వంద శాతం కష్టపడే నటుడు కార్తికేయ…

Karthikeya

 

‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ, అనఘ హీరోహీరోయిన్లుగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ప్రవీణ కడియాల సమర్పణలో అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘గుణ 369’. ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు బోయపాటి శ్రీను కలిసి ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ “ఈ ట్రైలర్ చూస్తుంటే బోయపాటి సినిమా ట్రైలర్ చూసినట్టుగా ఉంది.

ఇక కార్తికేయతో గీతా ఆర్ట్ బ్యానర్‌లో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాను. సినిమా కోసం వంద శాతం కష్టపడే నటుడు కార్తికేయ. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ “నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అర్జున్ జంధ్యాల ఈ చిత్రంతో దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. అర్జున్‌కు ఏ బాధ్యత అప్పగించినా పూర్తి చేసే వరకు నిద్రపోడు. ఈ చిత్రం కోసం అతని స్నేహితులు నిర్మాతలుగా మారడం అర్జున్ అదృష్టం.

కార్తికేయ నటించిన ‘ఆర్‌ఎక్స్ 100’ కంటే ఈ సినిమా మరింత కొత్తగా ఉంటుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ “కథ విన్న తర్వాత వెంటనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. సినిమా చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఫైట్స్ కూడా సహజంగా, సందర్భానుసారంగా ఉంటాయి. ఇప్పటివరకు నన్ను ‘ఆర్‌ఎక్స్ 100’ హీరో అని పిలుస్తున్నారు. ఈ చిత్రంతో గుణ అని పిలుస్తారు.

ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది”అని చెప్పారు. దర్శకుడు అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ “యదార్థ సంఘటన ఆధారంగా చేసిన చిత్రమిది. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చే చిత్రమిది”అని అన్నారు. నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ “నిర్మాతలుగా ఇంత మంచి చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. సెకండాఫ్‌లో అద్భుతమైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ చిత్రంతో హీరో కార్తికేయ మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటాడు”అని చెప్పారు.

Karthikeya hard working Actor for Film

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వంద శాతం కష్టపడే నటుడు కార్తికేయ… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.