అవినీతి ‘నాగ’రాజు

 రూ.100కోట్ల పైబడి అక్రమాస్తులు గుర్తింపు, భారీ ఎత్తున బంగారు ఆభరణాలు స్వాధీనం
 బంధుమిత్రులు, కుటుంబసభ్యులపైనా ఎసిబి నజర్
 కీసర తహసీల్దార్ నాగరాజుతో పాటు విఆర్‌ఎ సాయిరాజు అరెస్టు, 14రోజుల రిమాండ్

మన తెలంగాణ/హైదరాబాద్: ల్యాండ్ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ పట్టుబడిన తహశీల్దార్ నాగరాజు, వీఆర్‌ఏ సాయిరాజ్‌లను అరెస్ట్ చేశామని ఎసిబి అధికారులు ప్రకటించారు. భారీ స్థాయిలో తహశీల్దార్ డబ్బులు లంచం తీసుకుంటు న్నట్లు తమకు సమాచారం అందిందని, ఆ మేరకు దాడులు నిర్వహించగా తహశీల్దార్ అవినీతి పర్వం బయటపడిందని తెలిపారు. 19 ఎకరాల 39 గుంటల భూమికి సంబంధించిన సమస్యను క్లియర్ చేయడానికి తహశీల్దార్ నాగరాజు లంచం డిమాండ్ చేశాడని, దానికి సంబంధించిన రూ.కోటి పది లక్షల డబ్బును లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని అధికారులు వివరించారు. ఉప్పల్‌లోని చౌలా శ్రీనాథ్ యాదవ్, శ్రీ సత్య డెవలపర్ల నుంచి రూ.2 కోట్లు డిమాండ్ చేసినట్లు తమ విచారణలో తేలిందని ఎసిబి అధికారులు తెలిపారు. తహశీల్దార్ వద్ద భారీ మొత్తంలో డబ్బుతో పాటు, అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని ఎసిబి అధికారులు వెల్లడించారు. తహశీల్దార్ నాగరాజు కారులో రూ.8 లక్షలు, అతడి ఇంట్లో రూ.28 లక్షల నగదును సీజ్ చేశామన్నారు. అలాగే 500 గ్రాముల బంగారు ఆభరణాలు, లాకర్ కీ దొరికాయని చెప్పారు. అనేక స్థిరాస్తులు తమ సోదాల్లో బయటపడ్డాయన్నారు. లంచం తీసుకున్న తహసీల్దార్ నాగరాజు, వీఆర్‌ఏ సాయిరాజ్, లంచం ఇచ్చినందుకు చౌలా శ్రీనాథ్ యాదవ్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశామని ఎసిబి అధికారులు తెలిపారు. నిందితులను ఎసిబి ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామన్నారు. నిందితులకు 14 రోజుల రిమాండ్‌ను ఎసిబి ప్రత్యేక కోర్టు విధించింది.
భూదందాలో రాజకీయ హస్తం…!
కీసర భూదందా కేసులో పలువురు రాజకీయ నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీకి చెందిన ప్రముఖ నేత సోదరుడి హస్తం ఉందంటూ తమ గ్రామంలో పలుమార్లు సదరు నేత సోదరుడు తిరిగాడంటూ రైతులు ఆరోపణలు చేస్తున్నారు. దయార గ్రామంలోని కొందరితో కలిసి భూఆక్రమణలకు పాల్పడుతున్నారని అన్నారు. కీసర భూదందాలో ఎసిబి విచారణ కొనసాగుతోంది. తహశీల్దార్ నాగరాజు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంజిరెడ్డి నుంచి కీలక సమాచాఆన్ని ఎసిబి అధికారులు సేకరించారు. విచారణలో భాగంగా అంజిరెడ్డి నివాసంలో ఓ ప్రజాప్రతినిధికి చెందిన లేఖలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో సదరు ప్రజాప్రతినిధి ఆర్టీఐ కింద భూముల సమాచారం కోరుతూ తహశీల్దార్‌కు రాసిన లేఖలు స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రజా ప్రతినిధితో అంజిరెడ్డికి ఉన్న సంబంధాలపై సిబిఐ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ ప్రజా ప్రతినిధి గతేడాది తన ఎంపీ ల్యాడ్స్ నిధులను విడుదల చేస్తూ మేడ్చల్ కలెక్టర్‌కు రాసిన లేఖలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, పట్టుబడ్డ తహసీల్దార్ నాగరాజు స్థిర, చరాస్తులు వంద కోట్ల పై మాటేనని ఎసిబి అధికారుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
తవ్వేకొద్దీ బయటపడుతున్న లీలలు
ఇదిలా ఉండగా భూదందా కేసులో నాగరాజు లీలలు అంతా ఇంతా కాదని చెబుతున్నారు. గతంలోనూ నాగరాజుపై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ నాగరాజు తన ధోరణి వీడలేదు. పైపెచ్చు రాజకీయ అండతో మరింత చెలరేగిపోయాడు. పెద్ద ఎత్తున అక్రమాస్తులను కూడబెట్టుకున్నాడు. ఎసిబి అధికారుల విచారణలో ఇప్పటికే రూ.100 కోట్ల పైబడి ఆక్రమాస్తులు వెలుగుచూడగా.. బినామీల పేరుతో ఏవైనా ఆస్తులు కూడగట్టాడా? అనే అంశంపైనే ఎసిబి అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నాగరాజుకు సంబంధించిన బంధుమిత్రులు, కుటుంబసభ్యులపై కూడా ఎసిబి నజర్ పెట్టింది. నాగరాజుకు చెందిన సెల్‌ఫోన్ కాల్‌డేటాతో పాటు వారి కుటుంబసభ్యుల, బంధుమిత్రుల ఆస్తులకు సంబంధించిన వివరాలను సైతం ఎసిబి అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

Keesara MRO Arrest due to took Bribe

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post అవినీతి ‘నాగ’రాజు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.