కౌన్సిల్‌కు కవిత నామినేషన్

Kavitha

 

అనంతరం నిజామాబాద్‌కు బయలుదేరిన మాజీ ఎంపి

దారిపొడవునా స్వాగతాలు, మంగళ హారతులు

మనతెలంగాణ/హైదరాబాద్: పూర్వ నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి అభ్యర్థిగా టిఆర్‌ఎస్ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజమాబాద్ జిల్లాకు చెందిన టిఆర్‌ఎస్ శాసనభ్యులు,శాసనమండలి సభ్యులు కవితను శాసనమండలి అభ్యర్థిగా ప్రకటించాలని తీర్మానం చేసి పార్టీ అధినేత ముఖ్యంత్రి కె.చంద్రశేఖర్ రావుకు పంపించడంతో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ మాజీ సభ్యురాలు, జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత టిఆర్‌ఎస్ అధిష్టానం ఆదేశాలమేరకు బుధవారం నిజమాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి నిజమాబాద్ కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. 2015లో నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో గెలిచిన టిఆర్‌ఎస్ అభ్యర్థి భూపతిరెడ్డిపై అనర్హత వేటుపడటంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది.

స్థానిక సంస్థల ఓట్లతో గెలిచే ఈ పదవి 2022 జనవరి 4 వరకు ఉంటుంది. నామినేషన్ దాఖలు చేసే ముందు కల్వకుంట్ల కవిత వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నామినేషన్ వేసేందుకు బయలుదేరేముందు మినిస్టర్స్ క్వాటర్స్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, డిసిసిబి ఛైర్మన్ పోచారం భాస్కర్‌తో పాటు పలువురు శాసనసభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నిజమాబాద్ జిల్లానుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కవిత భారీ మెజారిటీతో గెలుస్తారనే ధీమాను వ్యక్తం చేశారు. అనంతరం టిఆర్‌ఎస్ అభిమానులు, నాయకులతో కలిసి ర్యాలీగా కవిత నిజమాబాద్‌కు బయలుదేరారు. దారిపొడుగునా అభిమానులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. మహిళలు కవితను ఆహ్వానిస్తూ మంగళ హారతులు ఇచ్చారు. ప్రధానంగా తూఫ్రాన్, బిక్కనూరు, కామరెడ్డి, డిచ్‌పల్లి,మాధవ్‌నగర్, నిజమాబాద్ రహదారుల్లో కవితకు భారీ స్వాగతాలు పలికారు. దారిపొడుగునా టిఆర్‌ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఎంఎల్‌సి ఎన్నిక లాంఛనమే
నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఉపఎన్నికల్లో కల్వకుంట్ల కవిత భారీ మెజారిటీతో గెలవనుందనే అంచనాను టిఆర్‌ఎస్ వేసింది. ఈ ఎన్నికలు లాంఛనంగా పార్టీ భావిస్తోంది. ఉమ్మడి నిజమాబాద్ జిల్లా ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు టిఆర్‌ఎస్ అధిష్టానం కవితను పోటీలోకి దించింది. ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఓట్లు 824 ఉన్నాయి. వీటిలో 532 ఓట్లు టిఆర్‌ఎస్‌కు ఉన్నాయి. కాంగ్రెస్‌కు 140 ఓట్లు, బిజెపికి 85 ఓట్లు ఉన్నాయి. అలాగే మిగతా ఓట్లలో అధికశాతం ఎంఐఎంకు ఉండగా సుమారు 10 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఈ నేపథ్యంలో కవిత గెలుపు లాంఛనమేనని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. కవిత గెలుపుతో నిజమాబాద్ జిల్లా అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందనే ఆశాభావాన్ని మంత్రి వేముల వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ బతుకమ్మకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చిన కవిత మహిళాసాధికారితకోసం కృషి చేస్తున్న మాననీయ నేతని చెప్పారు. మండలిసభ్యురాలిగా నామినేషన్ వేస్తున్న సందర్భంగా కవితకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. కవితను ఎంఎల్‌సి అభ్యర్థిగా ఎంపికచేసినందుకు సిఎం కెసిఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సంప్రదాయాలు, సంస్కృతికి గుర్తింపు తెచ్చిన కవితను శాసన మండలి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల మహిళల పక్షాన సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ విప్ కర్నెప్రభాకర్ మాట్లాడుతూ కవితను నిజమాబాద్ స్థానిక సంస్థల అభ్యర్థిగా ఎంపికచేయడంతో టిఆర్‌ఎస్‌లో ఉత్సాహం నెలకొందని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ శాసనమండలికి కవిత ప్రాతినిథ్యం అవసరమన్నారు.

కవిత తెలంగాణ మహిళలకు ఆత్మగౌరవ ప్రతీకని చెప్పారు. కవిత శాసనమండలికి నామినేషన్ వేసిన సందర్భంగా ఎర్రబెల్లి శుభాకాంక్షలు తెలిపారు. శాసనమండలి అభ్యర్థిగా కవితను ఎంపికచేసినందుకు సిఎం కెసిఆర్‌కు, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి.రామారావుకు ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కవిత ఎంఎల్‌సిగా శాసన మండలికి వస్తే మండలి గౌరవం మరింత పెరుగుతుందన్నారు. నాటి ఉద్యమం నుంచి నేటి తెలంగాణ వరకు సాంస్కృతిక సేనానిగా కవిత పనిచేశారని పోచంపల్లి గుర్తు చేశారు.

హర్షం వ్యక్తం చేసిన ఎన్‌ఆర్‌ఐ శాఖలు
శాసనమండలికి కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేయడంపట్ల టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ విభాగాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ విభాగం కోఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, పార్లమెంట్ మాజీ సభ్యురాలుగా కవిత అందిస్తున్న సేవలు ఎంతో ఉన్నతమైనవని చెప్పారు. కవిత భారీ మెజారిటీతో విజయం సాధిస్తారనే ధీమాను వ్యక్తం చేశారు.నామినేషన్ దాఖలు చేసిన కవితకు 50 దేశాల టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ విభాగాలు శుభాకాంక్షలు తెలిపాయని ఆయన చెప్పారు.

అలాగే టిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సౌత్ ఆఫ్రిక శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల కవితకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజానాయకురాలైన కవితకు, ఎంఎల్‌సి అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన సిఎం కెసిఆర్‌కు టిఆర్‌ఎస్ యుకె ఎన్‌ఆర్‌ఐ శాఖ సలహామండలి ఛైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను విశ్వవ్యాప్తంచేసిన కవితకు స్థానిక సంస్థల ఓటర్లు బాధ్యతాయుతంగా ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సాధన ఉద్యమంలో కవిత చేసిన పోరాటం ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిందని ఆయన గుర్తు చేశారు.

ఎక్కడ ఉంటే అక్కడ గౌరవం పెరుగుతుంది
కవితక్క ఏస్థానంలో ఉన్నా ఆస్థానానికి గౌరవం, ప్రాధాన్యత పెరుగుతుందని రాజ్యసభసభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కవిత రాకతో శాసనమండలి ప్రాధాన్యత మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. నిజమాబాద్ స్థానిక సంస్థల ఎంఎల్‌సి అభ్యర్థిగా నామినేషన్ వేసినందుకు కవితకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నిజమాబాద్ ఎంఎల్‌సి అభ్యర్థిగా కవితను సిఎం కెసిఆర్ ఎంపికచేయడం సరైన నిర్ణయమని పేర్కొన్నారు.

Kavitha filed nomination as a Legislative Council candidate

The post కౌన్సిల్‌కు కవిత నామినేషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.