జియోఫైబర్.. ఆఫర్లే ఆఫర్లు

Jio Fiber plans

 

న్యూఢిల్లీ : జియో అంటేనే సంచనాలను కేంద్ర బిందువుగా మారింది. టెలికామ్ రంగంలోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రత్యర్థి సంస్థలకు నిద్ర లేకుండా చేసింది. తాజాగా ఈ సంస్థ జియో ఫైబర్ పేరిట బ్రాండ్‌బ్యాండ్ సేవల్లో మరో సంచలనానికి తెరతీసేందుకు సిద్ధమైంది. నెలకు కేవలం రూ.700లకే జియోఫైబర్ సేవలను అందించనుమని సెప్టెంబర్ 5 నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నామని ముఖేష్ అంబానీ కంపెనీ 42వ వార్షిక సాధారణ సమావేశంలో ప్రకటించారు. రాబోయే రోజుల్లో అనేక కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్, డిటిహెచ్, బ్లాక్‌చెయిన్, ఐఒటితో పాటు మరిన్ని విభాగాల్లోకి ప్రవేశించేందుకు సంస్థ సిద్ధమవుతోంది.

రిలయన్స్ జియో డిటిహెచ్
జియో ఫరెవర్ ప్లాన్‌తో ఉచిత ఫుల్‌హెచ్‌డి టివి లేదా హోమ్ పిసిని సంస్థ అందించనుంది. ఇది జియో ఫైబర్ సేవలో భాగంగా ఉంటుంది. కొత్తగా ప్రకటించిన జియో వెల్‌కమ్ ఆఫర్ కింద ఉచిత ఫుల్‌హెచ్‌డి టివి లేదా పిసిని అందిస్తోంది. టీవీ బ్రాండ్ల వివరాలు ఇంకా ప్రకటించబడలేదు. అలాగే వినియోగదారులు ఏదైనా సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలా వద్దా అనేది తెలియరాలేదు. జియో వెల్‌కమ్ ఆఫర్ కింద నమోదు చేసుకున్న ప్రతి జియో ఫైబర్ వినియోగదారుడు కొన్ని నెలలు ఉచిత ఫుల్ హెచ్‌డి టీవీ, ఉచిత సేవలను పొందుతారు.

జియోటీవీ సేవలు
రిలయన్స్ ప్రత్యేక జియో ఫస్ట్ డే ఫస్ట్ షో చందాను తీసుకొస్తోంది. దీని ద్వారా సబ్‌స్ర్కైబర్లు థియేటర్లలో సినిమా విడుదలైన రోజే ఇంటిలో ఆ కొత్త చిత్రాన్ని చూసే వీలు కల్పిస్తుంది. జియో ఫస్ట్ డే ఫస్ట్ షో ఫీచర్ 2020 నుండి అందుబాటులో ఉంటుంది. జియో సెట్-టాప్-బాక్స్ పలు రియాలిటీ సేవలను అందిస్తోంది. ఎంఆర్ షాపింగ్, ఎంఆర్ ఎడ్యుకేషన్ మరియు ఎంఆర్ మూవీ చూడటం వంటి వాటిని అందిస్తోంది. అలాగే జియో.. గేమింగ్ కన్సోల్, జియో హోలోబోర్డ్ ఎంఆర్ హెడ్‌సెట్‌ను కూడా అందిస్తుంది.

జీవితకాలం ఉచిత కాల్స్
జియో ఫైబర్ ఫిక్స్‌డ్ లైన్ ఫోన్‌ల నుండి దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వాయిస్ కాల్స్ జీవితకాలం ఉచితం. ఫోన్ నుండి అవుట్‌గోయింగ్ కాల్స్ అపరిమితం, ఉచితం. రిలయన్స్ జియో యూజర్లు కొత్త జియో ఇంటర్నేషనల్ కాలింగ్ ప్యాక్‌తో అపరిమిత అంతర్జాతీయ కాల్స్ చేయవచ్చు. జియో ఇంటర్నేషనల్ కాలింగ్ ప్యాక్ రేటు నెలకు రూ.500. దీంతో అమెరికా, కెనడాకు అపరిమిత ఉచిత కాల్స్ అందిస్తుంది.

జియో ఫైబర్ వెల్‌కమ్ ఆఫర్
జియో ఫైబర్ వెల్‌కమ్ ఆఫర్ కింద వినియోగదారులు ఫుల్ హెచ్‌డి టీవీ లేదా హోమ్ పిసి, జియో 4కె సెట్-టాప్-బాక్స్ పొందుతారు. జియో ఫరెవర్ ప్లాన్ లేదా జియో ఫైబర్ వెల్‌కమ్ ఆఫర్‌తో ఈ ఉత్పత్తులు పూర్తిగా ఉచితం అని ఆర్‌ఐఎల్ చైర్మన్ ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. రిలయన్స్ జియో ఇంకా ఏమైనా ఛార్జీలు జతచేయబడిందా అని ఇంకా ప్రకటించలేదు. వెల్‌కమ్ ఆఫర్ లేదా ఫరెవర్ ప్లాన్‌లో ఉచిత టీవీ లేదా హోమ్ పిసి, 4కె ఎస్‌టిబి పొందడానికి సెక్యూరిటీ డిపాజిట్ ఉండే అవకాశముంది.

జియోఫైబర్ నెలకు రూ.700 రూపాయల నుండి..
100 ఎంబిపిఎస్ స్పీడ్, అన్‌లిమిటెడ్ యుసేజ్‌తో జియో ఫైబర్ ప్లాన్లు నెలకు 700 రూపాయల నుండి ప్రారంభమవుతాయి. నెలవారీ, త్రైమాసిక, అర్థవార్షిక, వార్షిక ప్యాకేజీలు వంటి వివిధ జియో ఫైబర్ ప్లాన్‌లు ఉంటాయి. జియో ఫైబర్ నెలవారీ ప్లాన్‌లు 700 రూపాయల నుండి రూ.10,000 వరకు ఉంటాయి. ఫైబర్ సేవల్లో మిక్స్‌డ్ రియాలిటీతో 4కె సెట్-టాప్ బాక్స్, గేమింగ్, ఇంకా ఎన్నో ఉంటాయి.

రియోలెన్స్ జియో మైక్రోసాఫ్ట్ డీల్
రిలయన్స్ జియో, మైక్రోసాఫ్ట్‌లు దేశవ్యాప్తంగా అతిపెద్ద ప్రపంచ స్థాయి డేటా సెంటర్ల నెట్‌వర్క్‌లలో ఒకదాన్ని ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇవి మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా పనిచేస్తాయి. అలాగే, కొత్త స్టార్టప్‌ల కోసం ఉచిత ఇంటర్నెట్, క్లౌడ్ స్పేస్, కనెక్టివిటీని కంపెనీ అందిస్తోంది. ఎంఎస్‌ఎంఇల కోసం రిలయన్స్ జియో ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసింది. నెలకు కేవలం రూ.1,500లకే కనెక్టివిటీ, వ్యాపార సంబంధిత అప్లికేషన్లను అందించనుంది.

వచ్చే మూడేళ్లలో జియో ఐపిఒ
రిలయన్స్ జియో ప్రజాదరణ పొందడంతో టెలికాం వ్యాపారాన్ని జాబితా వేరు నిర్వహించేందుకు సంస్థ సిద్ధమైంది. దీనికోసం వచ్చే 3 నుంచి 5 సంవత్సరాలలో రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ త్వరలో లిస్టింగ్ పొందనుందని ముఖేష్ అంబానీ తెలిపారు. ఆర్‌ఐఎల్ షేర్లు ఇప్పుడు బిఎస్‌ఇలో సుమారు 1 శాతం పెరిగి రూ .1,162 వద్ద ఉన్నాయి. ఆర్‌ఐఎల్ యాజమాన్యంలోని టెలికం సంస్థ తన ఏడోసారి వరుసగా లాభాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 46 శాతం ఆదాయాలు పెరిగాయి.

రిలయన్స్ జియో ఐఒటి
రిలయన్స్ జియో 1 బిలియన్ కంటే ఎక్కువ కనెక్టెడ్ ఐయోటి పరికరాలను కనెక్ట్ చేయాలని యోచిస్తోంది. ఈ పరికరాలన్నీ సంస్థ యొక్క ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) ప్లాట్‌ఫాం ద్వారా అనుసంధానించబడి ఉంటాయి.

Jio Fiber plans start to be commercially next month

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post జియోఫైబర్.. ఆఫర్లే ఆఫర్లు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.