అందరిచూపు నైపుణ్యాభివృద్ధివైపు..

మరో నాలుగేళ్ల లో ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభాగల దేశంగా భారత్ అగ్రగామిలో ఉండబోతోంది. 120 కోట్ల జనాభాలో 60 కోట్ల మందికి ఉద్యోగాలు సమకూర్చవలసి వస్తుంది. ఇంతటి యువశక్తిని నిపుణులుగా తయారుచేయడం పెద్ద సవాలే. ఈ సవాలును సాధించగలిగితే అన్ని రంగాల్లో అగ్రగామిగా భారతదేశం రికార్డుకెక్కుతుంది. మన దేశానికి స్వాత్రంత్య్రం వచ్చే సమయంలో దేశ మంతా కలిపి 87 ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలుండగా వాటిలో మొత్తం 6600 సీట్లు ఉండేవి. ఇప్పుడు ఇంజనీరింగ్, సాంకేతిక శిక్షణా […]

మరో నాలుగేళ్ల లో ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభాగల దేశంగా భారత్ అగ్రగామిలో ఉండబోతోంది. 120 కోట్ల జనాభాలో 60 కోట్ల మందికి ఉద్యోగాలు సమకూర్చవలసి వస్తుంది. ఇంతటి యువశక్తిని నిపుణులుగా తయారుచేయడం పెద్ద సవాలే. ఈ సవాలును సాధించగలిగితే అన్ని రంగాల్లో అగ్రగామిగా భారతదేశం రికార్డుకెక్కుతుంది.

మన దేశానికి స్వాత్రంత్య్రం వచ్చే సమయంలో దేశ మంతా కలిపి 87 ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలుండగా వాటిలో మొత్తం 6600 సీట్లు ఉండేవి. ఇప్పుడు ఇంజనీరింగ్, సాంకేతిక శిక్షణా కళాశాలలు దాదాపు 7 వేలు వరకు ఉండగా ఈ కళాశాలల నుంచి ఏటా 28 లక్షల మంది పట్ట భద్రులై వస్తున్నారు. వీరంతా తమకు తగిన ఉద్యోగాలు చేయగలిగేలా నేర్పు సాధించడం అవసరం. అప్పుడే “నైపుణ్య భారత్‌” లక్షం రూపుదిద్దు కొంటొంది. నైపుణ్యంసాధించడం అన్నది ఉద్యోగంలో చేరగానే రాదు. ఎప్పటికప్పుడు కాలానికి తగ్గట్టు ఆధునిక పరిజ్ఞానాన్ని అలవర్చుకొనేలా పునశ్చరణ తరగతులలో శిక్షణ పొందితేనే ముందడుగు వేయగలుగుతారు. నైపుణ్యాల్లో శిక్షణ పొందడానికి అభ్యరుల్లో ఉద్యోగ అర్హత ఎంత వరకు ఉందో వివిధ అంశాల్లో పరిశీలించవలసి వస్తుంది. ఏటా కోటి మందికి పైగా ఉద్యోగం లోకి అడుగు పెడుతున్నారు. వీరి ఉపాధికి తగిన శిక్షణ పొందుతున్న వారు నాలుగు శాతానికి మించి లేరని తెలుస్తోంది. ఉద్యోగానికి కావలసిన నైపుణ్యాలు నేర్చుకుని సిద్ధంగా ఉండే విషయంలో మిగతా దేశాలతో పోలిస్తే మన దేశం అట్టడుగు స్థాయిలో ఉంది. అలాగే ప్రత్యేక నైపుణ్యాలకు కాలసిన శిక్షణ సౌకర్యాలు పరిశ్రమల అవసరాలకు తగినట్టులేవు. ఇప్పుడున్న ఉద్యోగ అవసరాలు భవిష్యత్తులో ఉండక పోవచ్చు. భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగానే శిక్షణ సమకూరుస్తుంటే కానీ యువత నిలబడలేదు. సంప్రదాయ విద్యా విధానంతోనే సరిపెట్టుకోకుండా ఆధునిక సాంకేతికను పొందుపరచాలి. నైపుణ్యంలో శిక్షణ ఇవ్వాలంటే పట్ట భద్రులైన వారిలో ఉద్యోగ అర్హత ఎంతవరకు ఉందో తెలుసుకోవడం అవసరం.

ఇందులో ఎన్నో అంశాలను పరిశీలించక తప్పదు. కంప్యూటర్ నైపుణ్యం, గణిత పరిజ్ఞానం, సహేతుక ఆలోచనా ధోరణి, కొత్త విషయాలను నేర్చుకోవడంపై ఆసక్తి తదితర అంశాలు పరిశీలించిన తరువాతనే ఆయా రాష్ట్రాల యువతకు ఏ అంశాల్లో రాణించగలరో నిర్ధారించడానికి వీలవుతుంది. ఏయే రాష్ట్రాలు ఏయే అంశాల్లో వెనుకబడినాయో స్పష్టమైతే ఆయా అంశాల్లో విద్యార్థుల నైపుణ్యం పెంచడానికి విశ్వ విద్యాలయాలు, పాలక వర్గాలు చొరవ తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ మేరకు కృషి ఉంటేనే ఎవరైనా రాణిస్తారు. ఇరవై ఏళ్ల క్రితం “ సాఫ్ట్‌వేర్‌” పేరు చెబితే చాలు భయపడే వారు. ప్రపంచ దేశాలన్నీ దీని గురించి తర్జన భర్జన పడేవి. ఆ సమయంలో హైదరాబాద్ యువతే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్‌లో నైపుణ్యం చూపించగలిగింది. ఈ మేరకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగారు. ఒక్క హైదరాబాద్ నుంచే అత్యధిక సంఖ్యలో యువతీ యువకులు విదేశాల్లో ఉద్యోగాలను ఎక్కువగా పొందగలిగారు. దీన్ని ఆసరా చేసుకుని సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ వ్యాపారాన్ని పెంపొందించడానికి, వినియోగదార్లను ఆకట్టు కోవడానికి విశేషంగా కృషి చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతున్నప్పటికీ సంప్రదాయ విద్యావిధానాల్లో మాత్రం అంత వేగంగా మార్పులు రావడం లేదు. కాలానికి తగ్గట్టు కొత్త కోర్సులను ప్రవేశపెట్టినప్పటికీ సంప్రదాయ విద్యా విధానం అలాగే కొనసాగుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరుగుతున్న అభివృద్ధితో సమానంగా పిల్లలకు పాఠ్యాంశాలను బోధించడంలో మార్పులు రావాలి. అలా లేనందునే ఉద్యోగ ఉపాధి రంగాల్లోని అవసరానికి తగ్గట్టు విద్యా వంతులైన యువతలో సామర్ధం కనబడడం లేదు. ఈ సమస్యను అధిగమించాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం. ఈ కారణంగానే అందరి దృష్టి నైపుణ్యాభివృద్ధి వైపు మళ్లింది. ఇదే పరిస్థితి ప్రపంచ దేశాలన్నింటిలో కనిపిస్తోంది.
నైపుణ్య యువతరం నేటి అవసరం
నాణ్యమైన విద్య, నైపుణ్యాలు ఉంటేనే భారత్ లోని యువశక్తికి చక్కని భవిష్యత్తు లభిస్తుంది. ఇతర దేశాల్లో 70 నుంచి 96 శాతం వరకు వృత్తి నైపుణ్యం కలిగిన యువత ఉండగా మనదేశంలో కేవలం 3శాతం మాత్రమే ఉండడం శోచనీయం. ఉపాధి కల్పనలో వ్యవసాయం కన్నా పారిశ్రామిక, సేవా రంగాల్లోనే ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. ఏటా ఉపాధి వేట బాటలో కోటిన్నర మంది వరకు ఉంటున్నారు. అయితే వారు తమకు తగిన ఉపాధి లభించాలంటే విద్యకు తగిన నైపుణ్యాన్ని పెంపొందించుకోక తప్పదు. 2022 నాటికి సుమారు 70 కోట్లను శిక్షితులను సమకూర్చుకోక తప్పదు. రవాణా, నిర్మాణం ఆటో మొబైల్ తదితర కీలక రంగాల్లో ను శిక్షితులై నైపుణ్యాన్ని సంపాదించుకున్న శ్రామికులు కావలసి వస్తుంది. డిగ్రీలు పుచ్చుకుని కొందరు, డిగ్రీలు పూర్తి చేయకుండానే కొందరు, డిగ్రీ వరకు రాకుండా అర్థంతరంగా చదువులు ఆపేసిన వారు మరి కొందరు ఈ విధంగా మొత్తం దేశ వ్యాప్తంగా కోటి ముప్పయి లక్షల మంది ఉపాధికోసం రోడ్డున పడుతున్నారు. వీరంతా కాల మార్పులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణ పొందితేనే పోటీ ప్రపంచంలో నెగ్గుకు రాగలుగుతారు. ఇందులో విఫలమైతే నిరాశ నిస్పృహలతో చిన్నా చితకా కూలి పనులు చేస్తూ చాలీచాలని బతుకులు గడపవలసి వస్తోంది.
చైనా, జపాన్, అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలతో పోల్చి చూస్తే భారతదేశంలోని మొత్తం జనాభాలో పాతికేళ్ల లోపు వారే దాదాపు 54 శాతం మంది వరకు ఉన్నారు. దీన్ని బట్టి ప్రపంచం మొత్తం మీద యువ శక్తిలో మన దేశమే అగ్రస్థానంలో ఉంది. ఈ యువశక్తిని సద్వినియోగం చేసుకునే కృషి ఏనాడో ప్రారంభం అయితే ఉద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉండదు. ఆరేళ్ల క్రితం యుపిఎ హయాంలో జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్ధ ఏర్పాటయింది. కానీ ఏం లాభం? కార్యాచరణ సాగలేదు. దీని ఫలితంగా ఏటా బిటెక్ పట్టాలు పొందుతున్న 15 లక్షల మందిలో కేవలం 2 లక్షల మందికే సరైన ఉద్యోగాలు లభిస్తున్నాయి. పదవ తరగతి లోపు చదివే వారికి సరిపోయే హమాలీ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పట్టభద్రులే కాదు. ఇంజనీర్లే క్యూలో నిలుచోవలసి వస్తోంది. చదువులకు తగిన ఉద్యోగాలు దొరకడం లేదని వీరు ఆవేదన పడుతుండగా, ఉద్యోగ నియామకాలకు అన్ని విధాలా అర్హులయిన అభ్యర్ధులు లభించక 58 శాతం యాజమాన్య సంస్థలు సతమత మవుతున్నాయి. నైపుణ్యం కలిగిన యువ కార్మికులను చక్కగా తీర్చిదిద్దడారికే మోదీ ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. భారత యువత నైపుణ్యాలను అభివృద్ధి పరుచుకోవడంలో మందంజ వేస్తే 2035 నాటికి స్థూల దేశీయోత్పత్తిలో 3 శాతం పెంపుదల తప్పకుండా సాధ్యమవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.
భావి ఉద్యోగాల కృత్రిమ మేధ
కృత్రిమ మేధ (ఎఐ), యాంత్రిక వ్యవస్థలో నైపుణ్యం (మెషిన్ వెర్నింగ్), ఈ రోజు ఉద్యోగ రంగంలో ప్రధాన భూమిక వహిస్తున్నాయి. బిజినెస్ స్కూళ్లు ఎందుకు ఈ నైపుణ్యాలను విద్యార్ధులకు నేర్పిస్తున్నాయి? అని ప్రశ్నించుకుంటే చాలా అంశాలు తెలుసుకోవలసి ఉంటుంది. యాంత్రిక వ్యవస్థకు సరిహద్దు కృత్రిమ మేధస్సు. ఇందులో యంత్రాలే “ స్మార్టు” పద్ధతిలో పనులు చేస్తుంటాయి. మెషిన్ లెర్నింగ్‌లో అటువంటి స్మార్టు పోకడలు ఎన్నో సూచిస్తుంటాయి. ఇవన్నీ కంప్యూటర్ గణాంకాల్లో, సంఖ్యల్లో ఉంటాయి. ఈ రెండు కీలక రంగాలకు సంబంధించి ఉదాహరణకు అమెరికాలో ఉత్తమ స్థాయి ఉద్యోగులకు 10 వేల అవకాశాలు ఉన్నట్టు అంచనా. ఇంకా అదనంగా ఆ దేశం 2024 నాటికి 2,50,000 ఓపెన్ డేటా సైన్స్ ఉద్యోగాలు అవసరమని అంచనా వేస్తోంది. ఇంకా ఐరోపా, కెనడా, చైనా దేశాల్లో కృత్రిమ మేధకు సంబంధించిన ఉద్యోగాలకు అత్యంత డిమాండ్ ఉండడమే కాదు మధ్యంతర వేతనం కన్నా ఎక్కువ వేతనం ఇచ్చే కొన్ని అవకాశాలు కల్పిస్తున్నాయి. భారతదేశం కూడా ఇతర దేశాలకు దూరం లేదు. ఆటోమేషన్, ఐటి సంబంధ పరిశ్రమలకు ఈ ఏడాది 60 శాతం అవకాశాలు పెరుగుతాయని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. ఐటి పరిశ్రమలకు అదనంగా 50 శాతం కన్నా ఎక్కువ డిజిటల్ నైపుణ్యంలో అవకాశాలు ఉన్నాయి.
ఇవన్నీ కలిపితే కొత్తగా 2లక్షల ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. భావి కృత్రిమ మేధో ఉద్యోగులను విద్యాసంస్థలు తయారు చేయవలసిన బాధ్యత ఉంది. భారతదేశంలో టాప్ ర్యాంకులో ఉన్న 20 బిజినెస్ స్కూళ్లు ఇప్పుడు బిజినెస్ అనాలిటిక్స్‌లోనూ వాటిలో ప్రత్యేక కోర్సులను నిర్వహిస్తున్నాయి.

Related Stories: