భవిష్యత్తులో అలాంటి సినిమాలు చేస్తా

నాగచైతన్య, అను ఇమాన్యుయల్ హీరోహీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా నాగచైతన్యతో ఇంటర్వూ విశేషాలు…
NagaChaitanya

చాలా కూల్‌గా…
పూర్తి వినోదాత్మక చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. నా కెరీర్‌లో తొలిసారి ఫుల్ ఎంటర్‌టైనింగ్ రోల్‌లో నటించిన చిత్రమిది. ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరవుతాను. సినిమాలో నా పాత్ర చాలా కూల్‌గా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా అంతే కూల్‌గా డీల్ చేసే పాత్ర నాది. ఇలాంటి పాత్ర నా దగ్గరికి తీసుకొచ్చిన మారుతికి థాంక్స్.
ఇగో ఎక్కువైతే…
‘శైలజారెడ్డి అల్లుడు’ అని సినిమా టైటిల్ ప్రకటించగానే అప్పటినుంచి ఇది అత్త, అల్లుడి మధ్య రివెంజ్ డ్రామా కథతో తెరకెక్కిన చిత్రమని చాలా రకాల గాసిప్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా అస్సలు అలా ఉండదు. పూర్తిగా డిఫరెంట్‌గా ఉంటుంది. మనిషికి ఇగో ఎక్కువైతే ఎన్ని సమస్యలు వస్తాయనేది కామెడీగా చూపించాము. అదేవిధంగా ఇగో లేకపోతే ఎలా సరదాగా ఉండవచ్చని ఒక చిన్న సందేశం కూడా ఉంటుంది ఈ సినిమాలో. మంచి భావోద్వేగాలతో వినోదాత్మకంగా తెరకెక్కింది ఈ సినిమా.
మొదట్లో టెన్షన్ పడ్డా…
రమ్యకృష్ణ, నాన్నగారి కాంబినేషన్‌లో వచ్చిన ‘హలో బ్రదర్’ సినిమా అంటే నాకు బాగా ఇష్టం. నాకు గుర్తున్నంతవరకు ఆ సినిమాను ఇప్పటికి 30 సార్లు చూసి ఉంటాను. ‘బాహుబలి’ తర్వాత రమ్యకృష్ణ దేశవ్యాప్తంగా స్టార్ అయిపోయారు. అంతటి నటితో నటించాల్సి వచ్చినప్పుడు మొదట్లో కొంచెం టెన్షన్ పడ్డాను. తర్వాత ఆమెతో కలిసి చక్కగా నటించాను. ఈ సినిమాలో ప్రధానంగా మా ఇద్దరి మధ్య వచ్చే చివరి 30 నిమిషాల ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అవుతుంది.
కడుపుబ్బ నవ్విస్తాడు…
సినిమాలో వెన్నెల కిషోర్ కోసం మారుతి ఒక అద్భుతమైన కామిక్ రోల్ రాశాడు. సినిమా ఫస్టాఫ్ మొత్తం నాకు, కిషోర్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా బాగా నవ్విస్తాయి. సెకండాఫ్‌లో కిషోర్ డాక్టర్‌గా వచ్చి 30 ఇయర్స్ పృథ్వీతో కలిసి పలు సన్నివేశాల్లో కడుపుబ్బ నవ్విస్తాడు.
నాకు కూడా నచ్చాయి..
టాలీవుడ్‌లో ఈమధ్య కొంచెం వైవిధ్యమైన సినిమాలు వస్తున్నాయి. హీరోలు కూడా కొత్తగా ప్రయత్నిస్తున్నారు. ఇక అర్జున్ రెడ్డి, ఆర్‌ఎక్స్ 100 సినిమాలు నాకు కూడా నచ్చాయి. నేను అలాంటి సినిమాలు చేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాల సమయం ఉందని అనుకుంటున్నాను. భవిష్యత్తులో అలాంటి సినిమాలు చేస్తాను.
పెద్దగా వర్కవుట్ కాలేదు…
నేను మొదటి నుంచి కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నాను. మా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూనే ఉన్నాము. మొన్న ‘చి.ల.సౌ’ సినిమాను కూడా ఆ ఉద్దేశ్యంతోనే విడుదల చేశాము. కానీ కొత్త దర్శకులతో పనిచేస్తే నాకైతే పెద్దగా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతానికి అయితే కొత్త డైరెక్టర్లతో పని చేయకూడదని అనుకుంటున్నాను.

Comments

comments