నిలువెల్లా గాయం… 38 ఏళ్ల ప్రస్థానం

Indravelli carnage of tribals completes 39 years

 

ఆదిలాబాద్‌: హక్కుల కోసం ఇంద్రవెల్లి కేంద్రంగా జరిగిన పోరాటంలో అనేక మంది ఆదివాసీలు అమరులై నేటికి సరిగ్గా 39 ఏళ్లు పూర్తయ్యాయింది. ఆనాటి చేదు జ్ఞాపకాలు ఇప్పటికి అడవి బిడ్డలను వెంటాడుతూనే ఉన్నాయి. అడవి ఎరుపెక్కిన రోజుకు సాక్షి… నెత్తురు ఇంకిన నేల… సర్కార్ దాష్టీకానికి నిలువెత్తు నిదర్శనం… ఇంద్రవెల్లి స్థూపం… స్థూపం వెనుక అడవి బిడ్డల త్యాగాలున్నాయి. దోపిడి, పీడనపై తిరుగుబాటుంది. ఆంక్షల సంకెళ్లు తెంచుకున్న పోరాటముంది. న్యాయం కోసం ఆరాటం దాగుంది. సరిగ్గా 38 ఏళ్ల క్రితం. ఇదే రోజు అంటే 1981, ఏప్రిల్ 20 ఇంద్రవెల్లి రుదిర క్షేత్రమైన దినం. అమాయక గిరిజనుల గుండెలను తూటాలు చీల్చిన చీకటి రోజు. తాము పోడు చేసిన నేలకు పట్టాలు ఇవ్వాలని, తమ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్లతో రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లి సభకు పిలుపునిచ్చింది. మొదట సభను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. గిరిజనుల నుంచి వస్తున్న స్పందన చూసి సభపై నిషేదం విధించారు. పోలీసులు ఈ విషయం తెలియన అడవి బిడ్డలు కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకొని ప్రవాహంలా ఇంద్రవెల్లి దారిపట్టారు.

అడ్డుకునేందుకు పోలీస్ బలగాలు అడవుల్లో దిగాయి. పోలీసులు వేలాదిగా వస్తున్న నిరాయుధులైన గిరిజనులపై తూటాల వర్షం కురిపించారు. అంతే పచ్చటి అడవి నెత్తురోడింది. పారిన నెత్తురుకు పగిలిన తలలకు లెక్కలేదు. చెట్టుకొకరు… పుట్టకొకరుగా అడవి బిడ్డలు పారిపోయారు. వెంటాడి మరీ కాల్చిచంపాయి పోలీస్ బలగాలు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంద్రవెల్లి కాల్పుల్లో 13 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వాధికారులు తేల్చారు. పియుడిఆర్ నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీ 60 మంది చనిపోయ్యారని, వందల మందికి గాయాలయ్యాయని గుర్తించింది. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్థూపాన్ని నిర్మించారు. 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్థూపాన్ని పేల్చేశారు. ప్రజా సంఘాల ఒత్తిళ్లు, గిరిజనుల పోరాట ఫలితంగా 1987లో ఐటిడిఎ నిధులతో తిరిగి స్థూపాన్ని కట్టారు.

ఏప్రిల్ 20 వస్తుందంటే చాలు ఇంద్రవెల్లి పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ విధిస్తారు. అమరులకు నివాళుల్చించే స్వేచ్చను సైతం కాలరాస్తున్నారు పోలీసులు. నిర్బంధం నిషేదాజ్ఞలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నా ప్రజాసంఘాలు, గిరిపుత్రులు అమరులను యాది చేసుకుంటూనే ఉన్నారు. ఇంద్రవెల్లి గతం కాదు నెత్తుటి జ్ఞాపకం. ఏడాదికోసారి యాది చేసుకుంటే సరిపోదు ఏ ఆశయం కోసం నాడు గిరిజనులు అసుపులు బాసారో వాటి ఆశయాలు ఇంకా నెరవేరలేదు. అభివృద్ధి పేరుతో ఆదివాసీ సంస్కృతిని ధ్వంసం చేసే కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఓట్ల జాతరలో హామీల వర్షం కురిపించే నాయకులు అడవి బిడ్డలపై మొసలి కన్నీరు కార్చుతున్నారు. ఏళ్లు గడిచిన ప్రభుత్వాలు, పాలకులు మారినా వీరి బతుకుల్లో వెలుగుల్లేవు ఈ చీకట్లు పోయి వెలుగులు వచ్చినప్పుడే ఇంద్రవెల్లి అమరులు త్యాగాలకు నిజమైన నివాళి దక్కినట్లుగా చెప్పుకోవచ్చు.

Indravelli carnage of tribals completes 39 years

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నిలువెల్లా గాయం… 38 ఏళ్ల ప్రస్థానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.