చిక్కు ముడుల చిట్టా!

  జటిలమైన ఒక సమస్యను సృష్టించుకొని, దానిని పరిష్కరించుకోడమెలాగో తెలీక జుట్టు పీక్కుంటున్న దృశ్యం అసోం జాతీయ పౌర చిట్టా వ్యవహారంలో స్పష్టంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ నుంచి దొడ్డి దారిన భారీగా వచ్చిన వారి వల్ల తమ వనరులు, సంస్కృతి దెబ్బ తింటున్నాయనే భయం ఆవహించిన అస్సామీ యువత సారథ్యంలో సాగిన సుదీర్ఘ ఆందోళన నుంచి ఉత్పన్నమైన జాతీయ పౌర చిట్టా యోచన దారీ తెన్నూ తెలియని కీకారణ్యం మాదిరి పరిస్థితిని సృష్టించింది. ఎన్నో మలుపులు తిరిగిన […] The post చిక్కు ముడుల చిట్టా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జటిలమైన ఒక సమస్యను సృష్టించుకొని, దానిని పరిష్కరించుకోడమెలాగో తెలీక జుట్టు పీక్కుంటున్న దృశ్యం అసోం జాతీయ పౌర చిట్టా వ్యవహారంలో స్పష్టంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ నుంచి దొడ్డి దారిన భారీగా వచ్చిన వారి వల్ల తమ వనరులు, సంస్కృతి దెబ్బ తింటున్నాయనే భయం ఆవహించిన అస్సామీ యువత సారథ్యంలో సాగిన సుదీర్ఘ ఆందోళన నుంచి ఉత్పన్నమైన జాతీయ పౌర చిట్టా యోచన దారీ తెన్నూ తెలియని కీకారణ్యం మాదిరి పరిస్థితిని సృష్టించింది. ఎన్నో మలుపులు తిరిగిన తర్వాత ఊడి పడిన తుది చిట్టా 19 లక్షల మందిని అక్రమంగా నివాసముంటున్న వారుగా గుర్తించింది. కొంత కాలం క్రితం విడుదలయిన తాత్కాలిక చిట్టా గుర్తించిన 40 లక్షల మంది తుది చిట్టాలో 19 లక్షలకు తగ్గడం గమనార్హం.

1971కి ముందు నుంచి ఇక్కడే ఉన్నామని రుజువు చేసే సాధికార పత్రాలు లేక చాలా మంది నిజమైన పౌరులే ఈ చిట్టాలో చోటు లభించక లబోదిబో మంటున్నారు. ఖరారు చిట్టా విదేశీయులుగా తేల్చిన వారి సంఖ్య ఆశించినంత ఎక్కువగా లేదని, జాబితా అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో వడ్డించినట్లుగా ఉందని, వీరిని వదిలించుకోడానికి దారేదీ అని, వీరి ఫిర్యాదుల పరిష్కారానికి ఏళ్లూ పూళ్లూ పడుతుందని వగైరా అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. పాలక బిజెపి సహా ఏ ఒక్క పక్షమూ ఈ చిట్టా పట్ల సంతృప్తి ప్రకటించలేదు. పునః పరిశీలన, కొత్త చిట్టా తయారీ డిమాండ్లు ముందుకొస్తున్నాయి. అక్రమ పౌరులుగా గుర్తించిన వారందరూ బంగ్లాదేశీయులు కారని వారిలో చాలా మంది బెంగాల్ ముస్లింలున్నారని వగైరా ఫిర్యాదులూ బయల్దేరాయి.

ఈ చిట్టాలో ఎక్కువ మంది హిందువులున్నారనేది మరొక జటిలమైన సమస్య. అసోంలో నివసిస్తున్న పాతిక లక్షల మంది గూర్ఖాలలో ఒక లక్ష మంది పేర్లు పౌర చిట్టాలో లేవని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర సమర యోధులు, అమర వీరుల వారసుల పేర్లు కూడా తొలగించారని 22 రాష్ట్రాల్లోని గూర్ఖాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న భారతీయ గూర్ఖా పరిసంఘ్ వెల్లడించింది. మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ బంధువు పేరు కూడా గల్లంతయిందని సమాచారం. ఇన్ని తప్పుల తడకగా అవతరించిన ఈ చిట్టాలోని ఇంత మందిని ఎలా వదిలించుకోవాలి, వారి అభ్యర్థనను విచారించడానికి అదనంగా మరెన్ని ట్రిబ్యునల్స్‌ను నెలకొల్పాలి అనే ప్రశ్న ఉండనే ఉంది.

బంగ్లాదేశీయులుగా అనుమానించి సిద్ధం చేసిన చిట్టా చాలా మంది బంగ్లాదేశీయేతరులను అక్రమ వలసదార్లుగా గుర్తించడం అటుంచితే అసలు వీరిని వెనక్కి తీసుకోడానికి ఆ దేశం బొత్తిగా సిద్ధంగా లేదని బోధపడుతున్నది. వ్యక్తిగత అభ్యర్థనలను పరిశీలించి నిర్ణయం తీసుకోడానికి ప్రస్తుతమున్న వంద ఫారినర్స్ ట్రిబ్యునల్స్ ఎందుకూ చాలవంటున్నారు. రోజుకు ఒక్క కేసును పరిష్కరించగలిగినా 19 లక్షల మంది ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోడానికి ఆరేళ్లకు పైగా పడుతుందని అందుకోసం 1000 ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేయవలసి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఎంతో కాలంగా అసోంలో స్థిరపడి పని పాట్లు చేసుకుంటూ అక్కడ సంపద సృష్టిలో భాగస్వాములైన ఇంత మందిని ఏరి నిర్బంధ శిబిరాల్లో ఉంచి పోషించడమూ చిన్న విషయం కాదు.

వారిని ఇక్కడే కొనసాగించి వారి పౌరసత్వ హక్కులను ఊడబెరికితే వారికి అది నిత్య మానసిక నరకమవుతుంది. కొత్త వెలి వాడలు వెలుస్తాయి. వృద్ధి రేటు దారుణ పతనం, భారీ ఎత్తున ఉద్యోగాలు కోల్పోడం వంటి అనేక జటిలమైన సమస్యలు దేశం ఎదుర్కొంటున్న తరుణంలో ఇటువంటి వ్యవహారాలను తలకెత్తుకొని మనం సాధించేదేమిటి అన్న ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం లభించదు. పని కట్టుకొని ఒక వర్గం ప్రజలను వేధించడానికే ఈ పౌరసత్వ వ్యవహారాన్ని సాగలాగుతున్నారనే అభిప్రాయం ఆ వర్గంలో మరింతగా పాతుకుపోవడం దేశ సమైక్యతకు చేటు తెస్తుంది. సరిహద్దు జిల్లాలకు చెందిన 20% మందిని, ఇతర జిల్లాలకు చెందిన 10% మందిని తిరిగి లెక్కించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టును కోరనున్నట్టు సమాచారం.

అది చేసినా చిట్టాకు సమగ్రత, సంబద్ధ్దత లభించే ఆస్కారాలు లేవు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొత్తం దేశమంతటా జాతీయ పౌరసత్వ చిట్టాను తయారు చేయిస్తామని ప్రకటించి ఉన్నారు. అసోంలో చాలా మంది నిరుపేదలు తమ పౌరసత్వ దాఖలాలను చూపించి తాము చట్టబద్ధ పౌరులమేనని నిరూపించుకోడానికి నానా ప్రయాసలు పడ్డారు. అయినప్పటికీ వారిలో చాలా మందికి తుది జాబితాలో నిరాశే ఎదురయింది. ఇప్పడు దేశ పౌరు లందరికీ ఈ కష్టాన్ని దాపురింప చేయడం ఎంత వరకు సమంజసమో, సమానవీయమో ఆలోచించాలి.

Identity of migrants through Assam National Citizens List

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చిక్కు ముడుల చిట్టా! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: