కెరీరిజం మితిమీరింది

Jukanti Jagannatham is familiar with Telugu literature

 

నాలుగు దశాబ్దలకుపైగా కవిత్వం రాస్తున్న జూకంటి జగన్నాథం ఇప్పటివరకు 14కవితా సంకలనాలు, ఒక కథల పుస్తకం తెచ్చారు. 65 ఏళ్ల జూకంటి జగన్నాథం తెలుగు సాహిత్యానికి సుపరిచితులు. ప్రఖ్యాత కవి జగన్నాథంకు ప్రస్తుత సాహిత్య పర్యావరణం గురించి ప్రత్యేక అభిప్రాయాలు, భావాలు ఉన్నాయి. ఆడెపు లక్ష్మణ్‌తో కలిసి మోతుకుల నారాయణగౌడ్ ఆయనతో చేసిన ఇంటర్వూ.
మీరు సాహిత్యంలోకి ఎలా వచ్చారు ?

మా అమ్మమ్మ ఊరు తంగళ్ళపల్లి, శనిగరం ప్రాజెక్టు క్రింద ఉండేది. ఆ ఊరి చుట్టూ పంట కాలువలు ఎటు చూస్తే అటు పచ్చని పంటపొలాలు కన్పించేవి. ప్రతి సంవత్సరం చలికాలంలో హరికథలు, ఎండాకాలంలో మధ్యాహ్నం పూట పటం కథలు వరినాట్లు వేసిన తర్వాత ‘పాండ’ కతోల్లు ఊరూరా తిరిగి పాండవుల బాగోతం ఆడేవారు. వీటన్నింటిని మా అమ్మమ్మ మాణిక్యమ్మతో కల్సి చూసేవాణ్ణి, ఆశ్చర్యంగా ఆశువుగా చెప్పే కథలను వినేవాణ్ణి. వీటన్నింటి సమాహారమే నాలోని సాహిత్యం మొక్కకు పాదుకొల్పాయనుకుంటాను.

మీరు కోహెడ తంగళ్ళపల్లికి ఎందుకు పోయారు ? అక్కడి నుండి మళ్లీ ఎందుకు వచ్చిండ్రు ?

దాదాపు 1962 ప్రాంతంలో మా ఉమ్మడి కుటుంబం వేరు పడింది. అప్పుడు మా బాపుకు ఆప్పు మోయలేనంత అయ్యి సంసారం లావకు అయింది. అర ఎకరం పొలం ఇంట్లో వస్తువులన్నీ తాకట్టులోకో, అమ్మకానికో పోయినవి. తినడానికి తిండియే కష్టంగా ఉండేది. మా మేనమామ ఈ బాధలన్నీ చూడలేక ఒకరిని తను తీసుకుపోతానన్నాడు. ఆ కారణంగా నేను మా ఊరి నుంచి మా అమ్మమ్మ ఊరికి పోవడం జరిగింది. మనకున్న ఎనిమిది ఎకరాల పొలంలోనే వ్యవసాయం చేయమన్నాడు. తర్వాత సంవత్సరం చూద్దామన్నాడు. అనివార్యంగా సంవత్సరానికి పైగా వ్యవసాయంలోని పనులన్నీ నేర్చుకున్నాను. అప్పుడు మళ్లీ చదువుకుంటానంటే మా మామ చదువులేదు గిదువులేదు అన్నడు. వ్యవసాయం చేసుకోమన్నాడు. ఐతే నేను మా ఇంటికి పోతానని పట్టుబట్టాను. అక్కడేముంది కైకిలి చేసుకొని బతుకాలె ! ఇక్కడనే వ్యవసాయం చేసుకొని బతుకవచ్చునన్నాడు. ఐనా నేను మా ఇంటికి పోతానని మంకుపట్టు పట్టాను. ఆవిధంగా నా జీవితం మా అమ్మమ్మ ఊరు నుంచి మా ఊరికి తిరుగు ప్రయాణం జరిగింది.

మీ ఊళ్లో సాహిత్య ప్రయాణం తీరుతెన్నులు ?

నిజంగానే ఇక్కడ తిండికి చాలా కష్టంగా ఉండేది. ఇంటిల్లిపాది కైకిలికి పోయేవాళ్లం బాయిలు తవ్వడం, కాలువలు తీయడం, వరి కోయడం లాంటి పనులు చేసేవాళ్లం. అటువంటి సమయంలో నాలో నిద్రాణమై ఉన్న సాహిత్య కాంక్ష కళ్లు తెరవడం మొదలైంది. 1972-73 ప్రాంతంలో సిరిసిల్లాలో సాహిత్య వాతావరణం విరాజిల్లుతుండేది. వెంకటరాజం సార్ తన గ్రంథాలయ కార్డ్ నాకు ఇవ్వడమే గాక, కనపర్తి సార్ సొంత గ్రంథాలయంలోని పుస్తకాల్ని చదివే ఏర్పాటు చేసారు. నేను శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, గురజాడ, నుండి దాశరథి కృష్ణమాచార్య, శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి రంగాచార్య దిగంబర కవుల వరకు అధ్యయనం చేశాను. ఈ పుస్తకాలన్నింటినీ మా ఇంటిలో కరెంటు లేకపోవడం వలన ‘ ఎక్కదీపం’ ముందు కూర్చొని చదివేవాణ్ణి. ఆనాటి సినారె అంతేవాసులైన వారు రేడియో లలితగీతాలకు, పరిమితమయ్యారు. నేను కూడా వారి ప్రమేయంతో మొదట్లో లలిత గీతాలు రాశాను.

తెలుగు కవిత్వంలోకి మీ ప్రవేశం ?

నేను ‘చీకటి దారి’ నుంచి 1975 దేశంలో అత్యవసర పరిస్థితి తర్వాత నాటి స్థల, కాలాల ప్రభావం వలన నేను ఏది సరియైన వెలుగుదారో వెతుక్కున్నాను. నా సాహిత్యలోగిలిలో నిజాం వెంకటేశం సార్ పరిచయంతో అంతవరకు కిటికీలు తెరిచిన నాకు ఒక్కసారి వెలుగు దర్వాజ నాలోకి తెరుచుకున్నట్టు అయింది. అంతవరకూ నాకు తెలువని చదవని కొత్త రచయితల్ని అధ్యయనం చేయడానికి అవకాశం ఏర్పడింది. అనాలో నా చుట్టూ జరిగిన కలలకు, కన్నీళ్లకు, త్యాగాలకు గుండె స్పందన మూలాలకు ప్రతి రూపమే నా కవిత్వం. అలా మొదలైన నా కవిత్వసోయి ఎలాంటి తెంపు లేకుండా కొనసాగుతూనే ఉంది.

కవిత్వం ‘లోంచి’ కథల వైపుకు ఎలా వచ్చారు ?

నేను కవిత్వమే గాక కథలు, నవలలు విరివిగా చదివాను. కవిత్వం రాస్తున్న నేను కథలు ఎందుకు రాయకూడదనే ఆలోచన కలిగింది. ఆ సవాలుతో రాసిన కథనే “వలస” కథ నాటి (1986) ఆంధ్రజ్యోతి దీపావళి కథల పోటీల్లో ద్వితీయ బహుమతి వచ్చింది. సిరిసిల్ల అస్తిత్వంలో నుంచి వచ్చింది. నా కథలకు నా కథా సాహిత్యాధ్యయనమే గాక వివిధ వాదాల శాస్త్రీయ అధ్యయనాలు కూడా తోడయ్యాయి. వీటి వెలుగులోనే నేను మాత్రమే రాసే రాయగలిగే కథా వస్తువుల ఎన్నిక విషయంపై స్పష్టత కోసం క్షేత్ర అధ్యయనాలు చేయడం జరిగింది. అందుకే 15 కథలు మాత్రమే రాసి “ వైపని ” (నైపుణ్యం) కథా సంకలనం (2004) తీసుకువచ్చాను. కానీ తెలంగాణ సాహిత్య అకాడమి సంకలన పరిచిన కథా సంపుటిలో నాకథ కనబడలేదు. ఉమ్మడి రాష్ర్టంలో సాహిత్య వివక్ష ఒకతీరువుంటే తెలంగాణ అనంతరం మరో తీరుగా వుంది. ఈ వివక్ష, ఆధిపత్యం కేంద్రంగా ఏదో రూపంలో వర్దిల్లుతూనే వుంది.

ఇప్పుడు కవిత్వం ఏవిధంగా ఉంది ?

తెలంగాణ ఉద్యమ కాలంలోనే గాక అంతకు ముందు నుంచే తెలంగాణ నుంచి వచ్చిన శక్తివంతమైన కవుల్ని మిగతా ప్రాంతాల వాళ్లు “ తెలంగాణ కవి ” అని సరిహద్దు గీతల్ని గీస్తున్నారు. విచిత్రంగా ఇది రాయలసీమ, కళింగాంధ్ర సాహిత్యకారులను కూడా ఆయా ప్రాంతాలకు పరిమితం చేస్తున్నారు. ప్రాంతాల నుంచి వచ్చే సాహితీకారులు వివిధ కులాల, వర్గాల నుంచి నేలను చీల్చుకుని వచ్చి శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నవారే. ప్రజల వ్యవహారిక భాష, విషయంలో ఇదే అంటరానితనాన్ని వర్తింపజేస్తున్నారు. ఇవ్వాల్ల మరోసారి సాహిత్యానికి ప్రయోజనం ఉందా ? లేదా ? అని కొందరు ప్రయత్నం చేస్తున్నారు. శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన తెలుగు సాహిత్యంలో అప్పుడే ఒక అరాచకత్వపు, అరాజకీయ ఆలోచనలు మొదలయ్యాయి.

రష్యా చైనా, జపాన్‌ల నుంచే కాక ఆయాదేశాల నుంచి బహిష్కృతులైన రచయితలను, కవులను వారి వారి రచనల్ని పరిచయం చేస్తున్నారు. బహుశా దీని వలన ఉపయోగం పరిమితంగా ఉంటుంది. వ్యక్తి కేంద్రంగా ప్రస్తుత సాహిత్యం గతించిన సమాజాల తాలూకు కొన పూపిరికి ఊపిర్లనూదటానికి ప్రయత్నిస్తున్నారు. దీనికి కారణాలు ప్రజా ఉద్యమాలు వెనుకంజ ఒకటైతే, ప్రపంచీకరణలో మనిషీ, మనసు మనుగడ ప్రమాదంలో పడింది. సాహిత్యం ఇలా రాయడానికి సాహిత్య కారులు వర్తమానంలో నిలబడలేక పోవడమే గాక, వర్తమాన సంక్షోభ, సంక్లిష్టతలనుంచి గతంలో దాక్కుంటున్నారు. ప్రస్తుత పోకడలను గమనిస్తే 1960వ దశాబ్దంలోని సాహిత్య వాతావరణాన్ని బద్దలుకొట్టిన దిగంబర కవుల, విరసం పుట్టుకల చరిత్ర యాదిచేస్తున్నది. ఇప్పుడు తిరిగి తెలుగు సాహిత్యం లౌక్యాల, మర్యాదల చెంప చెల్లుమనిపించే దిశగా లోలోపల మసలిపోతున్నది.

ప్రపంచీకరణపై 1990లో ఎలా రాయగలిగారు ?

దేశంలో 1980 నుండే ప్రపంచీకరణ విస్తరణ చాపకింది నీరులా ప్రవేశించినా, ఆ దుష్పరిణామాలు 1990లో భారతీయ సమాజంలో ప్రస్ఫుటంగా ద్యోతకమయ్యాయి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న నాకు ఆ దుష్ఫలితాలు, విధ్వంసాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. హృదయ స్పందనలను కవిత్వంలో నమోదు చేశాను. వీటి సమాహారమే 1996 నాటి నా కవితా సంకలనమే “ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌”. గ్రామీణ ప్రాంతాలు అప్పటికే ప్రభావితమైతే నగరాలు 2000సంవత్సరం పిదప ప్రపంచీకరణ దుష్పరిణామాలు పొడచూపినాయి.

వచన కవిత్వానికి, పాటకు మధ్య భేేదాలున్నాయా ?

ఈ విషయంలో నా కంటూ కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. వచన కవిత్వం చదువరి మెదడును మనసును ఆలోచింపజేస్తుంది. కవిత్వం ప్రధానంగా హృదయ సంబంధమైనది. దీనిని గుర్తించే వేలాది పాటలు రాసిన శ్రీశ్రీ, దాశరథి, సినారె, ఆరుద్ర లాంటి ప్రసిద్దులు అద్భుతమైన పద్యపాండిత్యమున్న ఉద్దండులు అయినప్పటికీి వారు వచన కవిత్వం వైపు మొగ్గు చూపారు. కాని పాట ముఖ్యంగా శ్రవణ పేయమైనది. పాట మాతృక జానపదంలోను, తత్వాలలోనూ, యక్షగానాలలోనూ ఉంది. వాటి ధ్వనులే పాటలు అనుకుంటాను. ఆ బాణీలలో ఒదగని పాట, గాయకుడు లేని పాట తేలిపోతుంది. జన సామాన్యులే లక్ష్యంగా పాట జీవనాన్ని కొనసాగిస్తుంది. తెలంగాణ ఉద్యమకాలంలో కొందరు కవులు, పాటలు రాసేవారంతా ఒక్కటేననే వాదనను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ కవిత్వం, పాట లాక్షిణ్యాలు, లక్ష్యాలు, గమ్యాలు వేరు వేరుగా ఉన్నాయి.

బహుజన రచయితల పదంపైన మీ అభిప్రాయం?

బహుజన రచయితలు అనే పదబంధాన్ని విసృ్తతార్థంలో ఎస్.సి, ఎస్.టి, మైనారిటీ, బి.సిల నుంచి ఎదిగివచ్చిన సృజనకారులందరినీ కలిపి అంటున్నారు. కానీ నాకు ఈ వాదనతో ఏకీభవించని అంశాలు కొన్ని ఉన్నాయి. అధిపత్య వర్గాల వారికి రాజ్యం అందుబాటులో ఉంటుంది. లేక రాజ్యానికి ఈ వర్గాలు దగ్గరగా ఉంటాయి. ఈ విషయంలో కొంచెం బాహాటంగా, గుంభనంగా రాజ్యంతో ఈ కులాలు లోపాయికారిగా అంటకాగుతాయి. కానీ బి.సి కులాల నుంచి వచ్చిన రచయితలు, కవులు ఒక చెల్లాచెదురుగా ఉన్నారు. ఈ మూడు వర్గాల సాహిత్యకారులు సృష్టిస్తున్న నిర్మాణాలలో జీవితలోనూ, సారంలోనూ చెప్పుకోదగ్గ స్థాయి భేదాలు కలవు. రాజ్యాధికారం వచ్చే ఆశాకిరణాలు కనిపించే వరకు పై మూడు వర్గాలు ఆయా నిర్దేశిత ప్రజలను సమాయత్తం చేయవలసిన అవసరం వుంది. రాజ్యాధికార సమయం ఆసన్నమైనప్పుడు ఎస్.సి, ఎస్.టి, మైనార్టీ, బి.సి వర్గాలకు చెందిన వారు తప్పకుండా ఒక్కటి అవుతారు. ప్రస్తుతం వ్తిృతార్థంలో వాడుతున్న బహుజన రచయితల వాదం ఒక రకంగా బలహీన నీరస స్వరం.

నేడు ఆశయాలు, విలువలు ఎందుకు పతనం అంచుకు చేరాయి ?

ఇది తెలుగు సమాజంలో 1983 తెలుగుదేశం పరిపాలన విధానాల తీరులో కనిపిస్తుంది. ఎలాగంటే, ఆ పాలక వర్గం హయాంలో విశ్వవిద్యాలయాలలో, కళాశాలల్లో, పాఠశాలల స్థాయిలో విద్యార్థి ఎన్నికలను రద్దుచేయడం జరిగింది. తత్ఫలితంగా ఒక రెండు తరాలు ఏలాంటి ఆశయాలు విలువలు దృక్పధాలు లేకుండా చదువును, జీవితాన్ని కొనసాగించాయి. అందుకే ఈనాటి తరం అనే తరం యావత్తూ నిర్జీవమై బతుకుతెరువే ప్రధానంగా జీవిస్తుంది. ఇప్పుడు మూడు రకాల సాహిత్యకారులు ఉన్నారు. ఒకరు ప్రభుత్వ అనుకూలురైతే, రెండవ రకం వారు ప్రజా అనుకూలమైన దృక్ఫథం కలవారు. మూడో రకం వారు అటు ఇటూ కాకుండా మధ్యే మార్గం అనుసరిస్తున్నారు. ఇవన్నీ సాహిత్యంలో ఈఉత్థాన పథనాలకు మూలం.

నేటి కవి, రచయితలకు మీరు చెప్పే అంశాలు ?

ముఖ్యంగా నేటి కవులు, రచయితలు సాహిత్యంతో పాటు అత్యంత వేగంగా మారుతున్న ప్రపంచలో ఆర్థిక, రాజకీయ, సామాజిక శాస్త్రాలతో పాటు కమ్యూనిస్లు మానిఫెస్టో, గులాంగిరి, కుల నిర్మూలన లాంటి ప్రాథమిక పరిజ్ఞాన పుస్తకాలను చదవాలి. స్థానిక, జాతీయ అంతర్జాతీయ అంశాల్ని కూడా అధ్యయం చేస్తే ఆయా సాహిత్యకారుల రచనలు నిగ్గుతేలుతాయి. ఏది ఏమైనా తెలుగు సాహిత్యంలోకి ‘ ఒక భద్రలోకం’ ప్రవేశించింది. ముందెప్పుడూ లేనంత సాహిత్యంలో బాహాటంగా కెరీరిజం పెరిగిపోయింది. ఇది ఆందోళన కలిగిస్తుంది.

బింబ ప్రతిబింబాలే కొందరు 16,17,18 శతాబ్దాల రచనలను పని గట్టుకొని తవ్విపోస్తున్నారు. ఎప్పుడూ లేనంత వేగంగా మారుతున్న సమాజంలో ఈ ప్రక్షేపణలు సారాంశంలో ఎలాంటి సంకేతాలను అందిస్తున్నదో ఆయా రచయితల వివేకానికి, విచక్షణలకు తెలియాలి. ఇది ఒక విధంగా వ్యక్తి అభిరుచి సమాజ అభివ్యక్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. పునర్జీవన సాహిత్యం వాస్తవికతను వాస్తవికంగా చిత్రించడంలో ఓటమి పాలవుతుంది. పాత సత్యాలను దఫ దఫాలుగా వివరిస్తూ నూతన మానవ సమాజ సంఘర్షణాత్మక అంతరంగాల్ని చిత్రీకరించ నిరాకరిస్తుంది. ప్రముఖ దార్శనికుడు, రచయిత జి.వి కృష్ణారావు గారు చెప్పిన మాట ప్రస్తుత సాహిత్య వాతావరణానికి అక్షర సత్యాలుగా నిలుస్తుంది . “లోకం కోసం ఏడిస్తే అది కవిత్వం. తన కోసం ఏడిస్తే అది స్వార్థం. రెండింటి కోసం ఏడిస్తే అది ధర్మం. రెండింటి కోసం ఏడ్చినట్లు నటిస్తే అది రాజకీయం. ”

 

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కెరీరిజం మితిమీరింది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.