టాస్క్‌ఫోర్స్ పేరు చెబితే అక్రమార్కులకు దడపుట్టాలి…

Illegal Activities

 

కరీంనగర్ : అక్రమ కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతూ కరీంనగర్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ వింటేనే అక్రమార్కులకు దడపుట్టాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసనర్‌రెడ్డి టాస్క్‌ఫోర్స్ విభాగం పోలీసులకు సూచించారు. వారికి దడపుట్టించేలా వ్యవహారించాలని ఆదేశించారు. కమీషనరేట్ వ్యాప్తంగా అక్రమ కార్యకలాపాలను పూర్తిగా నియంత్రించాలని చెప్పారు. శుక్రవారం నాడు టాస్క్‌ఫోర్స్ విభాగం పోలీసులతో పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి కమిషనరేట్ కేంద్రంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణా, గుట్కా, మట్కా, కల్తీ విత్తనాలు, ఆహార పదార్థాలపై రేయింబవళ్లు నిఘా ఉంచి దాడులను నిర్వహించాలన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లపై సమాచారం సేకరించాలని తెలిపారు. టాస్క్‌ఫోర్స్ విభాగం పోలీసులు మరింత నూతనోత్సాహంతో పనిచేయాలని చెప్పారు. అంకితభావంతో పనిచేయడం ద్వారా ఆశించిన ఫలితాలను సాధించవచ్చని పేర్కొన్నారు. సమర్ధవంతంగా పనిచేసే అన్నిస్థాయిలకు చెందిన పోలీసులకు రివార్డులను అందజేస్తామని ప్రకటించారు. భూఅక్రమణదారుల కదలికలు లేకుండా చేయాలని ఆదేశించారు.

టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేయనున్నామని, సమర్ధవంతంగా పనిచేసే వారికి ఆవకాశం కల్పించనున్నామని తెలిపారు. హైదరాబాద్ తరహాలో కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి (లా అండ్ ఆర్డర్) ఎస్.శ్రీనివాస్, ఎసిపి శోభన్‌కుమార్, సిఐ జనార్ధన్‌రెడ్డి, ఎస్.ఐ నరేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Illegal Activities should be Completely Controlled

Related Images:

[See image gallery at manatelangana.news]

The post టాస్క్‌ఫోర్స్ పేరు చెబితే అక్రమార్కులకు దడపుట్టాలి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.