మన నగలకు హాంకాంగ్ సెగ

  భారత ఆభరణాలు, రంగురాళ్ళకు హాంకాంగ్ అతిపెద్ద మార్కెట్. ఇప్పుడు ఆ మార్కెట్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి కనబడుతుంది. హాంకాంగ్ లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. హాంకాంగ్ ప్రభుత్వం ఆందోళనలు అదుపు చేయడంలో విఫలమవుతోంది. హాంకాంగ్‌లో పరిస్థితి భారతదేశంలో ఆభరణాల పరిశ్రమకు ఆందోళనకరంగా మారింది. భారతదేశం నుంచి ఆభరణాలు, జెమ్స్ ఎగుమతులు హాంకాంగ్ కు చాలా ఎక్కువగా జరుగుతాయి. ఆభరణాలకు సంబంధించి హాంకాంగ్ ఇండియాకు అతిపెద్ద మార్కెట్. గత సంవత్సరంతో పోల్చితే ఇప్పుడు ఎగుమతులు 6.6 శాతం తగ్గిపోయాయి. […] The post మన నగలకు హాంకాంగ్ సెగ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

భారత ఆభరణాలు, రంగురాళ్ళకు హాంకాంగ్ అతిపెద్ద మార్కెట్. ఇప్పుడు ఆ మార్కెట్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితి కనబడుతుంది. హాంకాంగ్ లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. హాంకాంగ్ ప్రభుత్వం ఆందోళనలు అదుపు చేయడంలో విఫలమవుతోంది. హాంకాంగ్‌లో పరిస్థితి భారతదేశంలో ఆభరణాల పరిశ్రమకు ఆందోళనకరంగా మారింది. భారతదేశం నుంచి ఆభరణాలు, జెమ్స్ ఎగుమతులు హాంకాంగ్ కు చాలా ఎక్కువగా జరుగుతాయి. ఆభరణాలకు సంబంధించి హాంకాంగ్ ఇండియాకు అతిపెద్ద మార్కెట్. గత సంవత్సరంతో పోల్చితే ఇప్పుడు ఎగుమతులు 6.6 శాతం తగ్గిపోయాయి. ఈ ఆర్ధిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో 3.2 బిలియన్ డాలర్లు వాణిజ్యం పడిపోయింది. జెమ్స్ అండ్ జువెల్లరీ ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఈ వివరాలు తెలియజేసింది. హాంకాంగ్‌లో ఆందోళనలు, నిరసనలు ఇంకా కొనసాగితే ఈ వ్యాపారం మరింత దెబ్బ తినవచ్చు. హాంకాంగ్‌లో ఆందోళనలు తగ్గు ముఖం పట్టే సూచనలు కూడా కనబడడం లేదు.

భారతదేశం నుంచి ఎగుమతయ్యే ఆభరణాలు, జెమ్స్‌లలో దాదాపు ముప్పయి శాతం హాంకాంగ్‌కే వెళ్ళేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. హాంకాంగ్‌కు ఎగుమతులు 17 శాతానికి తగ్గిపోయాయి. హాంకాంగ్ ఆందోళనలు ఒకవైపు దెబ్బ తీస్తుంటే, ఇంతకు ముందు అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం కూడా వ్యాపారాన్ని దెబ్బ తీసింది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం కారణంగా తలెత్తిన పరిస్థితుల వల్ల డిమాండ్ పడిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం కూడా కొనసాగుతోంది. అందువల్ల డిమాండ్ కూడా తగ్గిపోతోంది. వజ్రాల అమ్మకాలు పడిపోయాయి.

డిబీర్స్ వంటి సంస్థలు వినిమయదారులకు అనేక మినహాయింపులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. హాంకాంగ్‌లో ఉద్రిక్త వాతావరణం, నిరసనల వల్ల మార్కెట్ మరింత ధ్వంసమయ్యేలా కనబడుతోంది. కొనుగోలుదారులు తగ్గిపోయారు. వ్యాపారం మందగించింది. ఇది ఇలాగే కొనసాగే సూచనలు కనబడుతున్నాయి. హాంకాంగ్ చాలా కీలకమైన నగరం. చైనాకు వస్తు రవాణా చేయాలంటే హాంకాంగ్ నుంచే జరుగుతుంది. ముడిసరుకులైనా, తయారు చేయబడిన వస్తువులైనా ఏవైనా సరే హంకాంగ్ నుంచే వెళతాయి. ఎగుమతుల ఈ చైన్ ఇప్పుడు దెబ్బతింది. హాంకాంగ్‌లో ఉద్రిక్త పరిస్థితి ఉంటే ఎగుమతులకు అవకాశం లేకుండా పోతుంది.

హాంకాంగ్‌లో ప్రతిఘటనలు, నిరసనలు దాదాపు మూడు నెలల క్రితం ప్రారంభమయ్యాయి. హాంకాంగ్‌లో నేరస్థులను, చైనా ప్రధాన భూభాగానికి పంపేలా, అక్కడ విచారణలు జరిగేలా వీలు కల్పిస్తూ చట్టం చేయడానికి ప్రయత్నించడంతో ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. హాంకాంగ్ చైనాలో అంతర్భాగమే అయినా, దేశంలో ప్రత్యేక దేశం హోదా కలిగి ఉంది. అందువల్ల ఈ బిల్లును హాంకాంగ్ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు ఈ చట్టం సస్పెండ్ అయ్యింది. కాని ఆందోళనలు తగ్గలేదు. ఈ చట్టంపై ఆగ్రహించిన ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసరడం వంటి హింసాత్మక చర్యలకు కూడా పాల్పడ్డారు. పోలీసులు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు, వాటర్ కేనన్లు ప్రయోగించి చెల్లాచెదురు చేశారు. ఏది ఏమైనా హాంకాంగ్ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వ్యాపారాలు దెబ్బతిన్నాయి.

ఈ ఆందోళనలు ఇలాగే కొనసాగితే హాంకాంగ్ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకునే సూచనలున్నాయి. ఇప్పటికే అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం వల్ల హాంకాంగ్ ఆర్ధిక వ్యవస్థ సగం దెబ్బతింది. చైనాపై అమెరికా తీసుకుంటున్న చర్యలు, చైనా చేపడుతున్న ప్రతిచర్యలు హాంకాంగ్ నుంచి జరిగే ఎగుమతి దిగుమతులపై ప్రభావం వేశాయి. హాంకాంగ్ ప్రపంచంలో వాణిజ్యానికి కీలక నగరాల్లో ఒకటి. ఆభరణాలు విలువైన రాళ్ళకు సంబంధించి కూడా హాంకాంగ్ ముఖ్యమైన మార్కెట్. చైనా ప్రధాన భూభాగం నుంచి అనేక మంది టూరిస్టులు హాంకాంగ్ వస్తుంటారు. కాని ఇప్పుడు ఈ టూరిస్టుల రాక కూడా తగ్గిపోయింది. మరోవైపు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ పరిణామాలు ఆభరణాల మార్కెట్‌ను పూర్తిగా నాశనం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

హాంకాంగ్ ట్రేడ్ ఫెయిర్ చాలా ప్రసిద్ధి చెందింది. దానిలో హాజరయ్యే వారి సంఖ్య కూడా చాలా తగ్గిపోవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాంకాంగ్‌లో ఉద్రిక్తతల కారణంగా హాంకాం గ్ సందర్శించవద్దని టూరిస్టులకు సలహా సూచనలు జారీ అవుతున్నాయి. ఈ పరిణామాల వల్ల భారత ఎగుమతులు మరింత దెబ్బతినే అవకాశం ఉంది. హాంకాంగ్‌లో సెప్టెంబరు 16వ తేదీన ఆభరణాలు విలువ రాళ్ళ ప్రదర్శన జరగబోతోంది. ఇది చాలా పెద్ద ఫెయిర్‌గా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. కాని ఇప్పుడు ఈ ఫెయిర్‌కు చాలా మంది హాజరు కాకపోవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యాకు చెందిన వజ్రాల సంస్థ అల్రోసా పిజేయస్సి డైరెక్టరు మాట్లాడుతూ ఈ సారి హాంకాంగ్ ఫెయిర్ పై చాలా అనుమానాలు వ్యక్తం చేశారు.

హాంకాంగ్ ఫెయిర్ నిర్వాహకులకు పంపిన ఇ మెయిళ్ళకు కూడా వెంటనే జవాబు రావడం లేదని పలువరు అంటున్నారు. మరోవైపు హాంకాంగ్‌లో ప్రదర్శన నిర్ధారిత తేదీల్లో జరుగుతుందని, ఎలాంటి మార్పులు లేవని వెబ్ సైటులో ప్రకటించారు. ఈ ప్రదర్శనలో భారతదేశానికి సంబంధించిన ఇండియన్ పెవిలియన్‌లో దాదాపు 100 మంది ఎగ్జిబిటర్లు తమ స్టాల్స్ పెట్టాలని ఇంతకు ముందు నిర్ణయించారు. కాని ఇప్పుడు ఎంతమంది వెళతారో తెలియని స్థితి నెలకొని ఉంది. ఒకవేళ ఎవరైనా ఎగ్జిబిటర్లు అక్కడికి వెళ్ళలేకపోతే నిర్వాహకులు వారికి కొంత నష్టపరిహారం చెల్లిస్తారా అన్నది తెలియదు. ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి.

ఏది ఏమైనా హాంకాంగ్ ఆందోళనల వల్ల ఆసియన్ షేర్ మార్కెట్లు దెబ్బ తింటున్నాయి. హాంకాంగ్ ప్రపంచంలో వాణిజ్య నగరాల్లో చాలా ముఖ్యమైన నగరం. చైనాకు గేట్ వేగా ఉండడం హాంకాంగ్ ప్రాధాన్యతకు ముఖ్యకారణం. గత సంవత్సరం మొత్తం ప్రపంచంలో జరిగిన ట్రేడింగ్‌లో హాంకాంగ్ ద్వారా జరిగిన వాణిజ్యం 5.2 శాతం ఉంది. ప్రపంచంలో మూడవ ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా హాంకాంగ్ పేరు పొందింది. మొదటి రెండు స్థానాల్లో లండన్, న్యూయార్కులున్నాయి. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద విదేశీ మారక ద్రవ్య కేంద్రం హాంకాంగ్. ప్రపంచంలోని ఐదు అతిపద్ద కార్గో పోర్టుల్లో హాంకాంగ్ ఒకటి.

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలు ఏదో ఒక రూపంలో హాంకాంగ్ పై ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు హాంకాంగ్ ఆందోళనలు ఈ ఆర్ధిక వ్యవస్థలపై ప్రభావం వేస్తున్నాయి. ముఖ్యంగా చైనా ఆర్ధిక వ్యవస్థపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండవచ్చు. అయినా చైనా ప్రభుత్వం హాంకాంగ్ సమస్య పరిష్కారం విషయంలో మొండిగానే వ్యవహరిస్తోంది. హాంకాంగ్‌లోని నేరస్థులను చైనాకు అప్పగించేందుకు రూపొందించిన బిల్లు ఈ మొత్తం ఆందోళనకు మూల కారణం. ఆ బిల్లును శాశ్వతంగా తెర దించాలని హాంకాంగ్ ప్రభుత్వం నిర్ణయించినందువల్ల పరిస్థితిలో త్వరలో మార్పు రాగలదని ఆశించవచ్చు.

Hong Kong unrest is worrying India Jewelers

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మన నగలకు హాంకాంగ్ సెగ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: