అప్పుడు కన్నీళ్లు ఆగలేదు

Vijayashanthi

 

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, లేడీ అమితాబ్ విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా విజయశాంతి మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

హ్యాపీగా ఉంది…
13 ఏళ్ల తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి మంచి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషాన్నిచ్చింది. సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో కలిసి 30 సంవత్సరాల క్రితం ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో నటించాను. ఇప్పుడు అతనితో కలిసి ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది.

కథ నచ్చడంతో చేశా…
రాజకీయాల్లో బిజీగా ఉండి అసలు సినిమాలే చేయవద్దని అనుకున్న నన్ను దర్శకుడు అనిల్ రావిపూడి కలిసి మంచి పాత్ర ఉంది మీరు తప్పకుండా ఈ సినిమా చేయాలని అన్నారు. నేను కొంత సమయం తీసుకొని ఆలోచించాను. ఆతర్వాత ఈ కథ విన్నాను. కథ నచ్చడంతో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.

స్పెషల్ మూవీ…
మరచిపోలేని అనుభూతినిచ్చింది ఈ చిత్రం. ముఖ్యంగా మహేష్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఘన విజయం సాధించిన ఈ చిత్రం నా కెరీర్‌లో స్పెషల్ మూవీగా నిలిచింది.

అందరూ మెచ్చుకుంటున్నారు…
ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు నా నటన అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు. నేను నటించిన భావోద్వేగ సన్నివేశాలను చూసి మహిళలతో పాటు పురుషులు కూడా కన్నీరు పెడుతున్నారు. నా నటన చూసి అందరూ మెచ్చుకుంటున్నారు.

కన్నీళ్లు ఆగలేదు…
గతంలో నేను చేసిన ఒసేయ్ రాములమ్మా, ప్రతిఘటన, కర్తవ్యం చిత్రాల్లో చాలా బరువైన పాత్రలు చేశాను. అలాగే ఇప్పుడు ‘సరిలేరు నీకెవ్వరు’లో కూడా అంతే బరువైన పాత్ర చేశాను. ముఖ్యంగా చివరి సీన్ చేసేటప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే కూర్చున్నాను. ఈ సీన్ చేసేటప్పుడు నాకు మనసులో ఏదో తెలియని బాధ కలిగింది. ఈ సీన్‌లో లీనమై నటించడంతో కన్నీళ్లు ఆగలేదు.

మదర్ ఇండియా అయ్యాను…
ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ప్రతి డైలాగ్, సీన్‌ను గుర్తు పెట్టుకొని చెబుతున్నారంటే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అర్థమవుతుంది. ఈ చిత్రంలో జవాన్ తల్లిగా నటించడం వల్ల మదర్ ఇండియా అయ్యాను. ఇంత గొప్ప పాత్ర ఇచ్చిన అనిల్‌కు థ్యాంక్స్.

Interview with Vijayashanthi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అప్పుడు కన్నీళ్లు ఆగలేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.