లష్కర్ కాలాపాని

భాగ్యనగరిలో చారిత్రక కట్టడాలు కోకొల్లలు. లష్కర్‌లోనూ అలాంటి నిర్మాణాలు ఉన్నాయి. సికింద్రాబాద్‌లో ఓ కాలాపాని జైలుంది. అండమాన్‌లోని సెల్యులార్ జైలు కన్నా యాభై ఏళ్ల ముందు నుంచి ఉంది. జంటనగరాల ఘన చరిత్రలో సికింద్రాబాద్ వాటా రెండు శతాబ్దాల పైమాటే! వాటిలో ఒకటి కాలాపాని జైలు. అండమాన్‌లోని సెల్యులార్ జైలు కంటే ఐదు దశాబ్దాల ముందుగానే 1858లో లష్కర్ కారాగారాన్ని నిర్మించారు. సికింద్రాబాద్ సమీపంలోని తిరుమలగిరి చౌరాస్తాకు నూరు అడుగుల దూరంలో ఉంటుందిది. అయినా.. దీని గురించి […]

భాగ్యనగరిలో చారిత్రక కట్టడాలు కోకొల్లలు. లష్కర్‌లోనూ అలాంటి నిర్మాణాలు ఉన్నాయి. సికింద్రాబాద్‌లో ఓ కాలాపాని జైలుంది. అండమాన్‌లోని సెల్యులార్ జైలు కన్నా యాభై ఏళ్ల ముందు నుంచి ఉంది. జంటనగరాల ఘన చరిత్రలో సికింద్రాబాద్ వాటా రెండు శతాబ్దాల పైమాటే! వాటిలో ఒకటి కాలాపాని జైలు.

అండమాన్‌లోని సెల్యులార్ జైలు కంటే ఐదు దశాబ్దాల ముందుగానే 1858లో లష్కర్ కారాగారాన్ని నిర్మించారు. సికింద్రాబాద్ సమీపంలోని తిరుమలగిరి చౌరాస్తాకు నూరు అడుగుల దూరంలో ఉంటుందిది. అయినా.. దీని గురించి చాలామందికి తెలియదు. అండమాన్ దీవిలోని కాలాపాని జైలులో స్వాతంత్య్ర సమరయోధులను బందీలుగా ఉంచితే.. సికింద్రాబాద్ జైలులో తప్పు చేసిన బ్రిటిష్ సైనికులను బందీలుగా ఉంచేవారు. కఠిన శిక్షలు విధించేవారు. ఈ జైలును ఆకాశంలో నుంచి చూస్తే శిలువ ఆకారంలో ఉంటుంది. దీని నమూనాలోనే.. 1906లో అండమాన్ జైలును నిర్మించారు.

కాలాపానీ జైలుగా పిలుచుకునే తిరుమల గిరి జైలును మూడు అంతస్తులుగా నిర్మించారు. రెండు అంతస్తుల్లో ఖైదీల కోసం 75 గదులు ఉన్నాయి. జైలులోని ప్రతి సెల్‌కూ పటిష్టమైన ఇనుప తలుపులు అమర్చారు. ప్రతి గదికీ చిన్న కిటికీ ఒకటుంది. ఈ
కిటికీకి ఒక ప్రత్యేకత ఉంది. జైలు గదిలోని ఖైదీ ఈ కిటికీలో నుంచి బయటకు చూస్తే ఎదురుగా ఉన్నది మాత్రమే కనిపిస్తుంది. చుట్టు పక్కల ఏముందో, వరండాలో ఎవరున్నారో ఖైదీ కంటపడవు. అదే జైలు గది బయటి నుంచి కిటికీలోకి తొంగి చూస్తే.. గదిలో అణువణువూ కనిపించడం విశేషం. ఈ జైలు నిర్మాణం కోసం ఆ రోజుల్లోనే 4.71 లక్షల రూపాయలు ఖర్చయిందట.

జైలు మూడో అంతస్తు పైభాగాన ఉరిశిక్షను అమలు చేసేందుకు ఇనుప కమ్మీలు ఉన్నాయి. ఉరిశిక్ష అమలుకు ముందు ఖైదీలు తమ ఇష్టదైవాన్ని ప్రార్థించే వెసులుబాటు కల్పించేవారట అధికారులు. ఒక గదిలో పలు దేవతామూర్తుల చిత్రపటాలు ఏర్పాటు చేశారట. ఉరి తీసే సమయంలో మానవ తప్పిదం వల్ల గానీ, సాంకేతిక కారణం వల్ల గానీ.. ఏదైనా సమస్య ఏర్పడినా.. శిక్షను అమలు చేసేందుకు తగ్గ ఏర్పాట్లూ ఉన్నాయిక్కడ. ఉరికంబం కింది భాగంలో నూరు అడుగుల లోతున్న బావిలాంటి నిర్మాణం ఉంది. బావి అడుగున పదునైన ఇనుప చువ్వలు ఉండేవి. పొరపాటున ఉరి తప్పినా.. ఖైదీ బావిలో పడి ఇనుప చువ్వలకు బలయ్యేవాడు. ఈ జైలులో 500 మందికిపైగా ఖైదీలకు ఉరిశిక్ష అమలైందని చెబుతారు.

అండమాన్ కాలాపాని జైలు నిర్మించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా 2006లో శతాబ్ది ఉత్సవాలు చేశారు. ఈ కట్టడాన్ని జాతీయ మ్యూజియంగా ప్రకటించారు. రోజూ వందలమంది పర్యాటకులు కాలాపాని జైలును సందర్శిస్తున్నారు. కానీ, సికింద్రాబాద్ సెల్యులార్ జైలు ప్రస్తుతం టెరిటోరియల్ ‘ఆర్మీ- 125 ఇన్ ఫాంట్రీ బెటాలియన్- ది గార్డ్’ ఆధీనంలో ఉంది. జైలులోకి బయటి వ్యక్తులకు అనుమతి లేదు. ఈ అపురూప కట్టడాన్ని సందర్శనకు అవకాశం కల్పించాలంటున్నారు పర్యాటక ప్రియులు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వందల మంది సైనికులను ఇక్కడికి తరలించారు. ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలోనూ కొందరు ఖైదీలను ఈ జైలులో ఉంచారని అధికారులు చెబుతుంటారు. 1994 నుంచి ఈ జైలు వినియోగంలో లేదు.

Kalapani jail is 100 years old

Related Images:

[See image gallery at manatelangana.news]