వివాదాల్లో వీరవనిత

kangana

బాలీవుడ్ క్వీన్ కంగనా రానౌత్ తెరమీద ఎన్ని ధైర్య సాహసాలు ప్రదర్శిస్తుందో నిజజీవితంలో కూడా అంతే ధైర్యంగా ఉంటుంది. ఏ విషయం మాట్లాడాల్సి వచ్చినా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. వాటివల్ల వివాదాల్లో ఇరుకున్న  సందర్భాలూ ఉన్నాయి.

మిమ్మల్ని విమర్శించే వారిని బెదిరిస్తారట కదా?

“సద్విమర్శలు చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారు. అర్థంపర్థం లేని విమర్శలు చేస్తేనే కోపం వస్తుంది. ఉదాహరణకి ‘మణికర్ణిక’ సినిమాని సెన్సార్ వారు ఓకే చేసిన తర్వాత కూడా కొందరు పనిగట్టుకుని అవాకులు చవాకులు పేలారు. అలాంటి వారి నోళ్లు మూయించాలంటే అలా గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సిందే! నేనూ అదే పని చేస్తాను. దాన్ని బెదిరించడమంటారా?”

మీలో ఈ రెబల్ మనస్తత్వానికి కారణం మీ కుటుంబ వాతావరణమేనా?

“నూటికి నూరుశాతం అక్కడే బీజం పడింది. ఆడపిల్లల విషయంలో మా కుటుంబంలో చాలా వివక్ష చూపేవారు. అది సహించలేకపోయేదాన్ని. మా కుటుంబంలో మొదలైన ఈ వివక్ష ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంది. వివక్షను ప్రశ్నించినందుకు నా మీద రెబల్ అన్న ముద్ర వేశారు. దానికి నాకేమీ బాధ లేదు. ఇక్కడ నాకు లభించిన ఈ గుర్తింపు ఆనందం కలిగిస్తోంది.”

మీ కుటుంబంలో వివక్ష ఎందుకంటారు?

“మా పర్వత ప్రాంతంలో ఆడపిల్ల పుట్టడం అంటే ఓ విషాదం కిందే లెక్క! నా కన్నా ముందు అమ్మాయి కావడంతో నేను మగ పిల్లాడిని అయితే బాగుంటుంది అనుకున్నారు. నా తర్వాత వారి కోరిక తీరడానికి తమ్ముడు పుట్టాడు. వాడు పుట్టిన తర్వాత మా అక్కాచెల్లెళ్ల మీద వివక్ష ఎక్కువైంది. ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయిన విషయాలు, ఇప్పుడు తవ్వుకుంటే లాభం లేదు.

వెండితెర మీద రాణిలా వెలిగిపోతున్న మీ విజయం వెనుక రహస్యం ఏంటి?

“మామూలు సినిమాలు, రొటీన్ పాత్రలు చేయడం నాకు నచ్చదు. నేను చేసే పాత్రలో జీవం ఉండాలి. దాంతోపాటు హాస్యం, చిన్న మెసేజ్ అన్నీ ఉండాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. కనుకే ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్నారు. లేకపోతే నా మీద వచ్చే ఆరోపణలకీ, విమర్శలకీ ఎప్పుడో తెర వెనుకకి వెళ్లిపోయేదాన్ని. ఈ రోజు నేనీ స్థాయిలో ఉండడానికి కారణం నా నిజాయితీనే!”

మీ సక్సెస్ వెనుకున్నదెవరు?

“నా వెనుకున్నది మా సిస్టర్ రంగోలీ చందేల్. చిన్న వయసులోనే యాసిడ్ దాడికి గురైంది. తనంటే నాకు చాలా ఇష్టం. తనకూ అంతే! నా విషయాలన్నీ తనే చూసుకుంటుంది. కొన్నిసార్లు కథల ఎంపికలో మంచి సలహాలు, సూచనలిస్తుంది. నాకు ఇంత పేరు రావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తన ప్రమేయం చాలా ఉంది.”

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సినీనటి జయలలిత జీవిత చరిత్రను ఎ.ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘తలైవి’ అని పేరు పెట్టారు. జయలలిత పాత్రలో బాలీవుడ్ తార కంగనారానౌత్ నటిస్తోంది. ఎంజీఆర్ పాత్రలో అరవింద్‌స్వామి, కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించనున్నారు. అమ్మ వేషధారణలో ఉన్న కంగానా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను, టీజర్‌ను టీం రిలీజ్ చేసింది. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ తలైవీని నిర్మిస్తున్నారు.

kangana ranaut jayalalitha biopic thalaivi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వివాదాల్లో వీరవనిత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.