ఉదయ కాంతితో రోజంతా శక్తి!

Sun

 

రోజంతా ఉత్సాహంగా ఆనందంగా ఉండాలంటే ఉదయాన్ని అద్భుతంగా ప్రారంభించాలని చెబుతున్నారు నిపుణులు. రాత్రి ఎంత ఆలస్యంగా నిద్రపోయినా, ఉదయాన్నే లేచి పనిలో పడకపోతే కుదరదు. కానీ బుర్రలో ఉన్న ఒక గందరగోళం, తొందర ప్రశాంతతను ఇవ్వదు. అందుకే ప్రతి ఉషోదయాన్ని ప్రేమతో ఆహ్వానించండి. ఇక రోజంతా మీదే అంటున్నారు.

ఉదయ కిరణాలు: ఉదయపు కిరణ కాంతి కిటికీ లోంచి మొహం మీద పడగానే లేవగలిగితే ఎంతో అదృష్టం అనాలి. ఈ కాంతి మెదడుని ఉద్దీప్తం చేస్తుంది. మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. అందుకే నిద్రలేవగానే జోగటం మానేసి కిటికీ దగ్గరకు వెళ్లి నిలబడి సూర్యకాంతిని శరీరంపైన పడేలా ఆహ్వానించాలి. అప్పుడు శరీరంలో చైతన్యం నిండిపోతుంది. మెలకువ రాగానే వెంటనే లేవాలి. ఇంకో ఐదు నిమిషాలు పడుకుని లేద్దాం అన్న బద్ధకం వద్దు. కలతలు లేని కమ్మని నిద్ర తరువాత ఉషోదయాన్ని ఆహ్వానిస్తూ కళ్లు తెరిస్తే రోజంతా ఆ వెలుగే.

నో మెయిల్స్, నో ఫోన్: ఉదయం కళ్లు తెరచీ తెరవగానే మెయిల్, వాట్సప్ వెతకటం అస్సలు పెట్టుకోవద్దు. మనసు చురుకుదనం పుంజుకోకుండా ఇతర పనులు పెట్టుకోకూడదు. బ్రేక్‌ఫాస్ట్ తరువాతే రోజువారీ పనుల్లో పడితే బావుంటుంది. ఫోన్‌తో మొదలుపెడితే దాన్నుంచి బయటపడటం కష్టం. ఉదయపు ప్రాధాన్య క్రమాన్ని అనుసరించాలి.

స్ట్రెచింగ్: పాదాలను భూమిపైన ఆనించే ముందు శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. వెన్ను కింది భాగానికి హిప్ జాయింట్స్‌కు కదలికనిచ్చే వ్యాయామం చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్‌సైజులో శరీర భాగాలకు ఆక్సిజన్ అందుతుంది. కొద్దిదూరపు నడక, కుదరకపోతే పది నిమిషాలు బాల్కనీలో అయినా అటూ ఇటూ తిరగటం, ఈ రోజుకి కావలసిన శక్తిని సమకూర్చుకోవటం కోసమే.

బ్రేక్‌ ఫాస్ట్: రోజంతటికీ కావలసిన శక్తి బ్రేక్‌ఫాస్ట్‌లోనే శరీరానికి అందుతుంది. కొన్ని గంటల పాటు చక్కని విశ్రాంతి తీసుకున్న తర్వాత మంచి శక్తినిచ్చే ఆహారం కావాలి. ప్రొటీన్లు, పీచు, ఆరోగ్యవంతమైన ఫ్యాట్స్, కూరగాయలు, ధాన్యాలు, పండ్లు, గింజలు శరీరానికీ గుండెకీ ప్రయోజనం కలిగించేవి ఉదయపు ఆహారంలో విధిగా ఉండాలి. యోగార్ట్, బటర్ వంటివి ఆహారంలో ఉంటే చాలినంత శక్తి వస్తుంది.

నీరు ముఖ్యం: రాత్రంతా చక్కగా నిద్రపోయాక శరీరం డీహైడ్రేట్ అయి ఉంటుంది. నిద్రలేవగానే గ్లాసు నీళ్లతో మొదలుపెడితే శరీరపు అలసట పోతుంది. నిమ్మరసం, తేనె మిశ్రమం కూడా మంచిదే. చక్కని సంగీతం, పచ్చని ప్రకృతి, వ్యాయామం, మంచి భోజనం రోజంతటినీ ఉత్సాహంతో నింపుతుంది. ఏదో ఒకటి తినటం కాకుండా అన్ని కీలక పదార్థాలు ఉంటేనే అది హెల్దీ ఈటింగ్ అవుతుంది.

సంతోషాన్నిచ్చే పదప్రయోగం: పరిశోధకులు మనం వాడే భాషలో కూడా సంతోషం నిండి ఉంటుంది అంటారు. వస్తు సంబంధమైన మాటలకంటే సంబంధం బాంధవ్యాలకు చెందిన మాటలు చాలా సంతోషాన్ని ఇస్తాయి. స్వీడన్ పరిశోధకులు పదిహేను లక్షల పదాలపైన పరిశోధన చేశారు. మనకి, నేను, మన కోసం, మనది వంటి పదాల్లో సంతోషం ఉందని గుర్తించారు. అంటే ప్రతిరోజూ ఎన్ని పనుల్లో మునిగి ఉన్నా మన బంధువులను, తల్లిదండ్రులను, ప్రియమైన వాళ్లను పలకరిస్తేనే మనకు ఆనందం కలుగుతుందని తేలిందన్న మాట. మన రోజుని ఆనందంతో వెలిగించే విషయాల్లో ఆత్మీయులు కూడా ఒకటన్న విషయం మరచిపోవద్దు.

How can active for whole day?

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఉదయ కాంతితో రోజంతా శక్తి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.