ఆంగ్ల సాహిత్యంలో ఎగరేసిన భారతీయ జెండా అమితావ్

  భారతీయ భాషా సాహిత్యానికి అందజేసే సర్వోన్నత పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా ఆంగ్ల సాహిత్య సృజనకు పొందిన ఘనత సాధించిన భారతీయ రచయిత అమితావ్ ఘోష్. యాత్రా విశేషాలు, చరిత్ర, రాజకీయ పోరాటాలు, ప్రేమ, హింస మొదలైన అనేక అంశాలను తన సాహిత్యంలో ప్రతిబింబింపజేసిన ధీశాలి ఆయన. కాల్పనిక సాహిత్యంతో పాటు నాన్‌ఫిక్షన్ రచనల్లోనూ తనదైన ప్రత్యేకతను ఆయన కనబరిచారు. ఆయన సాహిత్యం ఖండాంతర అంశాలను ప్రతిబింబింపజేసే సర్వవ్యాపిత సాహిత్యం. వివిధ దేశాల చుట్టూ పరిభ్రమించే అంతర్జాతీయ సాహిత్య […]

 

భారతీయ భాషా సాహిత్యానికి అందజేసే సర్వోన్నత పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా ఆంగ్ల సాహిత్య సృజనకు పొందిన ఘనత సాధించిన భారతీయ రచయిత అమితావ్ ఘోష్. యాత్రా విశేషాలు, చరిత్ర, రాజకీయ పోరాటాలు, ప్రేమ, హింస మొదలైన అనేక అంశాలను తన సాహిత్యంలో ప్రతిబింబింపజేసిన ధీశాలి ఆయన. కాల్పనిక సాహిత్యంతో పాటు నాన్‌ఫిక్షన్ రచనల్లోనూ తనదైన ప్రత్యేకతను ఆయన కనబరిచారు. ఆయన సాహిత్యం ఖండాంతర అంశాలను ప్రతిబింబింపజేసే సర్వవ్యాపిత సాహిత్యం. వివిధ దేశాల చుట్టూ పరిభ్రమించే అంతర్జాతీయ సాహిత్య సృజన అమితావ్ సొంతం. అయినా ఆయా స్థలాల్లో తన సొంత నగరం కోల్‌కతాకు కూడా ఆయన స్థానం కల్పిస్తారు.

పరిశోధనాత్మకత ఆయన రచనల్లో కనబడే మరో అంశం. సున్నితమైన మానవ సంబంధాలకు ఆయన రచనలు దర్పణం పడతాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన సంఘటనలకు ఆసక్తి కలిగించే కథనాన్ని జతచేసి పాఠకులకు హృదయాలకు హత్తుకునేలా అందజేయడం ఆయన రచనా శైలి. అందువల్లే 57 సంవత్సరాల జ్ఞానపీఠ చరిత్రలో 54వ పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా ఆంగ్ల సాహిత్యానికి స్వీకరిస్తున్న అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. భారతీయ జ్ఞానపీఠ ట్రస్టు పేర్కొన్నట్టుగా ‘లోతైన సాహిత్య సృజనతో గతానికి,వర్తమానానికి లంకె కుదిర్చిన మహారచయిత అమితావ్’.

అంతర్జాతీయ సాహిత్య క్షేత్రంలో భారతీయ కాల్పనిక సాహిత్యానికి కూడా చోటు దక్కేలా చేసిన అమితావ్ ఘోష్ 1956 జూలై 11న కోల్‌కతాలో జన్మించారు. తండ్రి ఉద్యోగం కారణంగా దేశ విదేశాల్లో ఆయన బాల్యం గడిచింది. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, ఇరాన్ తదితర దేశాల్లో ఆయన బాల్య స్మృతులు ఉన్నప్పటికీ డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్‌లో పాఠశాల స్థాయి విద్యాభ్యాసం చేశారు. ప్రముఖ రచయిత విక్రవ్‌ు సేథ్ ఆయన సహాధ్యాయి. అనంతరం సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సంస్థల్లో చదువుకుని, 1978లో స్నాతకోత్తర పట్టభద్రుడయ్యారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో పీటర్ లీన్‌హార్ట్ పర్యవేక్షణలో మానవ పరిణామ శాస్త్రంలో 1982లో డాక్టరేటు పొందారు.

న్యూఢిల్లీలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రికతో అమితావ్ ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత ది హిందూ, ది న్యూయార్కర్ మొదలైన పత్రికల్లో పనిచేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో, కైరోలోని అమెరికన్ విశ్వవిద్యాలయంలో, న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో, క్వీన్స్ కళాశాలలో, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో బోధనావృత్తి నిర్వహించారు. కోల్‌కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్‌లో, తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్‌లో ఫెల్లోగా ఆయన వ్యవహరించారు. రచయిత్రి, సంపాదకురాలు డెబోరా బేకర్‌ను ఘోష్ వివాహం చేసుకున్నారు.

తన తొలి నవల ‘ది సర్కిల్ ఆఫ్ రీజన్’ను 1986లో అమితావ్ ప్రచురించారు. భారత దేశానికి చెంది, తీవ్రవాద ఉద్యమానికి నాయకుడిగా భావించే ఒక వ్యక్తి ఉత్తర ఆఫ్రికాకు వలస వెళ్ళడం ఈ నవల కథాంశం. ఈ నవల 1990లో ‘ప్రిక్స్ మెడిసిస్ ఎట్రేంగర్’ పురస్కారాన్ని పొందింది. భారతదేశం 1947లో ఆంగ్లేయుల నుండి విముక్తి పొందిన అనంతరం రెండు కుటుంబాల్లో ఎదురైన సంఘటనలను ఆసక్తికరంగా మలిచిన నవల ‘ది షాడో లైన్స్’. 1988లో ఈ నవలను ఆయన వెలువరించారు. అమితావ్ ఘోష్ రాసిన ఈ తొలి రెండు నవలలు ‘ది సర్కిల్ ఆఫ్ రీజన్’, ‘ది షాడో లైన్స్’ అనేక భాషల్లోకి తర్జుమా అయ్యాయి. అంతర్జాతీయంగా పాఠకుల ప్రశంసలందుకున్నాయి.

సోషల్ ఆంథ్రొపాలజీలో డాక్టరేటు పొందిన అమితావ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంగా రాసిన నవల ‘ది కలకత్తా క్రోమోజోవ్‌ు’. మలేరియాకు కారణమయ్యే పారసైట్ పరిశోధన చరిత్రను ఈ నవలలో ఆయన ఆసక్తికరంగా మలిచారు. ఈ నవల ఉత్తమ సైన్స్ ఫిక్షన్‌కు గాను 1997లో ఆర్థర్ సి క్లార్క్ అవార్డును గెలుచుకుంది. మయన్మార్ (బర్మా)లో 1885లో ఆంగ్లేయులు పాగా వేసిన కాలం నుండి రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఆ దేశం స్వాతంత్య్రం పొందేదాకా వివిధ సంఘటనల సమాహారంగా ఆయన రాసిన నవల ‘ది గ్లాస్ ప్యాలెస్’. 2000 సంవత్సరంలో ఈ నవలను ప్రచురించారు. అనంతరం 2004లో భారతీయ, అమెరికన్ పాత్రలతో ఆయన రచించిన నవల ‘ది హంగ్రీ టైడ్’. బంగాళాఖాతం ఒడ్డున ఉన్న భారతదేశ తూర్పు తీరంలో ఉన్న సుందర్‌బన్‌లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఈ నవల ఇతివృత్తం.

ఈ నవల 2004లో హచ్ క్రాస్‌వర్డ్ బుక్ అవార్డును పొందింది. 2009లో రాసిన ‘సీ ఆఫ్ పాపీస్’తో రచనల్లో వైవిధ్యమైన కోణాన్ని ప్రదర్శించారు. ఆగ్నేయాసియాలోని సముద్ర జలాల్లో ప్రయాణించే ఐబిస్ అనే ఓడలో కూలీలతో పాటు నల్లమందును రవాణా చేయడం కథాంశంగా ‘ఐబిస్ ట్రయాలజీ’ పేరుతో ఆయన రాసిన మూడు నవలల సీరీస్‌లో ఈ నవల మొదటిది. పాపీస్ అనే చెట్టు పుష్పాల నుండి నల్లమందును సంగ్రహిస్తారు. అందుకే ఆ పేరుతో ‘సీ ఆఫ్ పాపీస్’గా ఈ నవలకు పేరు పెట్టడం పాఠకులను ఆకర్షిస్తుంది. ఈ నవలలో దీతి పాత్రలో అనేక సంఘర్షణలు కనబడతాయి. తన భర్త హకుం సింగ్ చనిపోయిన అనంతరం ఆనాటి భారతీయ దురాచారం సతీ సహగమనానికి పాల్పడకుండా పొరుగూరికి చెందిన కలువా అనే దళితుడిని వివాహం చేసుకుంటుంది. ఈ సీరీస్‌లో ఆయన రాసిన మరో రెండు నవలలు ‘రివర్ ఆఫ్ స్మోక్’, ‘ఫ్లడ్ ఆఫ్ ఫైర్’ కూడా పేర్లు పెట్టడంలో ఆయన నైపుణ్యానికి అద్దం పడతాయి. అనేక ప్రక్రియలు కలగలిసిన ‘ఇన్ యాన్ ఆంటిక్ లాండ్’ అనే గ్రంథాన్ని అమితావ్ 1992లో రాశారు.

యాత్రా సాహిత్యంతో పాటు ఆత్మకథ, స్మృతి సాహిత్యం మొదలైన పలు ప్రక్రియలు ఈ గ్రంథంలో కనబడతాయి. 1980వ దశకం మొదట్లో ఈజిప్ట్‌లోని ఒక గ్రామంలో తన పరిశోధనల పరంపరను రచయిత వివరించడం ఈ గ్రంథంలో కనిపిస్తుంది. ‘డాన్సింగ్ ఇన్ కాంబోడియా’, ‘ఎట్ లార్జ్ ఇన్ బర్మా’, ‘ది ఇమాం అండ్ ద ఇండియన్’ అనే వ్యాస సంపుటాలను ఆయన రాశారు. ‘ఇన్సెండియరీ సర్కవ్‌ుస్టాన్సెస్: ఎ క్రానికల్ ఆఫ్ ద టర్మాయిల్ ఆఫ్ అవర్ టైవ్‌‌సు’ అనే నాన్ ఫిక్షన్ రచనను 2005లో ఆయన వెలువరించారు. వాతావరణ మార్పుల వల్ల కలిగే విధ్వంసం అంశంగా ‘ది గ్రేట్ డిరేంజ్‌మెంట్ : కై ్లమేట్ ఛేంజ్ అండ్ ద అన్ థింకబుల్’ అనే గ్రంథాన్ని 2016లో రచించారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల అనర్థాలను ఈ గ్రంథంలో ఆయన వివరించారు. ఆంగ్ల సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరపరుచుకున్న అమితావ్ అనేక పురస్కారాలను అందుకున్నారు.

సాహిత్యంలో ఆయన సేవలకు 2007లో పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన పొందారు. అంతకు చాలాముందే 1989లో సాహిత్య అకాడమీ వార్షిక పురస్కారాన్ని స్వీకరించారు. 1990లో ఆనంద పురస్కార్, 1999లో పుష్‌కార్ట్ ప్రైజ్, 2011లో మ్యాన్ ఆసియా లిటరరీ ప్రైజ్ పొందారు. జర్మనీకి చెందిన ఇంటర్నేషనల్ ఇబుక్ అవార్డ్ ను 2001లో, ఇటలీకి చెందిన గ్రింజేన్ కేవర్ అంతర్జాతీయ బహుమతిని 2007లో ఇజ్రాయిల్‌కు చెందిన డాన్ డేవిడ్ బహుమానాన్ని 2010లో, కెనడాకు చెందిన బ్లూ మెట్రోపాలిస్ అంతర్జాతీయ లిటరరీ గ్రాండ్ ప్రిక్స్ పురస్కారాన్ని 2011లో ఆయన స్వీకరించారు. ముంబాయి లిటరేచర్ ఫెస్టివల్‌లో జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఆయన పొందారు.

2009లో రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ ఫెల్లోగా ఎంపికయ్యారు. 2015లో ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్ట్ ఆఫ్ ఛేంజ్ ఫెల్లోగా ఆయనకు గౌరవం లభించింది. వివిధ విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేటు అందజేశాయి. అంతర్జాతీయత అంశాలకు భారతీయ సొబగులద్దిన విఖ్యాత రచయిత ఘోష్. ప్రాచీన అంశాలకు ఆధునికతను మేళవించిన వైవిధ్యభరిత రచయిత ఆయన. చరిత్ర లాంటి అంశాలతో పాటు సైన్స్ ఫిక్షన్‌పై కూడా సాధికారిక రచనలు వెలువరించి, పర్యావరణంపై దృష్టి సారించిన అరుదైన సృజనకారుడు ఘోష్. సాహిత్య సృజనలో అనేక ప్రయోగాలు చేసి, ఆంగ్ల సాహిత్యంలో భారతదేశానికి కీర్తి సముపార్జించిన అమితావ్ ఘోష్ జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందడం ముదావహం.

( భారతీయ ఆంగ్ల రచయితను అమితావ్ ఘోష్ 54వ జ్ఞానపీఠ పురస్కారం వరించిన సందర్భంగా)

Indian writer Amitav Ghosh who achieved English literature

Telangana Latest News

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: