదిహేనేళ్ల వయసులో ప్రారంభమైన కొలకలూరి ఇనాక్ రచనావ్యాసంగం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ 96 గ్రంథాలు రచించి, సెంచరీకి నాలుగడుగుల దూరంలో నిలిచారు. ఆ గ్రంథాల్లో వేర్వేరు ప్రక్రియలకు చెందినవి ఉండడం విశేషం. ఆయన ఇప్పటివరకు 180 కథానికలు, 180 కవితలు, 30 నాటకాలు, తొమ్మిది నవలలు రాశారు. ఆశాజ్యోతి, షరా మామూలే, కులం ధనం, నన్ను కలగననివ్వండి, కలల కార్ఖానా, చెప్పులు, ఆది ఆంధ్రుడు, మెరుపుల ఆకాశం, కన్నీటి గొంతు, వాయిస్ ఆఫ్ సైలెన్స్, నిశ్శబ్ద స్వరం మొదలైన కవితా సంపుటాలను ఆచార్య కొలకలూరి ఇనాక్ వెలువరించారు. ‘కన్నీటి గొంతు’ కావ్యంలో శూర్పణఖ హృదయాన్ని ఆవిష్కరించడం చూడవచ్చు. రామాయణాన్ని ఆసక్తికరమైన దృక్పథంతో పరిశీలించడం గమనించవచ్చు.

ఈ కావ్యంలో రాముడిని ప్రతి నాయకుడిగా, రావణుడిని ధీరోదాత్తుడైన నాయకుడిగా ఇనాక్ పేర్కొంటారు. కీ, జై హింద్, మనలాంటి మనిషి, మునివాహనుడు, సాక్షి, ఇడుగో ఏసు క్రీస్తు, నీడ, ది ఫిఫ్త్ ఎస్టేట్ మొదలైనవి ఆయన రచించిన నాటకాలు. ‘మునివాహనుడు’ గొప్ప నాటకం. తాత్త్వికత, కళాత్మకత తొంగి చూసే సంభాషణలు ఈ నాటకంలో కనబడతాయి. తిరుప్పాణ్ ఆళ్వారు అనే దళితుడు మునివాహనుడు అయిన కథను ఆయన నాటకంగా మలిచి, సాహిత్య విమర్శకుల దృష్టిని ఆకర్షించారు. దృష్టి, జ్యోతి, అభ్యుదయం, రేడియో నాటికలు, టి.వి.నాటికలు, అమ్మ, కొలకలూరి ఇనాక్ నాటక సాహిత్యం మొదలైనవి ఆయన రచించిన ఏకాంకికల సంపుటాలు.

నవలా రచయితగానూ కొలకలూరి ఇనాక్ కృషి ప్రముఖంగా పేర్కొనదగింది. అనాథ, సౌందర్యవతి, సౌభాగ్యవతి, ఎక్కడుంది ప్రశాంతి?, రెండు కళు్లా మూడు కళ్లు, సర్కారు గడ్డి, అనంత జీవనం, మాజీ మనిషి, కాల మేఘాలు అనే నవలలను ఆయన రాశారు. వేర్వేరు నవలలను సంపుటాలుగా స్త్రీ దర్శనం, దళిత నివేదనం, సమాజ సందర్శనం అనే పేర్లతో వెలువరించారు. గులాబీ నవ్వింది, భవాని, ఇదా జీవితం, ఊరబావి, సూర్యుడు తలెత్తాడు, కట్టడి, కొలుపులు, అస్పృశ్య గంగ, కాకి, దళిత కథానికలు, పెద్దమ్మ గుడి అనే పేర్లతో కథానికా సంపుటాలను ప్రచురించారు. సాహిత్య విమర్శలోనూ పరిశోధనలోనూ ఆయన దృష్టి కోణం ప్రత్యేకమైంది.

తెలుగు భాషా సాహిత్యాలపై సాధికార విమర్శనా గ్రంథాలను వెలువరించారు ఇనాక్. తెలుగు వ్యాస పరిణామం, తెలుగు భాషా చరిత్ర, ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం, జానపదుల సాహిత్య విమర్శ, తెలుగులో తొలి నవల, తెలుగు వ్యాసం, తెలుగు విమర్శనం, తెలుగు వచన తత్త్వం, పునరుక్తి గుణమే, తెలుగు సాహిత్యంలో హరిజనులు, ఆధునికాంధ్ర సాహిత్యంలో ముస్లింలు, విమర్శిని మొదలైన విమర్శనాగ్రంథాలను ఇనాక్ రచించారు. విమర్శిని గ్రంథం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది. భాషా సాహిత్యాలపై ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు ఉన్న పరిపూర్ణ సాధికారతకు ప్రతిబింబంగా నిలుస్తుంది ఈ గ్రంథం. తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలపై పరిశోధనాత్మక గ్రంథాలను వెలువరించారు ఇనాక్. వ్యాసం, సమీక్ష, పీఠిక, కథానిక, నవల మొదలైన ప్రక్రియలపై చక్కటి పరిశోధన చేశారు ఆయన.

తెలుగు వ్యాసాలు, సాహిత్య దర్శిని, సాహిత్య సందర్శనం, సమీక్షణం, సమీక్షా సాహిత్యం, పీఠికా సాహిత్యం, తెలుగు కథానిక పరిణామం, తెలుగు నవలా వికాసం, సాహిత్య ప్రయోజనం, శూద్ర కవి ‘శుభ మూర్తి’ వసు చరిత్ర వైశిష్ట్యం మొదలైన పరిశోధనా గ్రంథాలు ఆయన రాశారు. సాహిత్య పరిశోధనలో కొత్త ప్రతిపాదనలు అనేకం ఆధార సహితంగా చేశారు కొలకలూరి ఇనాక్. తెలుగు సాహిత్యంలో గొప్ప ప్రబంధంగా పేరున్న ‘వసు చరిత్ర’ గ్రంథ కర్త అసలు పేరు రామరాజ భూషణుడో, భట్టు మూర్తో కాదంటారు ఇనాక్. ఆయన అసలు పేరు శుభమూర్తి అనేది ఇనాక్ ప్రతిపాదన. ఆ శుభమూర్తిని శూద్రుడిగా పేర్కొన్నారు ఇనాక్. చేరదీసిన రాజు పేరుతో ‘రామరాజ భూషణుడి’గా శుభమూర్తిని పిలుస్తున్నామని ఆధారాలతో నిరూపించారు. అనేక గ్రంథాలను తెలుగు నుండి ఆంగ్లంలోకి, ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువదించారు ఇనాక్. న్యూ టెస్టమెంట్‌ను ‘కొత్త ఒడంబడిక’ అనే పేరుతో తెలుగులోకి తర్జుమా చేశారు. ‘క్షమా భిక్ష ఇతర కథలు’ ను ‘అల్మ్ ్స ఆఫ్ పార్డన్ అండ్ అదర్ స్టోరీస్’గా, ‘ఓట్లాట’ను ‘ది గేవ్‌ు ఆఫ్ ఓట్స్’గా, ‘అనంత జీవనం’ను ‘ది సైక్లోన్ ఎండ్‌లెస్’గా ‘కన్నీటి గొంతు’ ను ‘శూర్పణఖ స్టిల్ వీప్స్’గా ఆంగ్ల పాఠకుల కోసం వెలువరించారు. ‘అమ్మ’ అనే పేరుతో సంగీత నృత్య రూపకాలను కూడా బాలల కోసం ప్రచురించారు. పరిశోధకుడిగా, పరిశోధనల మార్గదర్శిగా కూడా ఇనాక్ మార్గం అనితర సాధ్యం.

ఇరవై మంది విద్యార్థులకు పిహెచ్.డి.లో ఆయన పర్యవేక్షకుడిగా మార్గదర్శనం చేశారు. ఆయన రచనలు ఆంగ్లంతో పాటు హిందీ, కన్నడ, మళయాళం, తమిళం, జర్మన్, ఫ్రెంచి మొదలైన పలు ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. వివిధ విశ్వవిద్యాలయాల్లో ఆయన రచనలపై పరిశోధనలు జరిగాయి. ఆయన సాహిత్యంలోని వివిధ అంశాలపై తొమ్మిది మంది పిహెచ్.డి.లు, ఐదుగురు ఎం.ఫిల్.పట్టాలు పొందారు. వివిధ విశ్వవిద్యాలయాల్లోని పాఠ్యపుస్తకాల్లో ఆయన రచనలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి. ఆయన సాహిత్యంపై జాతీయ స్థాయి సదస్సులు 12 జరిగాయి.

యౌవన దశలోనే 1958లో ‘దృష్టి’ అనే నాటికకు ఇనాక్ జాతీయ స్థాయి బహుమతి పొందారు. ఆయన రచించిన ‘జై హింద్’ అనే నాటికకు రాష్ట్ర ప్రభుత్వం 1965లో బహుమతి అందజేసింది. ముప్పై ఏళ్ల కిందటే 1988లో ఆయన రచించిన ‘ముని వాహనుడు’ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది. 2011లో గుర్రం జాషువా సాహిత్య పురస్కారం స్వీకరించారు. అప్పాజోస్యుల, విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ 2014లో నిర్వహించిన జాతీయ నాటికల పోటీల్లో లక్ష రూపాయల నగదుతో ఇనాక్ సన్మానం పొందారు. అదే ఏట గుంటూరులో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ రెండు లక్షల రూపాయల నగదు అవార్డును ఆయనకు అందజేసింది. దుగ్గిరాల జాషువా కళాపరిషత్తు వెండి కిరీటాన్ని బహూకరించింది.

విద్యారంగానికి అందజేసిన సేవలకు న్యూఢిల్లీలోని తెలుగు అసోసియేషన్, ఆలిండియా అంబేద్కర్ అసోసియేషన్ ఆయనను సత్కరించాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని 1993లో ఆయన పొందారు. ఆ తర్వాతి సంవత్సరం జాతీయ సమైక్యతా అవార్డును స్వీకరించారు. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారాన్ని మూడు సార్లు పొందారు. తెలుగు భారతి పురస్కారం, మల్లెమాల సాహిత్య పురస్కారం, ఎస్వీ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ స్వర్ణోత్సవ పురస్కారం, నాగార్జున విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం, దువ్వూరి రమణమ్మ పురస్కారం, ఎన్టీఆర్ లలిత కళా పురస్కారం, సిద్ధార్ధ కళాపీఠం వారి జీవిత కాల సాఫల్య పురస్కారం, అంబేద్కర్ జాతీయ సాహిత్య పురస్కారం, జూలూరి నాగరాజారావు సాహిత్య పురస్కారం, పైడి లక్ష్మయ్య సాహిత్య పురస్కారం, మద్రాసు తెలుగు అకాడమీ సాహిత్య పురస్కారం మొదలైనవెన్నో ఆయనను వరించాయి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2004లో తెలుగు భాషోత్సవ పురస్కారాన్ని అందజేసింది. తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారాన్ని 1999లో ఇనాక్ పొందారు. ‘అనంత జీవనం’ అనే నవలకు భారతీయ జ్ఞానపీఠ ట్రస్టు వారి 29వ మూర్తీదేవీ పురస్కారాన్ని ఆయన స్వీకరించారు. 2014లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. ‘ఆంధ్ర శ్రీ’, ‘కళా సరస్వతి’, సాహితీ సామ్రాట్’, ‘కథక చక్రవర్తి’ అనే బిరుదాలను ఆయన పొందారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం టెలివిజన్ మాధ్యమానికి అందజేసే నంది అవార్డుల జ్యూరీ సభ్యుడిగా 1992లో వ్యవహరించారు. జ్ఞానపీఠ స్థాయిలో కృషి చేసి, ఇప్పటికే మూర్తీదేవి సాహిత్య పురస్కారాన్ని పొందిన ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆలస్యంగా అయినా ప్రకటించడం ముదావహం. బెటర్ లేట్ దేన్ నెవర్…

Kolakaluri Inak recently ranked in Central Sahitya Academy Awards list

Telangana Latest News

Related Images:

[See image gallery at manatelangana.news]