ఎవరూ గెలిచినా చరిత్రే!

చెన్నైతో ముంబై అమీతుమీ, నేడు ఉప్పల్‌లో ఐపిఎల్ తుది సమరం మన తెలంగాణ/హైదరాబాద్: అభిమానులను ఉర్రుతలూగించిన ఐపిఎల్ 12వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, మాజీ విజేత ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే ఫైనల్‌తో ఈ మెగా క్రికెట్ సంగ్రామానికి తెరపడుతుంది. అంచనాలకు తగినట్టుగానే రెండు అగ్రశ్రేణి జట్లు ముంబై, చెన్నైలు ఫైనల్ సమరానికి అర్హత సాధించాయి. ఇరు […] The post ఎవరూ గెలిచినా చరిత్రే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నైతో ముంబై అమీతుమీ, నేడు ఉప్పల్‌లో ఐపిఎల్ తుది సమరం
మన తెలంగాణ/హైదరాబాద్: అభిమానులను ఉర్రుతలూగించిన ఐపిఎల్ 12వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, మాజీ విజేత ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే ఫైనల్‌తో ఈ మెగా క్రికెట్ సంగ్రామానికి తెరపడుతుంది. అంచనాలకు తగినట్టుగానే రెండు అగ్రశ్రేణి జట్లు ముంబై, చెన్నైలు ఫైనల్ సమరానికి అర్హత సాధించాయి. ఇరు జట్లు కూడా నిలకడైన విజయాలతో టైటిల్ రేసులో నిలిచాయి. క్వాలిఫయర్ వన్‌లో ముంబై ఘన విజయంతో ఫైనల్‌కు చేరుకుంది. మరోవైపు చెన్నై క్వాలిఫయర్2లో బలమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇటు ముంబై, అటు చెన్నైలు ఇప్పటి వరకు మూడేసి సార్లు ఐపిఎల్ ట్రోఫీని ముద్దాడాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 4 ట్రోఫీలతో చరిత్ర సృష్టిస్తోంది. కిందటిసారి ట్రోఫీని గెలిచిన చెన్నై ఈసారి కూడా దాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఇప్పటి వరకు మూడు సార్లు విజేతగా నిలిచిన ముంబై తన ఖాతాలో నాలుగో టైటిల్‌ను జత చేసుకుని చరిత్ర సృష్టించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో ఎవరూ గెలిచినా నాలుగో ఐపిఎల్ ట్రోఫీని గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించడం ఖాయం. ఇందులో ఏ జట్టు ఈ ఘనతను సాగిస్తుందనే విషయం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. వాట్సన్, బ్రావో వంటి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు చెన్నైకు అందుబాటులో ఉన్నారు. మరోవైపు హార్దిక్ పాండ్య, పొలార్డ్, కృనాల్ పాండ్య వంటి ఆల్‌రౌండర్లతో ముంబై కూడా సమతూకంగా ఉంది. ఇరు జట్లలోనూ ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఫైనల్ సమరం ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
జోరు సాగాలి

ఢిల్లీతో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఓపెనర్లు ఫేన్ వాట్సన్, డుప్లెసిస్‌లు అసాధారణ ఆటతో చెన్నైను ఆదుకున్నారు. ఈసారి కూడా జట్టు వీరిపై భారీ ఆశలు పెట్టుకుంది. కిందటి సీజన్‌లో హైదరాబాద్‌తో జరిగిన ఐపిఎల్ ఫైనల్లో షేన్ వాట్సన్ చారిత్రక ఇన్నింగ్స్‌తో చెన్నైను విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. ఈసారి కూడా వాట్సన్ నుంచి ఇలాంటి ప్రదర్శనే సిఎస్‌కె ఆశిస్తోంది. వాట్సన్ విజృంభిస్తే ముంబై బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వాట్సన్ విజృంభిస్తే ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించడం చెన్నైకు కష్టం కాదనే చెప్పాలి. ఇక, డుప్లెసిస్ కూడా జోరుమీదున్నాడు. కిందటి మ్యాచ్‌లో చిరస్మరణీయ బ్యాటింగ్‌తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో కూడా మెరుగైన ఆటతో జట్టుకు అండగా నిలువాలని తహతహలాడుతున్నాడు. మరోవైపు సురేశ్ రైనా, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్ ధోనిలతో చెన్నై బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. బ్రావో, జడేజాలు కూడా విజృంభిస్తే తిరుగే ఉండదు. అయితే నిలకడలేమి జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. కీలక సమయంలో తడబడుతుండడంతో జట్టుకు ఇబ్బందులు తప్పడం లేదు. కాగా, ఈ మ్యాచ్‌లో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలనే పట్టుదలతో చెన్నై ఉంది.
బౌలింగే బలం

ఇక, ఈ ఐపిఎల్‌లో చెన్నై ఫైనల్‌కు చేరిందంటే బౌలర్లదే కీలకపాత్ర అనడంలో సందేహం లేదు. దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, బ్రావో, ఇమ్రాన్ తాహిర్, జడేజాలు అద్భుత బౌలింగ్‌తో చెన్నైను చాలా మ్యాచుల్లో విజయం సాధించి పెట్టారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కూడా బౌలర్లు కీలకపాత్ర పోషించారు. ఈసారి కూడా బౌలర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా చాహర్, ఇమ్రాన్ తాహిర్, హర్భజన్‌లు ఈ మ్యాచ్‌కు కీలకంగా మారారు. కిందటి మ్యాచ్‌లో బ్రావో కూడా అద్భుతంగా రాణించాడు. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్‌లో బలంగా ఉన్న చెన్నై తన ఖాతాలో నాలుగో ట్రోఫీని జమచేసుకోవాలని తహతహలాడుతోంది.
ఆత్మవిశ్వాసంతో


మరోవైపు ముంబై ఇండియన్స్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. క్వాలిఫయర్ వన్‌లో చెన్నైను చిత్తుగా ఓడించిన ముంబై ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బౌలర్లు, బ్యాట్స్‌మెన్ ముంబైకి అందుబాటులో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసివచ్చే అంశం. ఈసారి కూడా రోహిత్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మరో ఓపెనర్ డికాక్ కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. కాగా, చెన్నైతో జరిగిన క్వాలిఫయర్ సమరంలో అసాధారణ ఆటతో ఆకట్టుకున్న సూర్యకుమార్ మరోసారి జట్టుకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యాడు. హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య తదితరులతో ముంబై చాలా బలంగా ఉంది. దీంతో నాలుగో ఐపిఎల్ ట్రోఫీని అందుకోవడం రోహిత్ సేనకు కష్టం కాకపోవచ్చు.
జట్ల వివరాలు
ముంబై (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్య, పొలార్డ్, జయంత్ యాదవ్, రాహుల్ చాహర్, జస్‌ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగ.
చెన్నై (అంచనా): మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్), షేన్ వాట్సన్, డుప్లెసిస్, మురళీ విజయ్, అంబటి రాయుడు, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, బ్రావో, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్.

IPL 2019: MI vs CSK Final match today

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎవరూ గెలిచినా చరిత్రే! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: