నిర్లక్ష్యం కొంప ముంచుతుంది

  కరోనా వైరస్ అంటే ప్రపంచ వ్యాప్తంగా అగ్ర దేశాలు వణికిపోతున్నాయి, కానీ ఇండియాలో మాత్రం సోషల్ మీడియా ట్రోల్స్, జోకులతో హోరెత్తి పోతోంది. సెన్స్ అఫ్ హ్యూమర్ మంచిదే, కానీ ప్రపంచాన్నే కబళించివేస్తున్న మహమ్మారి పట్ల సెన్స్‌లెస్‌గా వ్యవహరించడం మాత్రం మంచిది కాదు. చైనాతో మొదలైన కరోనా మొదలైన చోట తగ్గు ముఖం పట్టినప్పటికీ దాన్ని అంతగా సీరియస్‌గా తీసుకోని ఇటలీ వంటి దేశాలను ఇప్పటికే కబళించివేస్తోంది. మొదటి దశలో అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త […] The post నిర్లక్ష్యం కొంప ముంచుతుంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కరోనా వైరస్ అంటే ప్రపంచ వ్యాప్తంగా అగ్ర దేశాలు వణికిపోతున్నాయి, కానీ ఇండియాలో మాత్రం సోషల్ మీడియా ట్రోల్స్, జోకులతో హోరెత్తి పోతోంది. సెన్స్ అఫ్ హ్యూమర్ మంచిదే, కానీ ప్రపంచాన్నే కబళించివేస్తున్న మహమ్మారి పట్ల సెన్స్‌లెస్‌గా వ్యవహరించడం మాత్రం మంచిది కాదు. చైనాతో మొదలైన కరోనా మొదలైన చోట తగ్గు ముఖం పట్టినప్పటికీ దాన్ని అంతగా సీరియస్‌గా తీసుకోని ఇటలీ వంటి దేశాలను ఇప్పటికే కబళించివేస్తోంది. మొదటి దశలో అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలను సూచించినప్పటికీ ఇటలీ ప్రజలు కరోనా వ్యాప్తి పట్ల అంతగా బాధ్యతగా స్వీకరించకపోవడం, నిర్లక్ష్యం, అజాగ్రత్త పర్యవసానాలు ఇటలీని చైనా కంటే అధికంగా డ్యామేజ్ చేశాయి. కరోనా పుట్టిన చైనా (3,248 మరణాల)తో పోల్చుకుంటే ఇటలీలోని 3,600 పైగా నమోదైన మరణాల సంఖ్యే అధికంగా ఉండడం, ఈ సంఖ్య నానాటికీ పెరిపోయే అవకాశాలు సైతం అధికంగా ఉండడంగమనార్హం.

చైనాలో నమోదైన పాజిటివ్ కేసులు 80,967 కాగా ఇటలీలో పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు సగం (41,035) అయినప్పటికీ మరణాల సంఖ్యలో చైనాను మించిపోయింది. ఇక మన దేశం విషయానికొస్తే, మన దేశంలో చైనా, ఇటలీలా ఆసుపత్రుల్లో సదుపాయాలు, ఆధునిక ల్యాబ్ సదుపాయాలు చాలా తక్కువ. కరోనా ఇతర దేశాల్లో వ్యాప్తిలో ఉంటే వందల్లో ప్రజలు చనిపోతుంటే మన దేశ నాయకులు కరోనా మన దేశంలోకి ప్రవేశించి బతికే అవకాశాలు లేవని నిర్లక్ష్యం చేసి, విదేశాల నుండి దేశానికి తిరిగివచ్చే ప్రజలను క్షుణ్ణంగా పరీక్షించి అనుమతించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలాన దుబాయి నుండి వచ్చిన వ్యక్తితో దేశంలో మొదటి కరోనా కేసు నమోదయింది. దినదిన ప్రవర్ధమానంగా మన దేశంలో మొదటి దశను దాటి రెండో దశలోకి ప్రవేశించి ప్రస్తుతం 200 పాజిటివ్ కేసులను దాటేసింది.

రాష్ట్రంలో ఈ పాజిటివ్ కేసుల సంఖ్య 20 దాటేసింది. ఇండోనేషియా వారు 10 మంది పైనే మన దేశంలోని కరీంనగర్‌లోకి ప్రవేశించి సంచరిస్తుండగా వారిలో 8 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. అలాగే అజాగ్రత్త మూలంగా ప్రముఖ బాలీవుడ్ సింగర్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణతో ఆమెతో డిన్నర్‌లో పాల్గొన్న ప్రముఖ రాజకీయ నాయకులకు, రాజకీయ నాయకులతో నిత్యం కార్యక్రమాలలో ఉండే దేశ రాష్ట్రపతికి కరోనా పరీక్షలు నిర్వహించుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఇదంతా కరోనా వైరస్‌ను చైనా తీసుకున్నంత సీరియస్‌గా ఇతర దేశాలు తీసుకోకపోవడం మూలంగానే పరిస్థితులు ఇంతలా వేగంగా దిగజారుతూ వస్తున్నాయని అర్థమవుతుంది. ఒక వ్యక్తి కరోనా పట్ల నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వ్యవహరించి వ్యాధిని సంక్రమింపజేసుకోవడం మూలంగా ఆ వ్యక్తి నివసించే ఇంట్లోని కుటుంబ సభ్యులు, ఆ వ్యక్తితో కలిసి తిరిగినవారు, ఆ వ్యక్తి సంచరించిన ప్రదేశాలలోని వ్యక్తులు ఇలా కరోనా ఒక్క వ్యక్తితో పరిమితం కాకుండా సమాజంలోని ఎంతో మందికి వైరస్ వ్యాప్తి

చెందేలా జరగడానికి ఒక్క వ్యక్తి నిర్లక్ష్యం, అజాగ్రత్తలు కారణమవుతాయని సమాజంలోని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. కరోనా పట్ల ఒక్క వ్యక్తి నిర్లక్ష్యం, అజాగ్రత్త సమాజంలోని ఎందరో ప్రాణాలను తీస్తుందని గమనించాలి. పాలకుల నిర్లక్ష్యం, అజాగ్రత్తల మూలంగా కరోనా వ్యాప్తి మొదటి దశ (విదేశీ వ్యక్తులకు మాత్రమే వైరస్ పాజిటివ్) నుండి ప్రజల నిర్లక్ష్యం మూలంగా ప్రస్తుతం రెండో దశ (విదేశాలకు వెళ్లి కరోనా బారిన పడి మన దేశానికి వచ్చినవారి కుటుంబ సభ్యులు, సహోద్యోగులకు వైరస్ సోకే దశ) కు చేరుకుంది మన దేశం. ఇక కరోనా వ్యాప్తి పట్ల ప్రస్తుతం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం, అజాగ్రత్తలు సమాజంలోని వ్యక్తులు పాటిస్తే అత్యంత కీలకమైన, ప్రమాదకరమైన దశ, రెండో దశలో వైరస్ బారిన పడిన వారి నుంచి చుట్టుపక్కల వారికి వైరస్ పెద్ద ఎత్తున వ్యాపిస్తూ చూస్తుండగానే వైరస్ వేలాది మందికి సోకి మరణాల సంఖ్య భారీగా పెరగడం మొదలయ్యే మూడవ దశకు చేరుకోవడానికి మన దేశానికి ఎంతో కాలం పట్టదని గమనించాలి.

మన దేశం రెండో దశలో ఉండడం కాస్త జాగ్రత్తలు పాటిస్తే మూడో దశలోకి వెళ్లకుండా పరిస్థితులు చక్కదిద్దుకోగలిగే అవకాశాలుండడం సంతోషించదగ్గ విషయమే. కానీ మూడో దశకు చేరుకుంటే మాత్రం మన దేశం కరోనా ధాటికి అల్లకల్లోలం అయి, నాలుగో దశకు సైతం చేరుకోవడం తథ్యంగా కనిపిస్తోంది. ఇక నాలుగో దశ గురించి చెప్పాల్సి వస్తే వైరస్ నియంత్రణ చెయ్యి దాటిపోయే దశగా చెప్పుకోవాలి. ఈ దశ ప్రస్తుతం ఇటలీ, ఇరాన్ దేశాలు అనుభవిస్తూ వేల సంఖ్యలో తమ దేశ ప్రజల ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నాలుగో దశను తొలిసారి చవిచూసిన చైనా, అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 80 వేలకు పైగా నమోదయినప్పటికీ ఆలస్యంగానైనా మేలుకుని కఠినంగా కట్టడి చర్యలు తీసుకోవడంతో ఆ దేశంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకొని తగ్గుముఖం పట్టేలా చేయగలిగింది.

అజాగ్రత్త, నిర్లక్ష్యం మూలంగా ఇటలీ, ఇరాన్ వంటి దేశాలు మాత్రం ప్రస్తుతం ఈదశకు చేరుకొని వైరస్ వ్యాప్తికి అల్లాడిపోతున్నాయి. అత్యాధునిక వైద్య సదుపాయాలున్న చైనా, ఇటలీ వంటి దేశాలు సైతం అల్లాడిపోయే మూడు, నాలుగో దశలు అరకొర వైద్య సదుపాయాలున్న మన దేశం ఎలా ఎదుర్కోగలదో ప్రతి వ్యక్తి కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. కరోనా వ్యాప్తిని మొదట లైట్‌గా తీసుకున్న పాలక వర్గాలు, వ్యాధి తీవ్రతను ఆలస్యంగానైనా గమనించి ఎట్టకేలకు దిద్దుబాటు చర్యలకు పూనుకొన్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలు స్వచ్ఛందంగా తమంతట తాము పాల్గొనే జనతా కర్ఫ్యూ (ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు ప్రతి ఒక్కరూ తమ ఇల్లు దాటి వెళ్ళకూడదు అనే నిబంధన) ను ఈ ఆదివారం దేశంలోని ప్రతి ఒక్క వ్యక్తి ఆచరించాలని ఆదేశించారు. బయటి ప్రదేశాలలో కరోనా జీవిత కాలం 12 గంటలకు మించి ఉండకపోవడం, జనతా కర్ఫ్యూ 14 గంటలు ఉండడంతో బయటి ప్రదేశంలో ఉండే వైరస్‌కు ప్రజలను చిక్కకుండా, తనంతట తాను చనిపోయేలా చేసి కొంత మేరకు వైరస్ వ్యాప్తి తీవ్రతను తగ్గించే మాస్టర్ ప్లాన్ గా జనతా కర్ఫ్యూను చెప్పుకోవచ్చు.

ఇది పౌరులందరూ ఆచరించదగ్గదే. ఈ జనతా కర్ఫ్యూ మూలంగా వైరస్ వ్యాప్తి మూడో దశకు చేరుకోకుండా కట్టడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ జనతా కర్ఫ్యూ తర్వాత నుండి మళ్ళీ షరా మామూలుగానే ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించకుండా ప్రయాణాలు, జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలలో సంచరించడం లాంటివి చేస్తే పరిస్థితులు చేయిదాటి పోయే అవకాశాలు లేకపోలేదని గమనించాలి. బాగా చదవకపోతే గురువు దండిస్తాడనే Spain,wireభయం లేకపోతే విద్యార్థికి విద్య అబ్బదు. తప్పు చేస్తే తల్లిదండ్రులు శిక్షిస్తారనే భయం పిల్లలలో లేకపోతే పిల్లలు సద్గుణులు కాలేరు. నేరాలు చేస్తే చట్టం శిక్షిస్తుందనే కాస్తో కూస్తో భయం లేకపోతే వ్యక్తులు సక్రమమమైన జీవనంలో కొనసాగలేరు. అలాగే అజాగ్రత్త, నిర్లక్ష్యంతో ప్రయాణాలు చేయడం, జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో కనీస జాగ్రత్తలు పాటించకుండా సంచరించడం లాంటివి చేస్తే తమ ప్రాణాలు, తమ కుటుంబ సభ్యుల ప్రాణాలతో పాటు సమాజంలోని ఇతర వ్యక్తుల ప్రాణాలు సైతం బలి గొనాల్సి వస్తుందనే భయం దేశంలోని ప్రతి వ్యక్తికి లేకపోతే కరోనా వైరస్ ధాటికి దేశం నాశనం కాక తప్పదు. కావున కరోనా వ్యాప్తి, వ్యాధి తీవ్రత పట్ల ఎన్ని జోకులేసి నవ్వుకుంటున్నప్పటికీ ఆచరణలో మాత్రం కొంత భయంతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రతి పౌరునికి ఉందని గమనించాలి.

Italy passes China’s coronavirus death toll

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నిర్లక్ష్యం కొంప ముంచుతుంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: