కదం తొక్కిన కోహ్లి

Virat Kohli

ట్రినిడాడ్ : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (120), శ్రేయస్ అయ్యర్ (71) అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. విండీస్ బౌలర్లలో బ్రాత్‌వైట్ 3 వికెట్లు పడగొట్టాడు. చివర్లో విండీస్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో భారత్ స్కోరు 300 పరుగులకు చాలా దూరంగా నిలిచిపోయింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన విరాట్ కోహ్లి బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. అయితే ఓపెనర్ శిఖర్ ధావన్ (2) ప్రారంభంలోనే ఇంటిదారి పట్టాడు. అప్పటికీ జట్టు స్కోరు రెండు పరుగులే. కొట్రెల్ వేసిన అద్భుత బంతికి వికెట్ల ముందు దొరికి పోయాడు.
విరాట్ జోరు..
ఈ దశలో క్రీజులో వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి విండీస్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ అతనికి అండగా నిలిచాడు. ఇద్దరు విండీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. రోహిత్ సమన్వయంతో ఆడగా కోహ్లి తన మార్క్ షాట్లతో అలరించాడు. విరాట్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడడంతో విండీస్ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే అడపాదడపా బౌండరీలు కొడుతూ స్కోరు వేగంగ తగ్గకుండా చూశాడు. మరోవైపు సమన్వయంతో ఆడిన రోహిత్ రెండు ఫోర్లతో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 74 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు తర్వాత వచ్చిన రిషబ్ పంత్ అండతో కోహ్లి జోరును కొనసాగించాడు. విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. పంత్ మాత్రం భారీ షాట్ల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఆడాడు. అయితే రెండు ఫోర్లతో 20 పరుగులు చేసిన రిషబ్ పంత్‌ను బ్రాత్‌వైట్ వెనక్కి పంపాడు. దీంతో భారత్ 101 పరుగుల వద్ద మూడో వికెట్‌ను చేజార్చుకుంది.
శ్రేయస్ దూకుడు..
తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి విరాట్ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచాడు. శ్రేయస్ ప్రారంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. విండీస్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ ముందుకు సాగాడు. కోహ్లి కూడా తన మార్క్ షాట్లతో విజృంభించాడు. ఇటు అయ్యర్, అటు కోహ్లి జోరును పెంచడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. ఇదే సమయంలో ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ విరాట్ కోహ్లి 125 బంతుల్లోనే 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 120 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన శ్రేయస్ అయ్యర్ 68 బంతుల్లోనే 71 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్స్, ఐదు ఫోర్లు ఉన్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ స్కోరు 42.3 ఓవర్లలో 233/4గా ఉన్నప్పుడూ వర్షం మొదలైంది. దీంతో ఆటను తాత్కాలికంగా నిలిపి వేశారు. తర్వాత మళ్లీ ఆట ప్రారంభమైంది. ఇంతకుముందు ఇరు జట్ల మధ్య తొలి వన్డే కూడా వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయిన విషయం తెలిసిందే.

india vs west indies 2nd odi 2019 live HighLights

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కదం తొక్కిన కోహ్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.