చక్కెర ఎగుమతిపై బ్రిటన్, ఇయులతో భారత్ చర్చలు

Exports

 

న్యూఢిల్లీ: చక్కెర ఎగుమతుల పరిమాణంపై బ్రిటన్, యురోపియన్ యూనియన్(ఇయు)తో భారత్ చర్చలు జరుపుతోంది. బ్రెగ్జిట్ నేపథ్యంలో రాయితీ రేట్ల వద్ద ఎంత మొత్తంలో ఎగుమతి చేయాలనే అంశంపై చర్చిస్తున్నారు. ప్రస్తుతం సిఎక్స్‌ఎల్ కోటా కింద రాయితీ పన్ను రేటు వద్ద 10 వేల టన్నుల చక్కెరను ఎగుమతి చేసేందుకు ఇయు భారత్‌కు పరిమితి విధించింది. అయితే ఇయు నుంచి బ్రిటన్ వైదొలిగిన తర్వాత ఎగుమతి పరిమాణంపై మరోసారి చర్చించాల్సిన అవసరం ఏర్పడిందని అధికార వర్గాలు తెలిపాయి.

త్వరలో ఎగుమతి ప్రోత్సాహకాలు
అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నేపథ్యంలో దేశం నుంచి ఎగుమతులు మందకొడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎగుమతులు పెంచుకునే దిశగా ప్రభుత్వం అతి త్వరలోనే పలు ప్రోత్సాహకాలను ప్రకటించనుంది. ప్రోత్సాహక చర్యలపై కేంద్ర ఆర్థిక శాఖ, వాణిజ్య శాఖల అధికారులు ఇప్పటికే పలు సార్లు సమావేశమయ్యారు. సెజ్(స్పెషల్ ఎకనమిక్ జోన్) నుంచి పనిచేస్తున్న యూనిట్లకు పన్ను ప్రయోజనాల గడువును పొడిగించడం ప్రభుత్వం పరిశీలిస్తున్న వాటిలో ఉంది. 2020 మార్చి 31లోపు సెజ్‌లలో ఏర్పాటయ్యే కొత్త యూనిట్లకు మాత్రమే పన్ను ప్రయోజనాలు ఉంటాయని 2016-17 కేంద్ర బడ్జెట్‌లో తెలిపారు.

ఇక జెమ్స్, జ్యుయెలరీ రంగానికి కూడా ప్రభుత్వ ప్రోత్సాహక చర్యల్లో చోటు దక్కనుంది. రంగు రాళ్లు, పాలిష్డ్ వజ్రాల దిగుమతులపై సుంకాలను తగ్గించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా ఎగుమతులకు ఇస్తున్న రుణ పరిమితిని 60 శాతం నుంచి 90 శాతానికి పెంచడం కూడా ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఉంది. దీనివల్ల ఎగమతులకు తక్కువ ధరలకే రుణాలు లభిస్తాయి. ఇక దేశీయ తయారీని ప్రోత్సహించడం, అదే సమయంలో దిగుమతులను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలున్న దేశాల నుంచి వచ్చే దిగుమతుల విషయంలో కఠిన నిబంధనలను అనుసరించాలని కేంద్రం యోచిస్తోంది.

India Starts Talks With UK, EU on Sugar Exports

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చక్కెర ఎగుమతిపై బ్రిటన్, ఇయులతో భారత్ చర్చలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.