లాజిస్టిక్స్ రంగంలో కొలువులు

Jobs in Logistics field and Supply Management

అవసరమైన సమయంలో ఏ వస్తువైనా అందుబాటులో లేకపోతే ఎంత ఇబ్బందో కదా! మనం తినే తిండి.. వేసుకునే దుస్తులు, మందులు.. ఉపయోగించే మొబైల్, కంప్యూటర్.. నడిపే వాహనం.. ఇలా అన్ని రకాల వస్తువులు ఎక్కడో తయారై మన ఊరిలోకి.. అందులోనూ మన వీధిలోకి.. ఇంకా చెప్పాలంటే ఇంటింటికీ ఎలా వచ్చి చేరుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగదారుడి వరకు వీటిని పాడైపోకుండా సకాలంలో చేర్చడంలో ఎంతోమంది నిపుణులు పని చేస్తుంటారు. నిత్యజీవితంతో ఇంతగా ముడిపడిపోయిన ఈ రంగమే ‘లాజిస్టిక్స్’.

ముడిసరుకు నుంచి తుది ఉత్పత్తిగా తయారైన వస్తువు, దాని నిల్వ, సరఫరా, క్రయవిక్రయాలతో కూడిన చక్రాన్ని సమర్థంగా నిర్వహించడమే లాజిస్టిషియన్ విధి. వచ్చే నాలుగేళ్లలో ఇందులో దాదాపు 30 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని ఒక సర్వేలో తేలింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే లక్షల ఉద్యోగాలు లభించబోతున్నాయి. విస్తృతమైన ఈ రంగంలోకి ప్రవేశించి అవకాశాలను అందుకోవాలంటే లాజిస్టిక్స్‌కి సంబంధించి కొన్ని కోర్సులు చేయాలి. టెన్త్, ఇంటర్, సాధారణ డిగ్రీ అర్హతలతో అవి అందుబాటులో ఉన్నాయి. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగాల్లో పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఈ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కనీస అర్హత : సర్టిఫికెట్ కోర్సులు మొదలు, పీజీ, పీహెచ్‌డీల వరకు ఎన్నో రకాల కోర్సులు లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి ఉన్నాయి. పదోతరగతి, ఇంటర్మీడియట్, సాధారణ డిగ్రీలు కనీస అర్హతగా ఈ కోర్సులను పలు సంస్థలు అందిస్తున్నాయి. దీంతోపాటు ఒత్తిడిలో పని చేయగల సామర్థ్యం, అంకితభావం, బృందస్ఫూర్తి, కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, విశ్లేషణ సామర్థ్యం, భౌగోళిక పరిజ్ఞానం, సంస్థాగత నైపుణ్యాలు, స్వీయ నిర్ణయ శక్తి, సమయపాలన, ఆర్థిక లావాదేవీల అంచనాలో పరిజ్ఞానం మొదలైన అదనపు లక్షణాలు ఉంటే వీటిల్లో రాణిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, సంస్థలు లాజిస్టిక్స్‌లో పలు రకాల కోర్సులను అందిస్తున్నాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం మార్చి, సెప్టెంబరులో ప్రవేశపరీక్షలు ఉంటాయి.

లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ విభాగంలో తెలుగు రాష్ట్రాల్లోనూ కోర్సులను అందించే విద్యాసంస్థలు ఉన్నాయి. షిప్పింగ్ కంపెనీలు లాజిస్టిక్స్‌లో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్నవారినే తీసుకుంటున్నాయి. సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి ఎక్కువగా ఎంట్రీ లెవెల్ మేనేజర్ల ఉద్యోగాలు లభిస్తున్నాయి. లాజిస్టిక్స్‌లో ఎంబీఏ చేసినవారిని ట్రెయినీలు, అనలిస్టులు, ఫ్రంట్ లైన్ సూపర్‌వైజర్లుగా పెద్ద పెద్ద ఉత్పత్తి కంపెనీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. రోడ్డు, రైలు, జల, వాయు రవాణా మార్గాలు, కొరియర్ సంస్థలు, గిడ్డంగులు, ప్యాకేజీలు, ఆసుపత్రులు, వస్త్ర పరిశ్రమ, వాహనరంగం, ప్రచురణ, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ రంగం, ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ కంపెనీలు, విద్యాసంస్థలు ఇలా అనేక రంగాల్లో ఈ నిపుణులకు ఉద్యోగాలు ఉన్నాయి.

Jobs in Logistics field and Supply Management

Telangana Latest News