అయోధ్య తీర్పు సయోధ్య పెంచాలి

babri-masjid

దేవుడు, మతం అనేవి మనిషి నమ్మకానికి సంబంధించిన విషయాలు. అవి నేడు రాజకీయాలకు కేంద్రీకృతమయ్యాయి. మత విశ్వాసాల వల్లనే మనుషుల మధ్య దూరం పెరిగిపోతున్నది. మనిషిలో మానవత్వాన్ని, మంచితనాన్ని ఎంచడానికి, సమాజంలో అన్ని వర్గాల ప్రజల మధ్య సయోధ్య కల్పించడానికి, మనిషిలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఏర్పడ్డ మతం, దేవుడు అనేవి నేడు అదే మనుషులలో విద్వేషాలు, వైషమ్యాలు పెంచడానికి తోడ్పడడం విచారకరం.

దశాబ్దాలుగా కొనసాగుతున్న రామజన్మభూమి వివాదానికి, దేశంలోని సర్వోత్తమ న్యాయస్థానం, నెల రోజులలోగా ముగింపు పలకనున్న తరుణంలో అన్ని వర్గాల ప్రజలలో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. దేశంలో అత్యధిక జనాభాగల హిందువులకు అనుకూలంగా తీర్పు రాకపోతే, లేదా అక్కడి భూమిలో కొంతమేర ముస్లింలకు కేటాయిస్తే, రాజకీయ అంశంగా మారిన రామజన్మభూమి ఏ మలుపులు తీసుకొంటుందోనని అందరూ భయాందోళనలకు గురవుతున్నారు.

ముస్లింలలో ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సున్నీ వక్ఫ్ బోర్డు సుప్రీం కోర్టులో వాదనలు ముగిసిన తరువాత సమర్పించిందని చెపుతున్న మధ్యంతర పరిష్కార మార్గం , పూర్తిగా బయట ప్రపంచానికి తెలియకున్నా అనేక ఊహాగానాలు టీవీలలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రామజన్మభూమిపై హక్కులు వదులుకోంటాము కానీ మిగతా ప్రాంతాలలో ఉన్న మసీదులపై హిందువులు ఇకపై ఎలాంటి హక్కులను, వివాదాలను కొనసాగించకూడదనేదే ఈ మధ్యంతర పరిష్కారమార్గంగా చెపుతున్నారు. ఈ అంశాన్ని మిగతా ముస్లిం కక్షిదారులు కూడా ఒప్పుకోవడం లేదు.

అలాగే రామజన్మభూమి పై పూర్తి హక్కులు కోరుతున్న హిందూ సంస్థలు మాత్రం అయోధ్యలోనే కాదు భారతదేశంలో ఉన్న అనేక మసీదుల నిర్మాణాలకు ముందే ఉన్నాయని భావించే దేవాలయాల పునర్నిర్మాణం విషయంలో ఎలాంటి రాజీకి అంగీకరించడం లేదు. సుప్రీంకోర్టులో హిందువులకు పూర్తి అనుకూలమైన తీర్పు వస్తే చాంధసవాదులైన ముస్లిం వర్గాల నుండి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో అని అనేక మంది హిందూ మేధావులు కూడా భయపడుతున్నారు.

రామజన్మభూమి విషయం హిందువుల అస్తిత్వానికి, మత నమ్మకానికి సంబంధించిన విషయం. చారిత్రక ఆధారాలు, భూరికార్డులు అన్నీ హిందువులకు అనుకూలంగా ఉన్నాయని, మొఘల్ రాజుల కాలంలో హిందూ దేవాలయాలను కూలగొట్టి, కట్టిన అనేక మసీదుల కింద ఆలయాలున్నాయనేది హిందువుల నమ్మకం. బాబర్ కాలంలో కట్టిన ఈ మసీదుకు బాబ్రీ మసీద్ అని అందుకే పేరొచ్చింది.

దేవుడు, మతం అనేవి మనిషి నమ్మకానికి సంబంధించిన విషయాలు. అవి నేడు రాజకీయాలకు కేంద్రీకృతమయ్యాయి. మత విశ్వాసాల వల్లనే మనుషుల మధ్య దూరం పెరిగిపోతున్నది. మనిషిలో మానవత్వాన్ని, మంచితనాన్ని ఎంచడానికి, సమాజంలో అన్ని వర్గాల ప్రజల మధ్య సయోధ్య కల్పించడానికి, మనిషిలో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఏర్పడ్డ మతం, దేవుడు అనేవి నేడు అదే మనుషులలో విద్వేషాలు, వైషమ్యాలు పెంచడానికి తోడ్పడడం విచారకరం. మధ్య యుగంలో రాజులు తాము ఆచరించే మతాన్నే ప్రజలు ఆచరించాలని కోరేవారు. దానితో రాజు ప్రాపకం పొందాలంటే మతం మార్చుకోవాలని ప్రజలలో కొంతమంది నిర్ణయించుకొని రాజాశ్రయం కోరేవారు. అలాగే మొఘల్ రాజుల పాలనలో కూడా రాజాశ్రయం కొరకు మతం మార్చుకొన్నవారు అనేక మంది ఉన్నారు. మొన్నటికి మొన్న నిజాం కాలంలో కూడా ఇస్లాం మతం స్వీకరించి, రాజాస్థానంలో చేరిన వారున్నారు.ఆధునిక కాలంలో హిందూమతంలోని పంచములుగా పిలువబడేవారిలో ఎక్కువ శాతం, ఆత్మగౌరవం కొరకు, సమాజంలో తగిన స్థానం కొరకు ఇస్లాం, క్రైస్తవం వైపు చూస్తున్నారు.

ముఖ్యంగా విద్యాధికులైన కొంతమంది సమాజంలో తగిన సామాజిక గౌరవాన్ని ఆశిస్తూనే మతాన్ని మార్చుకొంటున్నారు. కాని కొంతమంది మాత్రం ఆంగ్లేయుల పాలన కాలంలో అధికారం కొరకు మతాన్ని మార్చుకొన్నారు. వీరిలో చాలామంది పైకి హిందువులుగానే చలామణి అవుతున్నారు. చారిత్రక పరిస్థితులు ఎలా ఉన్నా, నేడు ప్రజలలో రాజకీయ ధోరణులు పెరిగిపోయి అసహనం- తోటివారి నమ్మకాలను గౌరవించే సామరస్య పూర్వక ధోరణి తగ్గిపోతుందని తెలిపే ఘటనులు ఇటీవల అనేకం జరగడం విచారకరం.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో వాదనలు ముగిసి, శాతాబ్దాల తరబడి సమస్యగా ఉన్న రామజన్మభూమి- బాబ్రీ మసీదు అంశంలో సామరస్య పూర్వకంగా ఇరువర్గాలకు అంగీకరం అయ్యే రీతిలో తీర్పు రావాలు అందరూ ఆశిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు రావడాుకి ముందు ప్రభుత్వం, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ ప్రజలను, ముఖ్యంగా రాజకీయ నాయకులను తీర్పుకు అనుకూలంగా ఉండేటట్లు మానసికంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. కోర్టు తీర్పును పెద్ద మనసుతో అందరూ అంగీకరించి, దేశంలో మత సమరస్యాన్ని కొనసాగిస్తూ, దేశ భవిష్యత్ కొరకు కృషి చేయడానికి హిందూ, ముస్లిం వర్గాలు ఐక్యమత్యంగా ముందుకుపోవాలి. ఈ విషయంలో గెలుపు ఓటములనే సమస్య రాకుండా, లేకుండా మన దేశం, మన ప్రజలు అనే విశాల దృక్పథంతో ఆలోచించాలి.

అధిక సంఖ్యాకులమనే భావనలో హిందువులు, మైనారిటీలమనే సంకుచిత భావనతో ముస్లింలు రాజకీయాలు చేయకుండా గతాన్ని మరిచిపోయి, నూతన భారతాన్ని నిర్మించడానికి, భారతదేశ సహనశీలతను, మతసామరస్యాన్ని కాపాడడానికి ఒకరికొకరు సహరించుకోవాల్సిన గడ్డుకాలం రాబోతున్నది. వందల సంవత్సరాలుగా ఒకే నెల మీద జీవిస్తున్న రెండు మతాల ప్రజలు, మరెన్నో యుగాల వరకు ఈ గడ్డ మీదే సహ జీవనం చేయాల్సి ఉందనే సత్యాన్ని గ్రహించాలి. కొంతమంది ఇరువర్గాలలో, తాత్కాలిక, రాజకీయ అవసరాల కొరకు లేదా తమ ఆధిపత్యమే కొనసాగాలని, తామే దేశ రక్షకులమనే తలబిరుసుతనంతో దేశంలో మత సంఘర్షణలు రెచ్చగొట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది.

భారతదేశం చంద్రునిపైకి వెళ్లగలుగుతుందంటే అందుకు సహకారమందించిన శాస్త్రవేత్తల్లో అన్ని మతాలకు, వర్గాలకు చెందిన వారు ఉన్నారనే సత్యాన్ని మరిచిపోకూడదు. దేశ సౌభాగ్యానికి, దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అన్ని వర్గాల చేయూత, సహకారం కావాలి. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోతున్న ఈ కాలంలో ఇంకా పూర్వకాలం నాటి అపరిపక్వ ఆలోచనలతో తోటివారిని ద్వేషించడం సరికాదు.

భారతదేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిన ఘనత కూడా ఆనాటి బుద్ధుని అహింసా సిద్ధాంతమే అని మరిచిపోకూడదు. మహాత్మాగాంధీకి ప్రపంచ వ్యాప్త కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన సిద్ధాంతాన్ని అందించిందే కాకుండా, ప్రపంచానికే కొత్త యుద్ధ నీతిని చూపింది కూడా భారత దేశ సహనశీలతో కూడిన అహింసా సిద్ధాంతమే. నేటికీ రెండు ప్రపంచ యుద్ధాల తరువాత ప్రాక్పశ్చిమ అంతా కోరుకొనే స్నేహ, సౌశీల్యాలతో కూడిన శాంతి కాముకతే జీవిత సత్యం.

Janmabhoomi Babri Masjid Land Dispute Case

సిహెచ్‌వి ప్రభాకర్‌రావు.. 9391533339

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అయోధ్య తీర్పు సయోధ్య పెంచాలి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.