భూకబ్జాలపై ఇంటలిజెన్స్ కన్ను…!

-సర్కారు భూముల వివరాల సేకరణ -కబ్జాదారుల జాబితా సిద్దం చేస్తున్న అధికారులు -రిజిస్ట్రేషన్లపై కొనసాగుతున్న ఆంక్షలు -జీర్ణించుకోలేకపోతున్న మధ్యదళారులు ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రభుత్వ భూములు, చెరువులు, కందకాల ఆక్రమణలపై ఇంటలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రాలైన ఆదిలాబాద్, నిర్మల్‌లలో గత కొన్నేళ్ల నుంచి ఇష్టానుసారంగా భూఆక్రమణల పర్వం కొనసాగుతోంది. అధికారుల నిర్లక్ష్య వైఖరి, రాజకీయ అండదండలతో కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. చెరువు శిఖం భూములను కొల్లగొడుతున్నారు. చారిత్రక కట్టడాలను […] The post భూకబ్జాలపై ఇంటలిజెన్స్ కన్ను…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

-సర్కారు భూముల వివరాల సేకరణ
-కబ్జాదారుల జాబితా సిద్దం చేస్తున్న అధికారులు
-రిజిస్ట్రేషన్లపై కొనసాగుతున్న ఆంక్షలు
-జీర్ణించుకోలేకపోతున్న మధ్యదళారులు
ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రభుత్వ భూములు, చెరువులు, కందకాల ఆక్రమణలపై ఇంటలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రాలైన ఆదిలాబాద్, నిర్మల్‌లలో గత కొన్నేళ్ల నుంచి ఇష్టానుసారంగా భూఆక్రమణల పర్వం కొనసాగుతోంది. అధికారుల నిర్లక్ష్య వైఖరి, రాజకీయ అండదండలతో కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. చెరువు శిఖం భూములను కొల్లగొడుతున్నారు. చారిత్రక కట్టడాలను ఈ కబ్జాదారులు వదలడం లేదు. జిల్లా కేంద్రాలలో భూముల విలువలు ఆకాశాన్నంటుతుండడంతో అందరి దృష్టి ఇటువైపే కేంద్రీకృతమవుతోంది. అయితే రాజకీయ నాయకుల అండతో కబ్జాదారులు అధికారులపై ఒత్తిళ్లు తెస్తూ తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చెరువులు, కందకాల భూములకు సంబంధించి రికార్డులను తారుమారు చేస్తూ అక్రమ రిజిస్ట్రేషన్లను చేస్తున్నారని అంటున్నారు. పట్టణాల నడిబొడ్డును సైతం వదలడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్‌లోని ఖానాపూర్ చెరువు శిఖం భూముల ఆక్రమణ యధేచ్చగా సాగుతోంది. అలాగే ఇక్కడి అనేక కందకాలు ఇప్పటికే ఆక్రమణకు గురికాగా, మిగిలిన వాటిని కూడా కొల్లగొట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. నిర్మల్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు స్వయంగా అధికారులే అంగీకరిస్తున్నారు. ఇక్కడి పట్టణానికి ఆనుకొని ఉన్న గొలుసు కట్టు చెరువులను కబ్జాదారులు వరుసపెట్టి ఆక్రమిస్తున్నారు. ఈ కబ్జాల కారణంగా చారిత్రక చెరువులు కనుమరుగై పోతున్నాయి. ఇక్కడి కోటలు, బురుజులు సైతం ఇప్పటికే కబ్జాకు గురయ్యాయి. చెరువు భూములు, చారిత్రక కట్టడాలకు సంబంధించి సర్వే నెంబర్లు సైతం సృష్టిస్తున్నారు. నకిలీ పట్టాదారు పుస్తకాలతో ఈ భూములపై రుణాలను సైతం తీసుకుంటున్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున కబ్జాల పర్వం కొనసాగుతున్నప్పటికీ అధికారులు ఆశించిన రీతిలో స్పందించక పోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ భూ ఆక్రమణల కారణంగా ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతుండడంతో ఎట్టకేలకు నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగినట్టు వార్తలు వస్తున్నాయి.  జిల్లాల వారీగా ప్రభుత్వ, శిఖం భూముల వివరాలను సేకరించి ఇంటలిజెన్స్ వర్గాలు ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడుగా భూములను కబ్జా చేసిన వారి జాబితాలను సైతం ఇంటలిజెన్స్ వర్గాలు రూపొందించి ఆ జాబితాను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటలిజెన్స్ జాబితా ఆధారంగా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పోలీసు కేసులు నమోదు చేయించే చర్యలు కూడా మొదలు కానున్నట్లు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్న పలు ప్రాంతాలలో వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చడంతో పాటు వాగులు, కాలువలను పూడ్చి వేసి చదును చేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే పట్టణంతో పాటు పట్టణ శివారులోని ప్రభుత్వ భూముల క్రయవిక్రయాలపై ఆంక్షలు విధించడంలో భాగంగా రిజిస్ట్రేషన్లు కాకుండా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఆయా భూముల వివరాలను నమోదు చేసి క్రయవిక్రయాలు చోటు చేసుకోకుండా బ్లాక్‌లో పెట్టారు. ఇలాంటి భూములను రిజిస్ట్రేషన్ చేయకపోతుండడంతో మధ్యదళారులు, వివిధ పార్టీల నాయకులు ఈ విషయమై రిజిస్ట్రేషన్ అధికారులతో వాగ్వాదానికి సైతం దిగుతున్నారు. ఇలాంటి అక్రమార్కులను నిరోధించేందుకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా యుద్దప్రాతిపదికన ఆక్రమణకు గురైన సర్కారు భూములను రక్షించేందుకు చర్యలు మొదలు పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. దీనికితోడుగా సర్కారు భూములను కాపాడేందుకు కంచెలు ఏర్పాటు చేసి ఆక్రమణలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొని వచ్చేందుకు చర్యలు తీసుకుంటుండగా అక్రమంగా భూములు ఆక్రమించిన వారి నుంచి సదరు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.

Intelligence Inquiry on Land Occupation

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భూకబ్జాలపై ఇంటలిజెన్స్ కన్ను…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: