సిగ్గు, సిగ్గు

Sampadakiyam     ముక్కు పచ్చలారని పసి బాలికలపై అత్యాచార ఘటనల పట్ల నిర్దాక్షిణ్యంగా, కఠినాతికఠినంగా వ్యవహరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌కు స్పందించిన సుప్రీంకోర్టు గత జనవరి 1 నుంచి దేశంలో సంభవించిన అటువంటి వాటిపై నివేదిక సమర్పించాలని కోరడం హర్షించవలసిన పరిణామం. జాతి సిగ్గుతో తల వంచుకోవలసిన ఈ అమానుషాలు ఇటీవల తరచూ సంభవిస్తున్నాయి. పన్నెండేళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే వారికి ఉరి శిక్షను నిర్దేశిస్తున్న పకడ్బందీ పోక్సో చట్టం అవతరించిన తర్వాత కూడా ఈ దుర్మార్గాలు పెరిగి పేట్రేగుతుండడం అత్యంత ఆందోళనకరం. శారీరక మానసిక ఎదుగుదల బొత్తిగా ఉండని అమాయక పసి పాపలనే జ్ఞానం, విచక్షణ కొరవడి పశువుల కంటే హీనమైన, కళ్లు మూసుకుపోయే కాముకత్వంతో సాగిపోతున్న ఈ దారుణాలను ఆపడం చట్టాల వల్ల దుస్సాధ్యమనే అభిప్రాయం కలగడం సహజం.

ఈ పైశాచిక కాండను తుద ముట్టించడానికి ఇంకేమి చేయాలనే దానిపై సుప్రీంకోర్టు ఏమి చెబుతుందో చూడాలి. పసి బాలికలపై హింస, అత్యాచార ఘటనలు గత జనవరి 1 నుంచి ఎన్ని జరిగాయి, వాటిపై దర్యాప్తులు ఏయే దశల్లో ఉన్నాయి, నిందితులపై ప్రాథమిక అభియోగ పత్రాల (ఎఫ్‌ఐఆర్) నమోదుకు ఎంత సమయం పట్టింది, ఇంకా ఎన్ని కేసులు అపరిష్కృతంగా ఉన్నాయనే వివరాలను తెలియజెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆదేశించారు. జము కశ్మీర్‌లోని కథువాలో గత ఏడాది జనవరిలో 8 ఏళ్ల ముస్లిం సంచార జాతి బాలికపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన కేసులో నిందితులకు ఏడాదిన్నర వ్యవధిలో శిక్షలు పడడం ఆనందం కలిగించింది. ఇలా ఎన్ని కేసుల్లో సహేతుక వ్యవధిలో న్యాయం జరుగుతున్నది అనే ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం లభించదు.

బాలలపై అత్యాచారాల కేసులు లక్ష వరకు అపరిష్కృతంగా ఉన్నాయని నోబుల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి చెప్పిన చేదు వాస్తవం అత్యంత బాధాకరమైనది. ఈ అంశాన్ని జాతీయ అతవసర విషయంగా పరిగణించాలని ఆయన సూచించారు. బాలికలపై అత్యాచారం జరిగినప్పుడల్లా భారతీయ ఆత్మ అత్యాచారానికి, హత్యకు గురవుతున్నదని ఆయన పలికిన పలుకులు అక్షర సత్యాలు. ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో బాలికపై అత్యాచారం ఘటన నమోదయితే ఆ కేసులో కోర్టుల్లో న్యాయం జరగడానికి 99 సంవత్సరాలు పడుతుందని అదే గుజరాత్‌లోనైతే 55 ఏళ్లు పడుతుందని సత్యార్థి వెలిబుచ్చిన అభిప్రాయం దేశంలో అత్యంత ఘాతుక నేరాల విషయంలో కూడా న్యాయం ఎంత నత్త నడకగా సాగుతున్నదో వెల్లడిస్తున్నది.

15 ఏళ్ల వయసులో అత్యాచారానికి గురైన బాలిక 70 ఏళ్లకు చేరుకొని మనుమలు, మునిమనుమలు కలిగిన తర్వాత ఆ కేసు విచారణకు కోర్టులో హాజరు కావలసి రావడం ఎంత దారుణమో ఆలోచించండని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల దృష్టికి వెళ్లి కేసులు నమోదవుతున్న ఘటనలు కొన్నేనని అసలు వెలుగులోకి రాకుండా పోతున్నవెన్నో ఉన్నాయని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. బాలలపై అత్యాచార ఘటనల విషయంలో ఉత్తరప్రదేశ్ అగ్రభాగాన ఉండడం అక్కడి గల సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అర్థంపడుతున్నది. ఆ తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. 2016 నాటికి 90 శాతం బాలలపై అత్యాచారాల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న చేదు సత్యాన్ని గమనిస్తే కఠినమైన శిక్షలతో కూడిన చట్టాలు తెచ్చినంత మాత్రాన ఈ దురాగతం ఆగదని స్పష్టపడుతుంది. వందలాది ప్రత్యేక న్యాయ స్థానాలను దేశమంతటా నెలకొల్పి సత్వర విచారణ జరిగేలా చూస్తేగాని ఈ కేసుల్లో వెంటవెంటనే శిక్షలు పడే అవకాశాలు మెరుగుపడవు.

60, 70 ఏళ్ల వృద్ధులు కూడా ఒంటరి బాలికల మీద అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కేవలం నేర మనస్తత్వం వల్లనే జరుగుతున్నదా, ఇంకేమైనా సామాజిక కారణాలున్నాయా అనే విషయాన్ని లోతుగా పరిశీలించవలసి ఉంది. సరైన నైతిక విద్యా బోధన లోపం కూడా ఒక కారణమేమో! అలాగే బాలికల బాల్యం అత్యంత అరక్షిత వాతావరణంలో కొనసాగుతుండడం కూడా ఇందుకు దారి తీస్తున్నదని బోధపడుతున్నది. తల్లిదండ్రులు పని పాట్లలో మునిగిపోడం, రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల్లోని పిల్లలకు తగిన రక్షణ కరువు కావడం వంటి కారణాలు ఇందుకు దోహదపడుతుండవచ్చు. సామాజిక శాస్త్రజ్ఞుల చేత సరైన శోధన జరిపించి ఆయా పరిసరాల్లోని బాలికలకు అవసరమైన భద్రతను కల్పించవలసి ఉంది. జాతి పరువును మట్టి కలుపుతున్న ఈ దుర్మార్గానికి, చెప్పనలవికాని అమానుషానికి ఏ విధంగానైనా శాశ్వతంగా తెర దించవలసి ఉంది.

India approves death penalty for rape of girls under 12

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సిగ్గు, సిగ్గు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.