కర్ణాటక సంక్షోభం!

  కర్ణాటకంలో అతిపెద్ద రాజకీయ నాటకానికి తెర లేసింది. రోజుకో మలుపు తిరుగుతున్న క్యాంపు రాజకీయాలు ప్రభుత్వాన్ని నిలబెడతాయా పడగొడతాయా అన్న సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అధికారం కోసం సిద్ధాంతాలు పక్కన పెట్టి రాద్ధాంతాలు మొదలయ్యాయి. రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికల్లో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించినా అధికారానికి అడుగు దూరంలోనే ఆగిపోయింది. 224 స్థానాలున్న కర్ణాటకలో 104 సీట్లు గెలుచుకున్నా మ్యాజిక్ ఫిగర్‌కు 9 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో 80 సీట్లకే పరిమితమైనప్పటికీ […] The post కర్ణాటక సంక్షోభం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కర్ణాటకంలో అతిపెద్ద రాజకీయ నాటకానికి తెర లేసింది. రోజుకో మలుపు తిరుగుతున్న క్యాంపు రాజకీయాలు ప్రభుత్వాన్ని నిలబెడతాయా పడగొడతాయా అన్న సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అధికారం కోసం సిద్ధాంతాలు పక్కన పెట్టి రాద్ధాంతాలు మొదలయ్యాయి. రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికల్లో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించినా అధికారానికి అడుగు దూరంలోనే ఆగిపోయింది. 224 స్థానాలున్న కర్ణాటకలో 104 సీట్లు గెలుచుకున్నా మ్యాజిక్ ఫిగర్‌కు 9 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో 80 సీట్లకే పరిమితమైనప్పటికీ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదిపి మరో ఇద్దరు స్వతంత్రులు, ఒక బిఎస్‌పి ఎంఎల్‌ఎను కలుపుకుని 37 సీట్లున్న జెడి(ఎస్) నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బిజెపి ఆశలను వమ్ము చేసింది. నీవు నేర్పిన విద్యే నీరజాక్షా అన్నట్టుగా గోవా, మణిపూర్, మేఘాలయాల్లో బిజెపి అనుసరించిన వ్యూహాన్నే కర్ణాటకలో కాంగ్రెస్ అమలుపరించింది. అప్పటి నుంచీ ఈ సంకీర్ణం అనేక సవాళ్ల మధ్యే సాగుతున్నది. అనైతిక, అప్రజాస్వామిక చర్యలకు తెర లేపింది.

బిజెపి తన ప్రయత్నాలను విరమించుకోకపోగా కొత్త మార్గాలకు తెర తీయడంతో ఆట మళ్లీ మొదలయింది. ఈ ఆటలో ఎవరికి కావాల్సిన ముగింపునకు వారు ప్రయత్నిస్తుండటంతో ఊహించని మలుపులతో ఇరు పార్టీల క్యాంపు రాజకీయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కర్ణాటక రాజకీయాల్లో మరోసారి గందరగోళం ఏర్పడింది. జులై 12 శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ తలెత్తిన ఈ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. కుర్చీల ఊగులాటలో, పదవుల పందేరంలో వచ్చిన అసమ్మతి వల్లో, ఆ పీఠం పై కన్నేసిన ప్రతిపక్షాల్ల వల్లనో కారణం ఏదైతేనేమి కర్ణాటక రాజకీయ సంక్షోభం రసకందాయంలో పడింది. దేశం యావత్తు ఈ అంశాన్ని పరికించి చూస్తుంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం ఉంటుందా? కూలుతుందా అన్నది కొద్ది రోజుల్లేనే తేలనుంది. కుర్చీని కాపాడుకోడానికి ఒకరు.. లాగేసుకోడానికి మరొకరు బెంగళూరు వీధులు, ముంబయి, సుప్రీంకోర్టు వేదికగా పోరాడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఏం జరగొచ్చు..? ఈ వ్యవహారంలో స్పీకరు, గవర్నరు, సిఎం, సుప్రీంకోర్టు ఎలాంటి పాత్ర పోషించబోతున్నాయో ముందుముందు తెలియనుంది.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే వేళ కర్ణాటకలో డజనుకు పైగా ఎంఎల్‌ఎలు రాజీనామాలు చేసిన తర్వాత కాంగ్రెస్, జెడి(ఎస్) కూటమి ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. జెడిఎస్ మాజీ అధ్యక్షుడు, అసమ్మతి నేత హెచ్ విశ్వనాథ్ ఎంఎల్‌ఎలను తీసుకుని స్పీకర్ రమేష్ కుమార్ చాంబర్ దగ్గరకు చేరుకున్నప్పుడు ఇదంతా మొదలైంది. అయితే స్పీకర్ అప్పటికే అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ ఎంఎల్‌ఎలందరూ రాజీనామా చేయాలని అక్కడికి చేరుకున్నారు. స్పీకర్ వారిని కలవకపోయినా, వారు తమ రాజీనామాలను స్పీకర్ ఆఫీసులోని కార్యదర్శికి అందించారు. కర్ణాటక సంక్షోభం అధికార జెడి(ఎస్), కాంగ్రెస్ నాయకత్వానికి తల నొప్పిగా మారింది.

తాజా పరిణామాలపై చర్చించడానికి కాంగ్రెస్ అగ్ర నాయకులు ఢిల్లీలో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎంఎల్‌ఎల రాజీనామా, ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అటు కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, సిద్దరామయ్య, జి.పరమేశ్వర తదితరులు బెంగళూరులో సమావేశమై భవిష్యత్ కార్యాచర ణపై సమాలోచనలు జరిపారు. సమస్యను పరిష్కరించడానికి ట్రబుల్ షూటర్ డికె శివకుమార్‌ను రంగంలోకి దింపారు. అసంతృప్త ఎంఎల్‌ఎలతో చర్చించడానికి ఆయన ముంబై బయలుదేరి వెళ్లారు. ఐతే, డికె రాకను పసిగట్టిన రెబల్ ఎంఎల్‌ఎలు వ్యూహం మార్చారు. వారంతా ముంబై నుంచి గోవాకు మకాం మార్చ నున్నట్లు సమాచారం. అటు, జెడి(ఎస్) ఎంఎల్‌ఎలను కూర్గ్‌లోని ఓ రిసార్టుకు తరలించారు.

అలాగే ఇంకో వైపు ముఖ్యమంత్రి కుమారస్వామి పీఠం వదలడానికి ససేమీరా అనడంతో కర్ణాటకలో రాజకీయ సంక్షోభం రోజుకొక మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. అధికారాన్ని కాపాడుకునేందుకు జెడి(ఎస్), -కాంగ్రెస్.. అధికారాన్ని దక్కించుకునేందుకు అటు బిజెపి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ క్రమంలో అసంతృప్త నేతలకు పదవులు ఇచ్చేందుకు వీలుగా 21 మంది కాంగ్రెస్, 9 మంది జెడి(ఎస్) మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు ఇద్దరు ఇండిపెండెంట్ ఎంఎల్‌ఎలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసీ బిజెపికి మద్దతు ప్రకటించారు. ఎంఎల్‌ఎలను ముంబైకి తరలించిన విమానం బిజెపిదేనంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.అసమ్మతి ఎంఎల్‌ఎల డిమాండ్‌ను గోతి కాడ నక్క లాగా ఎదురు చూస్తున్న బిజెపి నెరవేరుస్తామని చెప్పడంతో వీరంతా బిజెపి వైపు మొగ్గు చూపారు. అందుకే బిజెపి ఈ మొత్తం వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. కానీ కొందరేమో మొదలు చేసింది కూడా అదేనని ఆరోపిస్తున్నారు. అయితే కర్ణాటక ప్రభుత్వంలో సంక్షోభానికి తమ పార్టీ కారణం కాదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు స్పష్టం చేశారు. కర్ణాటకలోని రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అవసరమైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

అదే సమయంలో కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సిఎం సిద్ధరామయ్యే కారణమని మాజీ ప్రధాని దేవెగౌడ ఆరోపించారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేస్తే రాజకీయ సంక్షోభం ముగుస్తుందని, ఇదే విషయాన్ని రాజీనామా చేసిన ఎంఎల్‌ఎలు కూడా చెబుతున్నారని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనను మళ్లీ సిఎంను కానివ్వబోమని చెప్పారు. కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చేందుకే సిద్ధరామయ్య తన సన్నిహిత ఎంఎల్‌ఎలతో రాజీనామాలు చేయించారని ఆయన ఆరోపించారు.అసలు ఈ సంక్షోభానికి ముఖ్య కారకుడు కుమారా స్వామియేనని అతని ఒంటెద్దు పోకడలే కారణమని అసమ్మతిలు స్పష్టం చేశారు. ఈ సమయంలో అసలు ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది. ఎవరెవరు ఎన్ని రకాలుగా ప్రతిస్పందించవచ్చు. అనే విషయానికి వస్తే …

ముఖ్యమంత్రి
1 శాసనసభలో బల పరీక్షకు సిద్ధపడవచ్చు. 2 అంతకు ముందే అసమ్మతి ఎంఎల్‌ఎలతో సర్దుబాటు చేసుకొని సంక్షోభాన్ని నివారించావచ్చు. 3 బల పరీక్షకు ముందే రాజీనామా చేయవచ్చు.

స్పీకర్ పాత్రేమిటి?
1. రాజీనామాలు చేసిన ఎంఎల్‌ఎలలో ముగ్గురిని జులై 12న తన ముందు హాజరు కావాలని స్పీకర్ రమేశ్ కుమార్ కోరారు. ఎవరి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా వారు రాజీనామా చేస్తున్నారని తెలుసుకోవడానికి ప్రిసైడింగ్ అధికారి ముందు హాజరు కావడమనేది తప్పనిసరి. 2. రాజీనామాలను ఆమోదించడం, తిరస్కరించడమనేది స్పీకరు నిర్ణయం. అయితే.. తన ముందు హాజరుకావాలని స్పీకరు కోరిన ఎంఎల్‌ఎలంతా కాంగ్రెస్ పార్టీకి విధేయులు. దీంతో వారు రాజీనామాలు ఉపసంహరించుకునే అవకాశాలూ ఉన్నాయి. అనర్హత వేటు పడే అవకాశాలుండడంతో రాజీనామాలు ఉపసంహరించుకోవచ్చు. 3. రాజీనామాలపై ఇంత సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని ఏమీ లేదు. దీంతో స్పీకర్ వాటిని తొక్కిపెట్టనూవచ్చు. 4. రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభ్యర్థనను స్పీకర్ పరిగణనలోకి తీసుకోవచ్చు. అలాగే.. ఎంఎల్‌ఎలు సమర్పించిన రాజీనామాలు స్పీకర్ ఫార్మాట్‌లో లేకపోతే వాటిని ఆమోదించకపోవచ్చు.

గవర్నర్ పాత్రేమిటి?
1. రెబల్ ఎంఎల్‌ఎల రాజీనామాలు, బిజెపి విజ్ఞాపన నేపథ్యంలో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని ముఖ్యమంత్రిని గవర్నరు కోరవచ్చు. 2. అసెంబ్లీని కొద్ది కాలం పాటు తాత్కాలికంగా రద్దు చేయొచ్చు. ఏది ఏమైనా అతి జుగుప్సాకరంగా మారి రోజు రోజుకి హీనాతిహీనంగా దిగజారుతున్న రాజకీయ విలువల్ని పునరుద్ధరించడంలో రాజ్యాంగ వ్యవస్థలు పార్టీలకు అతీతంగా పని చేసి ప్రజాస్వామ్యం పట్ల గౌరవ భావాన్ని తగ్గకుండా చేయాలని కోరుకోవడం తప్ప మనం చేసేది ఏముంది.

Karnataka Political Crisis

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కర్ణాటక సంక్షోభం! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: