కాజీ నజ్రుల్‌ను మరిచిపోయామా?

Kazi Nazrul Islam is national poet of Bangladesh

 

మే 25వ తేదీ వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ రోజు ప్రఖ్యాత విప్లవకవి కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి. కాని ఎవరూ పట్టించుకున్నట్లే కనబడలేదు. ఆయన పుట్టి పెరిగిన పశ్చిమబెంగాల్ ప్రజలు ఆయన్ను మరిచిపోలేరు. కాని, ఈ సంవత్సరం ఒకవైపు కరోనా, మరోవైపు మహోగ్ర తుఫాన్ అంఫాల్ మధ్య బెంగాల్ నలిగిపోయింది.

కాజీ నజ్రుల్ ఇస్లాం బంగ్లాదేశ్ జాతీయ కవి. బెంగాలీ కవుల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ సమకాలీకుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ కు లభించిన ప్రజాదరణ కాజీకి లభించలేదు. కాని కాజీ కవితలు, గేయాలు చాలా బలమైనవని విశ్లేషకులు, విమర్శకులు ముక్తకంఠంతో చెబుతారు. అయినా కాజీ విషయంలో ఉదాసీనత ఎందుకుంది? సమాజాన్ని ఉర్రూతలూపి కొత్త మార్పులు సాధించిన కవిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు కాజీ పేరును అన్యమనస్కంగా తప్ప ప్రస్తావించలేని పరిస్థితి ఎందుకుంది? బెంగాల్ కవిత్వంలో గొప్ప గొప్పవారి పేర్ల ప్రస్తావన వచ్చినప్పుడు కాజీ పేరు ఎందుకు వెనక్కి పోతోంది?
ఈ ప్రశ్నలకు సమాధానం బహుశా కాజీ జీవితంలో ఉంది. ఆయన విప్లవాత్మక కవనశైలిలో కూడా బహుశా ఉంది.

చాలా చిన్న వయసు నుంచి కాజీ రాయడం ప్రారంభించాడు. గ్రామీణ బెంగాల్, ముఖ్యంగా తన ఊరు చురులియా, అంటే ప్రస్తుతం అసాన్ సోల్ పరిసర ప్రాంతాల జానపద, ప్రజాగేయాల బాణీలో రాసేవారు. టీనేజీ వయసులోనే తన ప్రాంతంలో లెతో గాయకుల కోసం పాటలు రాసేవాడు. ఆ కాలంలోనే హిందూ పురాణాలు, పౌరాణిక కథలను లోతుగా అధ్యయనం చేశాడు. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో బ్రిటీషు సైన్యంలో చేరాడు. క్వార్టర్ మాస్టర్ గా పనిచేస్తూ పర్షియన్ క్లాసికల్ కవులను చదువుకున్నాడు. హాఫిజ్, రూమీ వంటి కవులతో ప్రభావితమయ్యాడు. ఆ కాలంలోనే కరాచీలో విధిబాధ్యతలు నిర్వర్తించేవాడు, కరాచీలో ఉన్నప్పుడే బోల్షివిక్ విప్లవం గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత బ్రిటీషు వలసవాద సైన్యంలో తన పాత్ర ఏమిటి? తానేం చేస్తున్నాడనేది తీవ్రంగా ఆలోచించాడు. ఈ ఆలోచనల్లోనే కాజీ నజ్రుల్ ఇస్లాం విప్లవకవిగా ఆవిర్భవించాడు.

కొన్ని సంవత్సరాల తర్వాత దేశంలో గాంధీజీ సహాయనిరాకరణ ఉద్యమం ప్రారంభించారు. ఈ ఉద్యమం ఆయన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. లక్షలాది భారతీయులు అనుభవిస్తున్న బానిస సంకెళ్ళ గురించి ఆలోచించాడు. పేదరికం, దారిద్య్రాల గురించి ఆలోచించాడు. ఆయన కవిత్వమంతటా ఇది కనిపిస్తుంది. ఈ కాలంలో ఆయన రాసిన కవిత అగ్నిబీణలో ఈ భావాలు బలంగా కనిపిస్తాయి. ఇవన్నీ రాజకీయ కవితలే. ఆ తర్వాత దేశంలో ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమయ్యింది. దేశంలో హిందూ ముస్లిం సమైక్యత సాధించినప్పుడే బ్రిటీషు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బలంగా నిలబడగలమని నమ్మాడు.

1922లో ఆయన ’ధూమకేతు‘ అనే పత్రికకు సంపాదకత్వం వహించేవాడు. ధూమకేతు అంటే తోకచుక్క అని అర్థం. ఆ పత్రికలో ”ధూమకేతు కేవలం కమ్యునిజానికి అంకితమైన పత్రిక మాత్రమే కాదు, హిందూ ముస్లిం సమైక్యతకు అడ్డంకిగా మారిన అపార్థాలను తొలగించడం కూడా పత్రిక లక్ష్యం“ అని ప్రకటించాడు. కాజీ కవిత్వాన్ని పరిశీలిస్తే లౌకిక విలువల పట్ల పూర్తి నిబద్దత కనిపిస్తుంది. దాంతో పాటు సోషలిస్టు ఆదర్శాలు బలంగా కనిపిస్తాయి. ఈ రెండు లక్షణాల వల్లనే తన సమకాలీన సాహిత్యకారులతో ఆయనకు చాలా వివాదాలు కూడా ఉండేవి. ముఖ్యంగా షోని బరేర్ చీటీ అనే సాహిత్య మాసపత్రిక రచయితలతో ఆయనకు వివాదాలుండి.

షోనీబరేర్ చీటీ పత్రిక 1922 నుంచి వస్తున్న పాత పత్రిక. అప్పట్లో కల్లోల్ పేరుతో ప్రగతిశీల కవిత్వం ప్రచురించే పత్రిక రచయితలు ఈ సాహిత్యపత్రికలోని రచయితలను వ్యతిరేకించేవారు. ఈ రెండు గ్రూపుల రచయితల మధ్య వివాదాలు ఆనాటి బెంగాలీ మేధోవర్గంలోని విభేదాలను తెలియజేస్తున్నాయి. కల్లోల్ పత్రికలో రాసే రచయితలు మార్క్సిస్టు దృక్పథంతో ప్రభావితమైనవారు. ఈ రచయితలు ఠాగూర్ తదితరుల సాహిత్యాన్ని వ్యతిరేకించేవారు. బ్రిటీషు సామ్రాజ్యవాద పాలనలో సాధారణ ప్రజల దుర్భరస్థితిపై ఈ రచయితలు ఎక్కువగా రాసేవారు. అంతేకాదు, బెంగాల్ రాజకీయాల్లోను, సంస్కృతిలోను మతపరమైన విభేదాలను తీవ్రంగా వ్యతిరేకించేవారు. కల్లోల్ పత్రికకు కాజీ నజ్రుల్ చాలా రచనలు పంపారు. ప్రేమేంద్ర మిత్ర, బుద్ధదేవ్ బోస్ వంటి సాహిత్యకారులు ఈ పత్రికకు రాసేవారు.

కాజీ నజ్రుల్ వివాహమాడిన అమ్మాయి పేరు ప్రమీలా సేన్ గుప్త. ఈ వివాహం తర్వాత హిందూముస్లిం మతశక్తులన్నీ ఆయన్ను వ్యతిరేకించాయి. సామాజికంగా ఒక బహిష్కరణ వాతావరణాన్ని ఎదుర్కున్నారు. చివరకు బ్రహ్మసమాజ్ వంటి సంస్కరణాత్మక ఉద్యమంలో కూడా కొందరు ఆయన్ను వ్యతిరేకించారు. ఖిలాఫత్ ఉద్యమం విఫలమైన తర్వాత బెంగాల్ లో హిందూ ముస్లిం విభేదాలు, వైమనస్యాలు, విద్వేషాలు చాలా ఎక్కువయ్యాయి. మతకలహాలు జరిగాయి. అవిభక్త బెంగాల్ మతపరమైన అల్లర్లతో అట్టుడికింది. చిత్తరంజన్ దాస్ వంటి నాయకుల సమన్వయం వల్ల ఈ అల్లర్లను అదుపు చేయగలిగారు. డిసెంబర్ 1923లో హిందూ ముస్లిం ఒప్పందం కుదిరింది.

కాని 1925లో చిత్తరంజన్ దాస్ మరణించారు. ఆ తర్వాత ఈ ఒప్పందం కూడా కుప్పకూలింది. చిత్తరంజన్ దాస్ ఆదర్శాలను కాజీ నజ్రుల్ చాలా బలంగా సమర్థించేవారు. ఏప్రిల్ 1926లో కలకత్తా మరోసారి మతం మంటలకు ఆహుతయ్యింది. ఈ హింసాకాండకు చలించిపోయిన కాజీ నజ్రుల్ రాసిన కవిత ’కందారీ హోషియార్‘ ప్రసిద్ధ గేయం. కిషన్ నగర్ లో జరిగిన ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కాన్ఫరెన్సులో ఈ కవితను ఆయన స్వయంగా చదివారు. ఆ తర్వాత ఆయన రెండు ముఖ్యమైన వ్యాసాలు రాశారు. ఒకటి మందిర్ ఓ మస్జిద్ అంటే మందిరమా? మస్జిదా?? అన్న వ్యాసం ఆగష్టు 1926లో రాశారు. హిందూ ముసల్మాన్ అనే వ్యాసం సెప్టెంబరు 1926లో రాశారు. హిందూ ముస్లిమ్ సమైక్యతపై అనేక కవితలు రాశారు.

ఆకాలంలోని రాజకీయాలకు మించి ఆయన ఆలోచించాడు. హిందూ ముస్లిం ఘర్షణల విషయంలో ఆయన ఆలోచనలు చాలా లోతైనవి. సాంస్కృతిక కోణంలో ఆయన ఈ సమస్యను చూశాడు. అలాగే సామాజిక, చారిత్రక కోణంలో కూడా సమస్యను పరిశీలించాడు. కాజీ నజ్రుల్ జీవితచరిత్రను ”ది డిసెంట్ ఆఫ్ నజ్రుల్ ఇస్లామ్ : పోయట్రీ అండ్ హిస్టరీ“ పేరుతో రాసిన ప్రీతి కుమార్ మిత్రా వెలిబుచ్చిన అభిప్రాయాలివి.

బెంగాలీ సాహిత్యానికి సంబంధించి కవితా సౌందర్యదర్శనంలో, అప్పటి ప్రజాజీవన రంగాలన్నింటిలోను ఆయన లౌకికవిలువలను అభిలషించాడు. సాహిత్యం, సాహిత్యభాష అన్నింటిలోను లౌకికవాదాన్ని ముఖ్యమైన పరికరంగా ఆయన భావించాడు. సెక్యులరిజం అనేది కేవలం రాజకీయ పరికరంగా పరిమిత పరిధికి ఆయన కుదించలేదు. ఆయన కవిత్వంలో ఈ అభివ్యక్తి అనేకవిధాలుగా మనకు కనిపిస్తుంది. హిందూ ముస్లిం ప్రతీకలను ఆయన కలగలిపి వాడేవారు. పదాల ఎంపికలోను ఈ వైఖరి కనిపిస్తుంది. అందువల్లనే ఆయన కవిత్వం సుసంపన్నంగా, విప్లవాత్మకమైనదిగా పేరుప్రఖ్యాతులు పొందింది.

భారతీయ సాహిత్యంలో ఇది తనదైన ముద్ర వేసింది. పదసంపద విషయంలోను, కవిత్వ సౌందర్యదర్శన సంప్రదాయాల విషయంలోను ఆయన కవిత్వం బలమైన ముద్ర వేసింది. ఈ ప్రభావం 1947 వరకు మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా కొనసాగింది. ఆయన రాసిన విశ్వవిఖ్యాత కవిత ”బిద్రోహి“లో కొన్ని పంక్తులను పరిశీలిస్తే మనకు ఈ కవిత్వ సౌందర్యం అర్థమవుతుంది. బిద్రోహి అంటే తిరుగుబాటుదారుడు. 1921లో ఈ కవిత రాశారు. ఈ కవిత చదివితే ఆయన ఎంత సునాయాసంగా సంక్లిష్టమైన అంశాలను తనదైన కవనశైలిలో విప్లవాత్మకంగానే కాదు, తన కాలానికి ఎంతో ముందు కాలం నాటి కవితగా రాశాడనేది అర్థమవుతుంది.

అమి ఇస్రాఫీలేర్ షింగార్ మహా హుంకార్
అమి పినాక్ పానీర్ డొమరు, త్రిశూల్, ధర్మరాజేర్ ధోండో
ఇస్రఫీలు పూరించిన మహాకాహళ ఉగ్రభీకర హూంకారం నేనే
పినాకపాణి ఢమరుకాన్ని, త్రిశూలాన్ని, ధర్మరాజ దండా న్ని నేనే (అనువాదం : వ్యాసకర్త, ఇస్రాఫీలు : ఇస్లాంలో ఒక దైవదూత పేరు, ప్రళయదినానికి ముందు ఆయన బూర ఊదుతాడు, ఆ తర్వాత ప్రళయం వస్తుంది)
ఈ పంక్తుల్లో చాలా సునాయాసంగా హిందూ, ముస్లిం ధార్మిక ప్రతీకలను ఒకే వరుసలో ఉపయోగించిన తీరు గమనించదగింది. ఈ కవనశైలి అంతకు ముందు లేదు. మతతత్వంపై, మతపరమైన విభేదాలపై ఆయన వరుసగా తన కవితలతో దాడి చేశారు. ఫలితంగా హిందూ, ముస్లిం మతవర్గాల నుంచి వ్యతిరేకత ఎదుర్కున్నాడు. అప్పటి కవి సజనికాంత దాస్ దీనిపై తీవ్రమైన దాడి చేశాడు. కాజీ నజ్రుల్ పై దాడి చేయడం ద్వారా చిత్తరంజన్ దాస్ పై కూడా దాడి చేసేవాడు. చిత్తరంజన్ దాస్ హిందూ ముస్లిం సమైక్యత కోసం చేసిన ప్రయత్నాలపై దాడి చేసేవాడు. ’బిద్రోహి‘ కవితకు సజనికాంత్ దాస్ పేరడీ రాశాడు. ఈ పేరడిలోని కొన్ని పంక్తులు చూస్తే కాజీపై దాడి ఏ స్థాయిలో ఉండేదో అర్థమవుతుంది.

అమి బ్యాంగ్, అమీ బిద్రోహి బ్యాంగ్
అమి ఉల్లాషే కోభూ నీచే ఉఠీ డ్యాంగ్ డ్యాంగ్
అమి బ్యాంగ్.. దుయిత మాత్రో థాంగ్
నేను ఒక కప్పను. తిరుగుబాటుదారు కప్పను
ఉల్లాసంగా నాట్యం చేస్తున్నాను… ఉభయచర నాట్యం
నేను ఒక కప్పను
రెండు కాళ్ళ మత్తులో ఉన్నాను (అనువాదం : వ్యాసకర్త)
నజ్రుల్ తన కవిత్వంలో పర్షియన్, అరబిక్ పదాలు ఉపయోగించడాన్ని సజనీకాంత దాస్ తీవ్రంగా నిరసించాడు. ఈ వివాదంలోకి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు కూడా రావడంతో ఈ వ్యతిరేకత మరింత పెరిగింది. నజ్రుల్ తన కవిత్వంలో ఇస్లామిక్ పదాలను ఉపయోగించి, తీవ్రమైన వేగంతో రాసే కవిత అత్యంత తీక్షణంగా ఉండేది. కాని ఈ కవనశైలిని అప్పటి కొందరు మేధావులు వ్యతిరేకించడంతో ఒక విధమైన మతపరమైన విభజన కూడా చోటు చేసుకుంది. సాహిత్యంలో, సాహిత్యసౌందర్యదర్శనంలోను ఈ విభజన వచ్చేసింది.

డిసెంబర్ 1927లో రవీంద్ర పరిషద్ లో రవీంద్ర నాథ్ ఠాగూర్ చేసిన ప్రసంగంలో ఈ కవిత్వాన్ని, కవిత్వంలో వాడే పదాలను విమర్శించారు. కొత్త తరం కవులు సంస్కృతపదం ’రక్త్‘ బదులు పర్షియన్ పదం ’ఖూన్‘ వాడడాన్ని నిరసించారు. కాజీ నజ్రుల్ అప్పట్లో రాసిన ’కందారి హోషియార్‘ కవితలో ఈ పదాన్నే ఉపయోగించాడు. ఈ కవిత 1926లో రాశాడు. ఆ కవిత అసాధారణ ప్రజాదరణ పొందింది. ఠాగూర్ తన ప్రసంగంలో కాజీ పేరు ప్రస్తావించలేదు. కానీ ఆయన నజ్రుల్ పైనే తన విమర్శ ఎక్కుపెట్టాడని చాలా మందికి స్పష్టంగా అర్థమైంది. నిజానికి కాజీని ఠాగూర్ చాలా ఇష్టపడేవారు.

’ఖూన్‘ పదం పర్షియన్ పదం. బెంగాలీలోను, హిందీలోను ఈ పదం హత్య అనే భావాన్ని కూడా సూచిస్తుంది. పర్షియన్ లో ఖూన్ అంటే రక్తమని అర్థం. నజ్రుల్ రక్తమనే అసలు అర్థంతో ఈ పదాన్ని ఉపయోగించారు. ఠాగూర్ ప్రసంగం బంగ్లార్ కథ పత్రికలో అచ్చయ్యింది. షోనిబరేర్ చిట్టి పత్రిక ప్రారంభించిన దాడుల్లో ఇది కూడా భాగంగా కాజీ భావించాడు. ఆ తర్వాత కాజీ 1927 డిసెంబరులో ఆత్మశక్తి పత్రికలో ’బాదోర్ ప్రీతీ బాలీర్ బంద్‘ పేరుతో ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసంలో సాహిత్యభాషపై చర్చించాడు. ఖూన్ అనే పదం వాడితే ఈ వ్యతిరేకత ఎందుకు వచ్చిందో చెప్పాడు. ఇదంతా ఇస్లామీయ భాష పై హిందూ అగ్రవర్ణ ఆధిపత్య ధోరణి చేస్తున్న దాడికి నిదర్శనంగా పేర్కొన్నాడు.

అంతటితో ఆగలేదు, షోనిబరేర్ చిట్టి పత్రికలో రాసే రచయితలు సాహిత్య సౌందర్యదర్శనం విషయంలో సంకుచిత దృష్టితో వ్యవహరిస్తున్నారని, స్వయంగా రవీంద్రనాథ్ ఠాగూర్ రచనల్లోను పర్షియన్ అరబీ పదాలున్నాయని విమర్శించాడు. ఈ పదాలు ఆధునిక బెంగాలీ వికాసానికి తోడ్పడ్డాయని చెప్పాడు. ఇది సాహిత్య సంప్రదాయమని, ఠాగూర్ కూడా దీన్ని పాటించారని, అనేకమంది రచయితలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని, బెంగాలీ భాషా వికాసానికి ఇది తోడ్పడిందని అన్నాడు. ఫిబ్రవరి 1928లో ఆత్మకథ పత్రికలో ప్రమద చతుర్థి రాసిన వ్యాసంతో ఈ వివాదం ముగిసింది. ’బాంగో సాహిత్యే ఖునేర్ మామ్లా‘ (బెంగాలీ సాహిత్యంలో ’రక్తం‘ వ్యవహారం) అని ఆయన రాశారు. తర్వాత కొంతకాలానికి చతుర్ది స్వయంగా కాజీ, ఠాగూర్ మధ్య ముఖాముఖి ఏర్పాటు చేశారు.

ఈ మొత్తం వివాదంలో గమనించవలసింది ఏమిటంటే, సంప్రదాయవాదులు, మతతత్వవాదులకు వ్యతిరేకంగా పోరాటం. షోనిబరేర్ చిట్టి రచయితలు, కవులను కాజీ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఎందుకంటే, వారంతా అగ్రకుల ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారని భావించాడు. ఆధునిక యూరోపియన్ కవిత్వ సౌందర్యతత్వ దర్శనాన్ని స్వాగతించలేని ధోరణిగా భావించాడు. కాజీ నజ్రుల్ తో పాటు అప్పట్లో కల్లోల్ పత్రికలో రాసిన రచయితలు, కవులు బెంగాలీ సాహిత్యంలో ఇతర భాషా ప్రభావాలను స్వీకరించే ధోరణిని, రాజకీయ కవిత్వాన్ని, లౌకిక స్ఫూర్తిని బలపరుస్తూ రాశారు.

 

                                                                                        (దేబజాని సేన్ గుప్త, ది వైర్)

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కాజీ నజ్రుల్‌ను మరిచిపోయామా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.