ఇంటర్వ్యూలన్నీఒకే పద్ధతిలో ఉండవు!

Job Interview Increases the Chances You Get Hired

ఇంటర్వూ అనగానే చాలా మంది ఒంట్లో భయం పుడుతుంది.  ఇంటర్వూలు ఒక పద్ధతిగా జరుగుతాయని, గదిలోకి వెళ్లగానే సుహృద్భావ వాతావరణం ఉంటుందని, అభ్యర్థులను కేవలం సబ్జెక్టు లేదా వ్యక్తిగత ప్రశ్నలు మాత్రమే అడుగుతారని చాలా మంది భావిస్తుంటారు. ఇంటర్వ్యూకు వచ్చిన వ్యక్తులందరినీ సరిగా అంచనావేసి ఉద్యోగం ఇస్తారు అనుకుంటుంటారు. ఇది పాక్షిక నిజం.  కాని అన్ని ఇంటర్వ్యూలు అదే పద్ధతిలో  ఉండకపోవచ్చు. నిర్వహణలో గందరగోళం కూడా ఉండవచ్చు. ఇలాంటి వాటిపై ముందే అవగాహన ఉంటే అభ్యర్థి అప్పటికప్పుడు అందుకు అనుగుణంగా మారిపోవచ్చు. ఏ విషయాలు ఇబ్బందిపెడతాయో తెలుసుకుని జాగ్రత్త పడొచ్చు…

ఇంటర్వ్యూ విధానం…
విధాన రహిత లేక ఏకీకృత విధాన ఇంటర్వ్యూ ఇలాంటి వాటి నుంచి ఫలితాలను ఆశించలేం. ఉదాహరణకు కంపెనీ పెద్దదే కావచ్చు. కానీ ప్రపంచవ్యాప్తంగా దాని బ్రాంచ్‌ల్లో రిక్రూట్‌మెంట్‌కు ఒకటే విధానం అనుసరిస్తే గందరగోళం ఏర్పడవచ్చు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రోగ్రామర్ రిక్రూట్‌మెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఒకే తీరుగా ఉండొచ్చు. అయితే అదే ఆఫీసులో పనిచేసే సపోర్టింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్‌కు ఈ సూత్రం వర్తించదు. స్థానికంగా పరిస్థితులు ముఖ్యంగా సంస్కృతి, చట్టాల ఆధారంగా వీటిని రూపొందించుకోవాల్సిందే. అందుకు అనుగుణంగా ఇంటర్వ్యూ విధానాలనూ అమలు చేసుకుంటేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది.

సమయపాలన…
పైకి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ ఇంటర్వ్యూ జరిగే సమయం కూడా ఫలితాన్ని నిర్ణయిస్తుందనేది నిజం. ఇంటర్వ్యూ సమయం గడుస్తున్న కొద్దీ ఇంటర్వ్యూ చేసే వ్యక్తులకు, హాజరయ్యే వ్యక్తులకు ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ వస్తుంటాయి. వరుసగా ఐదారు ఇంటర్వ్యూలు చేసిన వ్యక్తికి, మధ్యలో విరామం తీసుకుని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మొదటి దానికంటే రెండో విషయంలో ఫలితం యాక్యురేట్‌గా ఉండే అవకాశం ఎక్కువ. ఫస్టవర్‌లో జరిగే ఇంటర్వ్యూకి, ఈవెనింగ్ అంటే ఆఫీస్ క్లోజింగ్ అవర్స్‌లో ఇంటర్వ్యూ చేయడానికి కూడా తేడా ఉంటుంది. అయితే ఇవన్నీ అభ్యర్థి చేతిలో ఏమీ ఉండవు. అందుకే పాజిటివ్‌గా ఉండడమే చేయాల్సింది.

ఇంటర్వ్యూ నిడివి…
చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలు చాలా షార్ట్‌గా ఉంటాయి. మేనేజర్ స్థాయి వ్యక్తుల సమయం, పని ఒత్తిడులు ఇందుకు దోహదం చేస్తాయి. దాంతో వాస్తవిక అసెస్‌మెంట్ జరగడానికి ఆస్కారం తక్కువ. సమయాన్ని మేనేజ్ చేసుకోవడానికి వీరు ఫస్ట్ ఇంప్రెషన్‌పైనే ఆధారపడతారు. అవి అంత కచ్చితంగా ఉండక పోయే అవకాశం కూడా ఉంది. అలా అని ఎక్కువ సమయం ఇంటర్వ్యూ జరిగిన వ్యక్తులు ఆనందంగా ఉంటారని కాదు. అనవసర ప్రశ్నలతో సహనానికి పరీక్షలాగా కూడా ఉండొచ్చు. సమయం తగ్గించడం, పెంచడం మన చేతుల్లో లేనందున రెండింటికీ అభ్యర్థి సన్నద్ధం కావాలి.

ఇంటర్వ్యూ క్రమం…
ఎన్నో వ్యక్తిగా మీరు ఆ రోజు ఇంటర్వ్యూకి హాజరవుతున్నారు అనేదానిని బట్టి కూడా కొన్ని సందర్భాల్లో ఫలితం ఆధారపడి ఉంటుంది. నిష్టూరమే అయినప్పటికీ చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే మొదటి అభ్యర్థి ఇంటర్వ్యూలో ఎంపికయ్యే అవకాశాలు తక్కువ. మొదటి గంటలో ఇంటర్వ్యూర్ అతి పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించడం వల్ల ఇలా జరుగుతుంది.

ప్రదేశం..
ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం కూడా అభ్యర్థి ఎంపికలో ఇతోధిక పాత్ర పోషిస్తుంది. ఇది అన్ని ఇంటర్వ్యూలకు వర్తిస్తుందని చెప్పలేం. సమావేశాల గదిలో జరిగే ఇంటర్వ్యూ ఫలితాలు, లంచ్ ముఖాముఖి ఫలితాలకంటే మెరుగ్గా ఉండవచ్చు.

ఇన్‌పర్సన్..
వ్యక్తిగత ఇంటర్వ్యూ అనేది కొంచెం ఖరీదైన వ్యవహారం. చాలా మంది వ్యక్తులు తమ సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తరువాత వీడియో, ఆడియో ఇంటర్వ్యూలతో ఇదంతా సులువుగా మారింది. లైవ్ ఇంటర్వ్యూలతో ట్రావెల్ ఖర్చులు తగ్గడమే కాదు, నాణ్యత విషయంలోనూ రాజీపడాల్సిన అవసరం ఉండదు. వ్యక్తిగత ఇంటర్వ్యూలు, వెబ్‌కామ్ ఇంటర్వ్యూల ఎంపికలో తేడా ఉంటుంది.

ప్రయాణం…
కొన్ని పెద్ద పోస్టులకు జరిగే ఇంటర్వ్యూల్లో మరో ఇబ్బంది ఉంది. రాత్రి విమాన ప్రయాణం చేసిన తరవాత అంటే జెట్‌లాగ్ ప్రభావం చూపుతుంది. ఇది అభ్యర్థికి, ఇంటర్వ్యూయర్‌కూ అదే సమస్య. దీంతో ఎంపిక సరిగా జరగకపోయే అవకాశం ఎక్కువ.

పరిమిత సమయం..
సరిపోయేంత సమయం ఇవ్వకుంటే అభ్యర్థి తనను తాను నిరూపించుకోలేడు, ప్రమోట్ చేసుకోలేడు.

నైపుణ్యాలు అవసరం లేని ఉద్యోగాలు…
సాధారణంగా ఇంటర్వ్యూలు అభ్యర్థుల ఇంటర్ పర్సనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ పరీక్షించేలా ఉంటాయి. కొన్ని ఉద్యోగాలకు అలాంటి స్కిల్స్ అవసరం ఏమీ ఉండవు. ఇలాంటి ఉద్యోగాల్లోనూ స్కిల్స్ పరీక్షిస్తుంటారు.

గ్రూప్ ఇంటర్వ్యూలు
ప్యానెల్ లేదంటే గ్రూప్ ఇంటర్వ్యూ ఎక్కువగా ఒత్తిడి ధోరణిలో ఉంటుంది. ఒకే అభ్యర్థిపై ప్యానల్ సభ్యులు ఒకరితరువాత మరొకరు, ఒకదాని తరువాత మరొకటి ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అభ్యర్థిని ఇబ్బందికి గురి చేసేలా, ప్రభావితం చేసేలా మాట్లాడుతారు. ప్యానల్ ఇంటర్వ్యూలలో పక్షపాతానికి అవకాశం ఉండదనే భావం అందరిలో వ్యక్తం అవుతుంటుంది. అయితే ఇంటర్వ్యూ టీమ్‌ను లీడ్ చేసే వ్యక్తి లేదా అందులో పాల్గొన్న వ్యక్తి ప్రభావవంతమైన వాడు అయినట్లయితే ఇతరులను తన దారిలో ఉండేలా చూసుకుంటాడు. అలాగే ఒక సబ్జెక్టుకు సంబంధించిన విషయాన్ని ఇంకో సబ్జెక్టు వ్యక్తి అడిగినట్లయితే అభ్యర్థి తికమకకు కూడా గురికావచ్చు. టెక్నికల్ మేనేజర్ అడగాల్సిన ప్రశ్న హ్యూమన్ రిసోర్స్ విభాగంలో పనిచేసే వ్యక్తి నుంచి రావచ్చు. ఒక్కోసారి గందరగోళం జరిగి అభ్యర్థి నిరాశ నిస్పృహలకు లోనుకావచ్చు. ఎలాంటి సందర్భంలోనైనా, ఎటు నుంచి మరెలాంటి ప్రశ్నలు వచ్చినా వాటిని ఎదుర్కొనే విధంగా ఆత్మస్థైర్యం కలిగి ఉండాలి అప్పుడే విజయతీరాలకు చేరుకుంటాం.

Job Interview Increases the Chances You Get Hired

Telangana news