వలస పక్షులకు విడిది ఖమ్మం

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం… పక్కా నాన్ లోకల్ సీటు   మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం గుమ్మం వలసపక్షులకు విడిది కేంద్రంగా మారింది. ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో ఇప్పటి వరకు గెలిచిన వారిలో మెజార్టీ ఎంపిలు నాన్ లోకల్ అభ్యర్ధులే. రాజకీయ చైతన్యానికి మారుపేరుగా, పోరాటాలకు పురిటిగడ్డగా పేరుగాంచిన ఖమ్మం జిల్లా మొదటి నుంచి కమ్యూనిస్టులకు కంచుకోటగా, కాంగ్రెస్‌కు పెట్టని కోటగా విరజిల్లుతూ వస్తుంది. అనేక ఉద్యమాలకు నిలయమైన ఈ జిల్లా ప్రకృతి సహజనవరులకు, అపార […]

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం… పక్కా నాన్ లోకల్ సీటు

 

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: ఖమ్మం గుమ్మం వలసపక్షులకు విడిది కేంద్రంగా మారింది. ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో ఇప్పటి వరకు గెలిచిన వారిలో మెజార్టీ ఎంపిలు నాన్ లోకల్ అభ్యర్ధులే. రాజకీయ చైతన్యానికి మారుపేరుగా, పోరాటాలకు పురిటిగడ్డగా పేరుగాంచిన ఖమ్మం జిల్లా మొదటి నుంచి కమ్యూనిస్టులకు కంచుకోటగా, కాంగ్రెస్‌కు పెట్టని కోటగా విరజిల్లుతూ వస్తుంది. అనేక ఉద్యమాలకు నిలయమైన ఈ జిల్లా ప్రకృతి సహజనవరులకు, అపార ఖనిజ సంపదగా పుట్టినిల్లుగా ఉంది. ఎన్నో విశేషాలను మూటగట్టుకున్న ఈ నియోజకవర్గంకు ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరుగగా 11 సార్లు కాంగ్రెస్, రెండు సార్లు పిడిఎఫ్, సిపిఎం, టిడిపి, వైఎస్‌ఆర్ సి పి పార్టీలు చేరో సారి గెలుపొందాయి. ఖమ్మం అనగానే కమ్యూనిస్టులు గుర్తుకొస్తారు. కాని ఖమ్మం పార్లమెంట్ స్ధానంలో మాత్రం తొలి రెండు ఎన్నికలను మినహాయిస్తే మిగిలిన అన్ని ఎన్నికల్లో వరుస విజయాలను దక్కించుకొని కాంగ్రెస్‌కు కంచుకోటగా మార్చారు. 1962 ఎన్నికల కాంగ్రెస్ పార్టీ బోణి చేసి ఆ తరువాత వెనక్కి చూడాల్సిన పనిలేకుండా వరసవిజయాలతో విజయబావుటాను ఎగురవేశారు.

ఖమ్మం జిల్లా ఏర్పాటుకు ముందే అంటే 1952 లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటైంది. అప్పట్లో వరంగల్ జిల్లాలో ఈ ప్రాంతం అంతర్‌ భాగంగా ఉండేది. ఖమ్మం పార్లమెంట్ స్ధానంలో వరంగల్ జిల్లాలోని డొర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండేది. ఆ తరువాత కాలంలో డోర్నకల్ స్ధానంలో పాలేరు, సూజాతనగర్ నియోజకవర్గాలు వచ్చి చేరాయి. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్వీభజనలో సూజాతనగర్ నియోజకవర్గం స్ధానంలో ఏర్పాటైన వైరా నియోజకవర్గం, కొత్తగా ఏర్పాటైన ఆశ్వారావుపేట నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగమయ్యాయి. ప్రస్తుతం ఖమ్మం పార్లమెంట్ నియోకవర్గంలో ఖమ్మం జిల్లాలోని అయిదు అసెంబ్లీ సెగ్మెంట్లైన ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర, వైరా తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఆశ్వారావుపేట నియోజకవర్గాలు కొనసాగుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 15,04,878 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 736222మంది,మహిళలు 768626 మంది ఉన్నారు.

స్వాతంత్య్రం అనంతరం 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించి పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఫి డి ఎఫ్) ను దాదాపు అన్ని స్థానాల్లో గెలిపించారు. 1956లో ఆంధ్ర రాష్ట్ర ఆవతరణ జరగిన తరువాత కొంత మార్పు వచ్చిన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ వెనక్కి చూసుకునే అవకాశం లేకుండా నిరాఘాటంగా గెలుస్తూ వచ్చారు. ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం ఇప్పటి వరకు అన్ని పార్టీలను అదరించింది, చివరికి వై ఎస్ ఆర్ సిపి పార్టీని కూడా ఆ ప్రాంత ప్రజలు అదరించిన చరిత్ర ఈ ప్రాంత ప్రజలకు ఉంది. అతి ముఖ్యంగా ఈ గడ్డపై పుట్టిన వాళ్ళకంటే స్ధానికేతరులను (నాన్ -లోకల్ లీడర్లు) ఈ నియోజకవర్గం అక్కున చేర్చుకుంది. దీంతో ఈ నియోజకవర్గానికి వసల పక్షుల విడిది కేంద్రంగా పేరు కూడా ఉంది.

1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పి డి ఎఫ్ నుంచి తమిళనాడకు చెందిన టి బి విఠల్ రావు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన గడియారం క్రష్ణారెడ్డిపై 80వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తరువాత 1957లో జరిగిన ఎన్నికల్లో కూడా పి డి ఎఫ్ నుంచి మళ్ళీ టి బి విఠల్ రావు స్పల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తరువాత 1962లో జరిగిన ఎన్నికల్లో టి లక్ష్మికాంతమ్మ ,కమ్యూనిస్టుల మధ్దతుతో పోటీ చేసిన పిడిఎఫ్ అభ్యర్ధి టి బి విఠల్ రావుపై భారీ మోజార్టీతో గెలుపొంది కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించారు.అయితే 1967 ఎన్నికల్లో మరోసారి టి లక్ష్మికాంతమ్మ పోటీ చేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్ధిగా మంచికంటి రాంకిషన్ రావు,సిపిఐ అభ్యర్ధిగా రావెళ్ళ జానకి రామయ్యలు తొలిసారి పోటీ చేసి ఒక్కరు 89,206,మరోక్కరు 67,068 ఓట్ల చొప్పున సాధించుకున్నారు.ఆతరువాత 1971 లో జరిగిన ఎన్నికల్లో కూడా వరుసగా మూడోసారి లక్ష్మికాంతమ్మ కాంగ్రెస్ నుంచి గెలుపొంది హ్యట్రిక్ ను నమోదు చేసుకున్నారు.ఈ ఎన్నికల అనంతరం 1977 ఎన్నికల్లో కాంగెస్ నుంచి జలగం కొండల్ రావు పోటీ చేసి సిపిఎం అభ్యర్ధి వై ఆర్ కె మూర్తిపై విజయం సాధించారు.ఆ తరువాత 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీల మధ్య చీలకలు వచ్చి సొంత పార్టీ నేతల మధ్య పోటీ ఏర్పడింది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్( ఐ) నుంచి జలగం కొండల్ రావు పోటీ చేయడగా కాంగ్రెస్ ( యు) నుంచి ఎన్ ఉపేంద్రయ్య పోటీ చేశారు.అయినప్పటికి రెండో సారి కూడా జలగం కొండల్ రావు 95483 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి కమ్యూనిస్టుల జిల్లాను కాస్తా కాంగ్రెస్ జిల్లాగా మార్చారు.1983 లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవవించినప్పటికి ఖమ్మం పార్లమెంట్ స్ధానం పై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.1984 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జలగం వెంగళరావు పోటీ చేసి సమీప సిపిఐ అభ్యర్ధి ఎన్ ప్రసాద్ రావు 91499 ఓట్ల అధిక్యతతో గెలుపొందారు. తిరిగి 1989 ఎన్నికల్లో కూడా జలగం వెంగళరావే పోటీ చేసి సమీప సిపిఎం అభ్యర్ధి వై ఆర్ కె మూర్తి పై 59252 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తరువాత 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పి వి రంగయ్యనాయుడు పోటీ చేసి సమీప సిపిఎం అభ్యర్ధి తమ్మినేని వీరభద్రంపై 5918 ఓట్ల తేడాతో విజయం సాధించారు.ఆ తరువాత 1996 ఎన్నికల్లో టిడిపి,సిపిఐ మద్దతుతో పోటీ చేసిన సిపిఎం అభ్యర్ధి తమ్మినేని వీరభద్రం సమీప కాంగ్రెస్ అభ్యర్ధి పి వి రంగయ్యనాయుడిపై 63291 ఓట్ల మెజార్టీతో అనూహ్య రితిలో గెలుపొంది ఖమ్మం జిల్లాలో సిపిఎంకు కూడా స్ధానం ఉందని నిరూపించారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌లోని గ్రూపు తగదాల వల్ల ఒక వర్గం తమ్మినేనికి మద్దతు ఇవ్వడంతో ఆయన విజయం సాధించారు.

ఆ తరువాత కేవలం 18 నెలలకే పార్లమెంట్ రద్దు అయ్యింది.ఆ తరువాత 1998 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా నాదేండ్ల భాస్కర్ రావు పోటీ చేసి సమీప సిపిఎం అభ్యర్ధి తమ్మినేని వీరభద్రంపై 11664 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.అప్పట్లో వాజ్‌పేయ్ ప్రభుత్వానికి జయలలిత తన మద్దతు ఉపసంహరించుకోవడంతో కేంద్ర ప్రభుత్వం పడిపోయింది. దీంతో 1999 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రేణుకచౌదరి పోటీ చేసి సమీప టిడిపి అభ్యర్ధి మద్దినేని బేబి స్వర్ణకుమారి పై 8398 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.ఆ తరువాత2004 ఎన్నికల్లో కూడా కాంగెస్ నుంచి మళ్లి రేణుకచౌదరి పోటీ చేసి సమీప టిడిపి అభ్యర్ధి నామ నాగేశ్వర్ రావుపై లక్షా8వేల888 ఓట్ల తేడాతో గెలుపొంది ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లాగా మరోసారి నిరూపించారు.2009 ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన నామ నాగేశ్వర్‌రావు తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి రేణుకచౌదరిపైలక్షా24వేల448 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి ఇక్కడ టిడిపికి కూడా బలం ఉందని నిరూపించారు.ఇక 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సిపిఐ తో పొత్తుపెట్టుకొని ఈ సీటును సిపిఐకి వదిలివేయగా ఆ పార్టీ నుంచి జాతీయ నాయకుడు డాక్టర్ కె నారాయణ పోటీ చేసి ఓడిపోయారు.అయితే ఈ స్ధానం నుంచి వై ఎస్ ఆర్ సిపి నుంచి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సమీప టిడిపి అభ్యర్ధి నామ నాగేశ్వర్‌రావుపై 12204 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.అటూ కమ్యూనిస్టులకు,ఇటూ కాంగ్రెస్‌కు పెట్టని కోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో వై ఎస్ ఆర్ సిపికి కూడా స్ధానం ఉందని నిరూపించారు.

మొత్తం మీద 1952 నుంచి 2014 వరకు ఇక్కడ జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన వారిలో జలగం వెంగళరావు,పి వి రంగయ్య నాయుడు,రేణుకచౌదరి కేంద్ర మంత్రి వర్గంలో మంత్రులుగా పనిచేశారు. అత్యధికంగా ఎక్కువ కాలం ఎంపిగా పనిచేసినవారిలో తేళ్ళ లక్ష్మికాంతమ్మ నిలువుగా అతి తక్కువ కాలం పనిచేసిన ఎంపిల్లో నాందేండ్ల భాస్కర్‌రావు,తమ్మినేని వీరభద్రం నిలిచారు.తెళ్ళ లక్షికాంతమ్మ వరుసగా మూడు సార్లు విజయం సాధించి హ్యట్రిక్ కొట్టారు.టిడిపి నుంచి గెలుపొందిన నామ నాగేశ్వర్‌రావు పార్లమెంట్‌లో టిడిపిప్లోర్ లీడర్‌గా వ్యవహరించారు,వైకాపా నుంచి గెలుపొందిన శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ నుంచి గెలుపొందిన ఏకైక ఎంపిగా,వైఎస్‌ఆర్ సిపి తెలంగాణ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు.ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామక్రమంలో ఆయన టి ఆర్ ఎస్‌లో చేరారు.ఈ నియోజకవర్గానికి జరిగిన 16 పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో పది మంది గెలిచినప్పటికి వారిలో ఆరుగురు నాన్ లోకల్ కు చెందిన వారే.జలగం సోదరులు,తమ్మినేని వీరభద్రం,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు మాత్రమే స్ధానికులుగా చెప్పవచ్చు.

 

 

 

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: