సినిమాలే నా జీవితం..!

సినీరంగంలో నాలుగున్నర దశాబ్దాలుగా నటిస్తోన్న సహజనటి జయసుధ. సుప్రసిద్ధ నటులతో నటించిన అనుభవంతో పాత్రలకు ప్రాణప్రతిష్ట చేస్తున్న నటి. కాలానుగుణంగా వయస్సుకు తగ్గపాత్రలు వేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న జయసుధ పండంటి కాపురం నుంచి నేటి శ్రీనివాసకళ్యాణం వరకు విజయ పరంపరలో దూసుకువెళ్తోంది. ఆమెలో నటనతో పాటు సేవాదృక్ఫథం ఉంది.  అమాయకమైన అమ్మాయిగా వెండితెరపైకి వచ్చి వైవిధ్యం ఉన్నపాత్రల్లో మెప్పిస్తున్న కథానాయకి. కుటుంబపరమైన చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుని నవరసాలను ఒలికిస్తున్న నటి.  వందలాది సినిమాలతో ప్రేక్షకులను మెప్పించినప్పటికీ  మేనత్త, సుప్రసిద్ధ నటి,నిర్మాత,దర్శకురాలు విజయనిర్మల తనకు ఆదర్శం అంటున్న జయసుధతో దునియా ప్రత్యేక ఇంటర్వూ…

Jaya-Sudha

నేను చెన్నైలో పుట్టాను.  అమ్మ జోగాబాయి   బాలానందం సభ్యురాలు. ఇంటికి పెద్దబిడ్డను నేను. మేనత్త విజయనిర్మల ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. అత్తతో షూటింగ్‌లకు వెళ్ళే దాన్ని. పండంటి కాపురం సినిమాలో బాల నటిగా కనిపించాను. ఎస్వీ.రంగారావు లాంటి మహనీయులతో కలిసి నటించే అవకాశం వచ్చింది. సినిమా సూపర్ హిట్ కావడంతో  నాకు మంచి గుర్తింపు వచ్చింది.  

గ్లామర్ పాత్రల నుంచి ఆంటీ, అమ్మ, అమ్మమ్మ పాత్రల్లో నటిస్తున్నారు..

పెళ్లి అనంతరం వచ్చిన గ్యాప్‌తో ఆంటీ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాను. ఆ తర్వాత అమ్మ పాత్రల్లో నటించాను. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి కొత్త ఒరవడి తీసుకువచ్చింది. అప్పటివరకు అమ్మపాత్ర అంటే మూస పద్ధతిలో ఉండేది. ఈ సినిమా అనంతరం ఓ ఫ్రెండ్‌గా, గైడ్‌గా అమ్మపాత్రలు వచ్చాయి. బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, ఎవడు తదితర సినిమాల్లో ప్రముఖ హీరోలందరికీ తల్లిగా నటించాను. సతీష్ దర్శకత్వంలో వచ్చిన శతమానం భవతి సినిమాలో నానమ్మగా నటించాను. ఇవన్నీ నాకు చాలా సంతృప్తిని కలిగించిన పాత్రలు.

సినిమాల్లో ఎలా ఎంట్రీ ఇచ్చారు..

నాన్న రమేష్ చందర్ మద్రాస్ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేయడంతో మా కుటుంబం చెన్నైలోనే ఉంది. నేను చెన్నైలో పుట్టాను. అమ్మ జోగాబాయి బాలానందం సభ్యురాలు. ఇంటికి పెద్దబిడ్డను నేను. మేనత్త విజయనిర్మల ప్రభావం నాపై ఎక్కువగా ఉంది. అత్తతో షూటింగ్‌లకు వెళ్ళేదాన్ని. పండంటి కాపురం సినిమాలో బాల నటిగా కనిపించాను. ఎస్వీ రంగారావు లాంటి మహనీయులతో కలిసి నటించే అవకాశం వచ్చింది. సినిమా సూపర్ హిట్ కావడంతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. బాల్యం నుంచి పెద్దవారితో కలిసి పని చేయడంతో ఎంతో నేర్చుకునే అవకాశం లభించింది. బాలచందర్ తీసిన తమిళ చిత్రంఅపూర్వ రాగంగళ్ లో కమలహాసన్, నేను, శ్రీవిద్య ప్రధాన పాత్రల్లో నటించాం. రజనీకాంత్ ఇందులో తొలిసారిగా ఒక పాత్ర వేశారు. అనంతరం రాఘవేంద్రరావు దర్శకత్వంలో జ్యోతి సినిమా నా కెరియర్ లో గుర్తింపు ఇచ్చి పరుగులు పెట్టించింది. ఆయన దర్శకత్వంలో సుమారు 25 సినిమాలు, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించాను. ఒక సంవత్సరం నేను నటించిన సినిమాలు 25 విడుదల కావడం ఓ గొప్ప అనుభూతి. ఆ రోజుల్లో కథానాయిక ఓరియంటెడ్ సినిమాలు వచ్చాయి. భిన్నమైన కథాంశాలతో సినిమాలు నిర్మించేవారు. శ్రీదేవి, జయప్రద, నేను ఇండస్ట్రీలో కథానాయికలుగా ఉండేవారం. సడన్ గా జయప్రద, శ్రీదేవి బాలీవుడ్‌కు వెళ్ళిపోవడంతో వారు చేయాల్సిన సినిమాలు నేను చెయ్యాల్సి వచ్చింది. గ్లామర్, సెంటిమెంట్ పాత్రలతో పాటు ఆక్రందన, దుర్గాదేవి, ఆడపులి, కాంచన, సీత వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించాను.

పెళ్ళితో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నట్లున్నారు..

అవును. నితిన్ కపూర్ తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా చిగురించింది. పెద్దల అంగీకారంతో పెళ్ళి జరిగింది. ఆ తర్వాత పిల్లలు, వారి ఆలనా పాలన కోసం కొంతకాలం బ్రేక్ తీసుకున్నాను. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. జీవితంలో స్థిరపడ్డారు. అయితే పిల్లలు పెద్దవారయ్యారని సంతోషపడుతున్న నేపథ్యంలో విషాదం చోటు చేసుకుంది. నితిన్ చనిపోయారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు పూర్తిగా సినిమాలకే సమయం కేటాయిస్తున్నాను. శ్రీనివాస కళ్యాణంలో అమ్మమ్మ పాత్రలో నటించాను. ప్రేక్షకులు ఆదరించారు. ఇంకా నటించాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.

సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్..

మా రోజుల్లో కాస్టింగ్ కౌచ్ అనే పదం వినిపించేది కాదు. సినిమా సెట్లోకి వెళ్ళేముందు సెట్‌కు దండం పెట్టుకుని వెళ్ళే పవిత్రత ఉండేది. ఎవరైనా డబుల్ మీనింగ్ మాట్లాడితే వారిని పెద్దవారు అప్పటికప్పుడే సరిచేసేవారు. అయితే ఇప్పటి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడ ప్రలోభాలు ఉంటాయి. బలహీనతలు ఉంటాయి. ప్రలోభాల వలలో చిక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సినిమా రంగాన్ని కళారంగంగా కాకుండా వ్యాపారరంగంగా చూస్తూ పొజిషన్‌కు రావాలనుకోవడంతోనే సమస్యలు వస్తున్నాయి. మోసపోయే వారు ఉన్నంత కాలం మోసం చేసేవారు ఉంటారు.

నితిన్ కపూర్ మరణం తర్వాత..

విజయాలను ఆస్వాదిస్తూ, బాధలను దిగమింగుతూ థర్డ్ ఇన్నింగ్‌లోకి అడుగుపెట్టాను. సినిమాల్లోనే పూర్తి సమయాన్ని గడుపుతున్నాను. అమ్మమ్మ పాత్రల్లోను నటించి ప్రేక్షకులను మెప్పించడం ఎంతో గర్వకారణంగా ఉంది. అవకాశాలు వస్తే మరిన్ని విభిన్న పాత్రల్లో నటించాలని ఉంది.

తెలంగాణ ఉద్యమం చారిత్రాత్మకమైంది..

సికింద్రాబాద్ శాసనసభ్యురాలిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని దగ్గర నుంచి చూశాను. తెలంగాణ కోసం ఓయూ విద్యార్థులు చేసిన ఆందోళన ఎంతో గొప్పది, త్యాగాలతో ఉద్యమాల్లో దూకారు. ఆనాడు నేను తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికితే సొంతపార్టీలోనే కొందరు నన్ను తప్పుబట్టారు. అయినా నా నియోజక పరిధి లో ఉన్న ఓయూ విద్యార్థులకు నా శక్తి కొలది సహకారం అందించాను. చెన్నైలో పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచి మా బంధువులతో హైదరాబాద్‌కు వచ్చేవారం. ఆ రోజుల్లో (1969)లో తెలంగాణ ఉద్యమం ఎగిసింది. ఎక్కడికక్కడ రైళ్ళు నిలిపివేశారు. బాల్యంలో తెలంగాణ తొలిదశ ఉద్యమాన్ని చూశాను. శాసన సభ్యురాలిగా తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని చూశాను. తెలంగాణపై నాకు పూర్తి అవగాహన ఉంది. కెసిఆర్ నాయకత్వాన తెలంగాణ సాకారం కావడం ఓ చారిత్రాత్మక సంఘటన. అనూహ్యంగా
రాజకీయాల్లోకి వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ పోటీ చేయాలనే ఆలోచన రాలేదు. సినిమాల్లో బిజీగా ఉన్నాను.

వి. భూమేశ్వర్

Comments

comments