సిరీస్‌పై టీమిండియా కన్ను

సమరోత్సాహంతో భారత్, సౌతాఫ్రికాకు పరీక్ష

నేటి నుంచి పుణెలో రెండో టెస్టు
పుణె: తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా దక్షిణాఫ్రికాతో గురువారం ప్రారంభమయ్యే రెండో టెస్టుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి మరో టెస్టు మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. రోహిత్ శర్మ భీకర ఫామ్‌లో ఉండడం భారత్‌కు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఇక, మయాంక్ అగర్వాల్ కూడా విశాఖలో డబుల్ సెంచరీతో కదంతొక్కిన విషయం తెలిసిందే. మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా ఫామ్‌లోకి రావడం కూడా భారత్‌కు శుభపరిణామమే. ఇక, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమిలతో భారత బౌలింగ్ కూడా బలంగా ఉంది. తొలి టెస్టులో అశ్విన్, జడేజా, షమిలు అసాధారణ రీతిలో రాణించారు. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. మరోవైపు తొలి టెస్టులో ఓటమి పాలైన సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ సవాలుగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిందే. ఇందులో ఓడితే మాత్రం సిరీస్ కోల్పోక తప్పదు. భారత్‌తో పోల్చితే సఫారీ జట్టు కాస్త బలహీనంగానే కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో రాణించిన డికాక్, డీన్ ఎల్గర్‌లపై ఈసారి కూడా భారీ ఆశలు పెట్టుకుంది. వీరిద్దరితో పాటు మార్‌క్రామ్, కెప్టెన్ డుప్లెసిస్, బవుమా తదితరులు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బౌలర్లు కూడా మెరుగ్గా రాణించక తప్పదు. ఇక, పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌కు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ అభిమాన ఆటగాళ్ల ఆటతో ప్రత్యక్షంగా చూడాలనే లక్షంతో వారున్నారు. నిర్వాహకులు కూడా మ్యాచ్‌కు మంచి స్పందన లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
జోరు సాగాలి

కిందటి మ్యాచ్‌లో అసాధారణ రీతిలో చెలరేగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్‌లు ఈసారి కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలతో చెలరేగాడు. ఇక, మయాంక్ కూడా మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ కొట్టి ప్రకంపనలు సృష్టించాడు. ఈసారి కూడా జట్టు ఓపెనర్లపై భారీ ఆశలు పెట్టుకుంది. ఇద్దరు భీకర ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశగా చెప్పాలి. రోహిత్ ఈ మ్యాచ్‌లో కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా దిగిన మొదటి మ్యాచ్‌లోనే రోహిత్ సత్తా చాటాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కూడా సెంచరీలు కొట్టి తనకు టెస్టుల్లో కూడా ఎదురులేదని నిరూపించాడు. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగేందుకు తహతహలాడుతున్నాడు. మయాంక్ కూడా ఇదే లక్షంతో కనిపిస్తున్నాడు. ఓపెనర్లు తమవంతు పాత్ర పోషిస్తే ఈ మ్యాచ్‌లో కూడా భారత్‌కు భారీ స్కోరు నల్లేరుపై నడకే. ఇందులో రాణించడం ద్వారా తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలనే ఉద్దేశంతో రోహిత్, మయాంక్‌లు ఉన్నారు. వీరిద్దరూ చెలరేగితే ఈసారి కూడా సౌతాఫ్రికా బౌలర్లకు కష్టాలు తప్పక పోవచ్చు.
కోహ్లి ఈసారైనా
తొలి టెస్టులో భారీ స్కోర్లు సాధించడంలో విఫలమైన కెప్టెన్ విరాట్ కోహ్లి ఈసారి మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచాలనే లక్షంతో ఉన్నాడు. ఇటీవల కాలంలో ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారించడం కోహ్లి అలవాటుగా మార్చుకున్నాడు. ట్వంటీ20 సిరీస్‌లో నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈసారి కూడా భారీ స్కోరుపై కన్నేశాడు. కోహ్లి తన మార్క్ ఆటతో చెలరేగితే సఫారీ బౌలర్ల కష్టాలు మరింత పెరగడం తథ్యం. ఒకసారి గాడిలో పడితే కోహ్లిని ఆపడం ఎంత పెద్ద బౌలర్‌కైనా చాలా కష్లం. ఈ విషయం ఇప్పటికే పలు సిరీస్‌లలో నిరూపితమైంది. సఫారీలపై రాణించడం ద్వారా టెస్టుల్లో మళ్లీ టాప్ ర్యాంక్‌కు చేరువ కావాలని కోహ్లి భావిస్తున్నాడు.
పుజారాకు కీలకం
మరోవైపు కిందటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఔటైనా రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న స్టార్ ఆటగాడు చటేశ్వర్ పుజారాకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. కొంతకాలంగా పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న పుజారా విశాఖ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడాడు. తన సహాజ శైలీకి భిన్నంగా వరుస ఫోర్లతో హోరెత్తించాడు. ఈసారి కూడా మెరుగైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలువాలని భావిస్తున్నాడు. పుజారా తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే సౌతాఫ్రికాకు కష్టాలు తప్పక పోవచ్చు. ఇక, మరో సీనియర్ ఆటగాడు అజింక్య రహానెకు కూడా ఈ మ్యాచ్ పరీక్షగా మారింది. ఇందులో రాణించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలని రహానె భావిస్తున్నాడు. ఇక, తెలుగుతేజం హనుమ విహారి కూడా భారీ స్కోరుపై కన్నేశాడు. సొంత గడ్డ విశాఖలో జరిగిన మ్యాచ్‌లో విహారి పెద్దగా రాణించలేక పోయాడు. కానీ, పుణెలో మెరుపులు మెరిపించాలనే పట్టుదలతో ఉన్నాడు. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, ఆల్‌రౌండరలు అశ్విన్, జడేజాలతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. ఇషాంత్, షమిలు కూడా మెరుగ్గా బ్యాటింగ్ చేయగలిగిన వారే. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, బౌలింగ్‌లో కూడా టీమిండియాకు ఎదురులేదనే చెప్పాలి. అశ్విన్ గాడిలో పడడం జట్టుకు అతి పెద్ద ఊరట. షమి కూడా తొలి టెస్టులో అద్భుత బౌలింగ్‌ను కనబరిచాడు. జడేజా కూడా కీలక వికెట్లతో జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
సవాలు వంటిదే
ఇక, సౌతాఫ్రికా జట్టుకు ఈ మ్యాచ్ సవాలుగా తయారైంది. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఇందులో ఓడితే మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను కోల్పోక తప్పదు. తొలి టెస్టులో కాస్త బాగానే ఆడినా విజయం మాత్రం సాధించలేక పోయింది. పుణెలో పొరపాట్లకు తావులేకుండా ఆడాలనే పట్టుదలతో ఉంది. కెప్టెన్ డుప్లెసిస్ ఫామ్ కోల్పోవడం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఈసారైనా అతను తన బ్యాట్‌కు పని చెప్పక తప్పదు. ఇక, కిందటి మ్యాచ్‌లో శతకాలతో మెరిసిన ఎల్గర్, డికాక్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఈసారి కూడా వీరిద్దరూ భారీ స్కోర్లపై కన్నేశారు. మార్‌క్రామ్ కూడా తనవంతు పాత్ర పోషించక తప్పదు. బవుమా, బ్రూన్ తదితరులతో సౌతాఫ్రికా బ్యాటింగ్ బలంగానే ఉంది. అయితే అనుభవలేమి వీరికి ప్రతికూలంగా మారింది. అయితే కాస్త సమన్వయంతో ఆడితే భారత్‌ను ఓడించడం సఫారీలకు అసాధ్యమేమి కాదు. ఎటువంటి జట్టునైనా ఓడించే సత్తా వీరికుంది. దీంతో భారత జట్టుకు గట్టి పోటీ ఎదురైనా ఆశ్చర్యం లేదు.

జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, అశ్విన్, జడేజా, ఇషాంత్, షమి.
దక్షిణాఫ్రికా: డుప్లెసిస్ (కెప్టెన్), ఐడెన్ మార్‌క్రామ్, డీన్ ఎల్గర్, బ్రూన్, బవుమా, డికాక్, జుబేర్ హంజా, ఫిలాండర్, కేశవ్ మహారాజ్, రబడా, ఎంగిడి, డేన్ పీడ్‌ట్, క్లాసెన్, నోర్ట్‌జే, ముత్తుస్వామి.

IND vs SA 2nd Test start on Thursday

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సిరీస్‌పై టీమిండియా కన్ను appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.