ఎన్నికల తర్వాత ఎన్‌ఆర్‌సి?

  పౌరసత్వ బిల్లు విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడైన ఒక బిజెపి ఎం.పి. మాత్రం పశ్చిమబెంగాల్లో ఎన్‌ఆర్‌సి విషయంలో ఇప్పుడప్పుడే ఎలాంటి ప్రణాళికలు లేవని చెప్పినట్లు వార్త. దిలీప్ ఘోష్ ప్రకారం కొన్ని సంస్థలు, లేదా వ్యక్తులు కలిసి కోర్టులో ఒక పిటీషన్ వేసి, బంగ్లాదేశ్ నుంచి వలసల కారణంగా పశ్చిమ బెంగాల్ జనాభా స్వరూపంలో వచ్చిన మార్పు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలకు ఎన్‌ఆర్‌సి […] The post ఎన్నికల తర్వాత ఎన్‌ఆర్‌సి? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

పౌరసత్వ బిల్లు విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడైన ఒక బిజెపి ఎం.పి. మాత్రం పశ్చిమబెంగాల్లో ఎన్‌ఆర్‌సి విషయంలో ఇప్పుడప్పుడే ఎలాంటి ప్రణాళికలు లేవని చెప్పినట్లు వార్త. దిలీప్ ఘోష్ ప్రకారం కొన్ని సంస్థలు, లేదా వ్యక్తులు కలిసి కోర్టులో ఒక పిటీషన్ వేసి, బంగ్లాదేశ్ నుంచి వలసల కారణంగా పశ్చిమ బెంగాల్ జనాభా స్వరూపంలో వచ్చిన మార్పు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలకు ఎన్‌ఆర్‌సి విషయం చాలా ముఖ్యమైనది.

పశ్చిమ బెంగాల్లో బిజెపి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒకటి రాష్ట్రంలో జాతీయ పౌరసత్వ జాబితా తయారు చేస్తామని చెప్పడం. అసోంలో ఇప్పటికే ఎన్‌ఆర్‌సి నడుస్తోంది. అత్యంత వివాదాస్పదమైన అంశంగా మారింది. ఎన్నికల్లో బిజెపి పశ్చిమబెంగాల్లో కూడా ఎన్‌ఆర్‌సి అమలు చేస్తామని ఇచ్చిన హామీని ఇప్పుడు మరిచిపోయినట్లు కనిపిస్తుంది. ఎన్నికలు జరిగి రెండు నెలలు ముగిసినా ఆ విషయంలో నోరు మెదపడం లేదు. బిజెపి ఉత్తర బెంగాల్లో చాలా విస్తృతంగా ఈ ప్రచారం చేసింది. బంగ్లాదేశ్‌తో సరిహద్దులున్న ప్రతి జిల్లాలోను ఈ ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగించింది. ఎన్‌ఆర్‌సి ద్వారా అక్రమ ప్రవాసులను దేశం నుంచి బయటకు గెంటేస్తామని ప్రకటించింది. సరిహద్దు జిల్లాలు ముఖ్యంగా డార్జిలింగ్, జాల్ పాయ్ గురి, అలీపుర్ ద్వార్, కూచ్ బహార్, దక్షిణ దినాజ్ పుర్, ఉత్తర దినాజ్ పుర్, మాల్దా, ముషిరాబాద్, నాదియా, 24 పరగణా జిల్లాల్లో ఈ ప్రచారం చాలా తీవ్రంగా జరిగింది.

పశ్చిమబెంగాల్లోని 42 లోక్‌సభ స్థానాల్లో 13 స్థానాలు మూడింటా ఒకవంతు స్థానాలు ఈ జిల్లాల్లోనే ఉన్నాయి. ఉత్తరబెంగాల్లోని ఎనిమిది నియోజకవర్గాల్లో ఏడింట బిజెపి గెలిచింది. మిగిలిన ఐదు దక్షిణ బెంగాల్లో గెలిచింది. బిజెపి బెంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఇప్పుడు కొత్త మాట చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్‌ఆర్‌సి అమలు చేస్తామంటున్నారు. కాని లోక్ సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇది కాదు.

మేం తప్పకుండా పశ్చిమబెంగాల్లో ఎన్‌ఆర్‌సి అమలు చేస్తాం, కాని అసోంను చూశారు కదా, అక్కడ కోర్టు పర్యవేక్షణలో ఎన్‌ఆర్‌సి జరుగుతోంది. అది బిజెపి అమలు చేయదలిచిన ఎన్‌ఆర్‌సి కాదు అని దిలీప్ ఘోష్ చెప్పాడు. ఇక్కడ ఎన్‌ఆర్‌సి అమలు చేయాలంటే రాష్ట్రంలో మేం అధికారంలో ఉండాలి. ఒక పార్టీగా మేం పశ్చిమబెంగాల్లో ఎన్‌ఆర్‌సి అమలు చేయలేం. ప్రభుత్వంలోకి వస్తేనే చేయగలం అంటున్నాడు. బిజెపి ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకుంటుందని ఆయన ఢంకాబజాయించి చెబుతున్నాడు. కశ్మీరుకు సంబంధించి అధికరణ 370 రద్దును ఆయన ఉదహరిస్తున్నాడు. అధికరణ 370 మేం రద్దు చేసినట్లే, పశ్చిమ బెంగాల్లోను మేం ఎన్‌ఆర్‌సి తీసుకువస్తాం అంటున్నాడు. దానికి కాస్త సమయం పడుతుందని ఆయన ఉద్దేశం. రాజకీయ పరిస్థితులు మారాలని చూస్తున్నాం, ఓటర్లు మా వైపు ఉండడం అవసరం, అధికారంలోకి రాగానే ఈ పని చేసేస్తాం అంటున్నాడు.

పౌరసత్వ బిల్లు విషయంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సభ్యుడైన ఒక బిజెపి ఎం.పి. మాత్రం పశ్చిమబెంగాల్లో ఎన్‌ఆర్‌సి విషయంలో ఇప్పుడప్పుడే ఎలాంటి ప్రణాళికలు లేవని చెప్పినట్లు వార్త. దిలీప్ ఘోష్ ప్రకారం కొన్ని సంస్థలు, లేదా వ్యక్తులు కలిసి కోర్టులో ఒక పిటీషన్ వేసి, బంగ్లాదేశ్ నుంచి వలసల కారణంగా పశ్చిమ బెంగాల్ జనాభా స్వరూపంలో వచ్చిన మార్పు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలకు ఎన్‌ఆర్‌సి విషయం చాలా ముఖ్యమైనది. అంతేకాదు, పౌరసత్వ బిల్లు విషయంలోను రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల్లో దాదాపు 20 శాతం హిందూ శరణార్థులు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు నివసిస్తున్నారు. మరో 30 శాతం ముస్లిం ప్రవాసులు కూడా ఉంటారని అంచనా. ఈ రెండు సముదాయాలు ఒక్కో పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్నాయి.

హిందూ ఓటు బ్యాంకు బలపరచుకోడానికి బిజెపి ప్రయత్నిస్తుంది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దీనికి అనుగుణంగానే ప్రసంగాలు చేస్తున్నారు. హిందూ, బౌద్ధ లేదా ముస్లిమేతర శరణార్థులెవరినీ వెనక్కు పంపించేది ఉండదని భరోసా ఇస్తున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఎన్‌ఆర్‌సి ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్‌ఆర్‌సి, పౌరసత్వ బిల్లు ఈ రెండు కూడా సమాజాన్ని మతపరంగా ముక్కలు చేసే పనులని ఆమె విమర్శిస్తున్నారు. ప్రజల గుర్తింపులతో రాజకీయ క్రీడలు నడపడానికి బిజెపి ప్రయత్నిస్తుందని, ఇలాంటి ప్రయత్నాలను అనుమతించేది లేదని మమతాబెనర్జీ ప్రకటించారు. బెంగాలీ ఆత్మాభిమానాన్ని అప్పీలు చేస్తూ మమతా బెనర్జీ ఉద్యమం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. కాషాయ పార్టీకి బెంగాలీ సంస్కృతితో సంబంధం లేదని, బిజెపి హిందీ ప్రాంతాల పార్టీ అని ఆమె ప్రచారం చేస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే బిజెపి బెంగాలీ వ్యతిరేక పార్టీ అనే ప్రచారం ఆమె తరఫున జరుగుతోంది.

అసోంలో బిజెపి అనేక మంది బెంగాలీల పేర్లు ఎన్‌ఆర్‌సిలోకి రాకుండా చేసిందని మమతా బెనర్జీ తన ఎన్నికల ప్రసంగాల్లో తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాలీ హిందువులను కూడా వెనక్కు గెంటేస్తున్నారని అన్నారు. బెంగాల్లో కూడా అవకాశం దొరికితే ఇదే పని చేస్తారని ఆమె ప్రజలను హెచ్చరిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఒక ఎం.పి. అభిప్రాయం ప్రకారం ఎన్‌ఆర్‌సి విషయంలో ఇప్పుడు బిజెపి తొందరపడడం లేదు. రాష్ట్రంలోని ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల్లో కూడా వారికి ఓట్లు అవసరం కాబట్టి కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని ఆంటున్నారు. బెంగాల్లో బిజెపి రాజకీయ, ఎన్నికల ప్రయోజనాలు సాధించే క్రమంలో ఉంది. అలాంటి ప్రయోజనాలు లభించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మాల్దా, ముషీరాబాద్ వంటి నియోజకవర్గాల్లో బిజెపికి ముస్లింల ఓట్లు కూడా పడ్డాయని చాలా మంది భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఒక తృణమూల్ కాంగ్రెస్ ఎం.పి.కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే వరకు అందరినీ కలుపుకుపోయే ధోరణి ప్రదర్శించాలన్నది బిజెపి కొత్త ఎత్తుగడగా చాలా మంది భావిస్తున్నారు.

Joint Parliamentary Committee on Citizenship Bill

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎన్నికల తర్వాత ఎన్‌ఆర్‌సి? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.