బాబ్రీ తీర్పు- భద్రతా చర్యలు

Sampadakiyam అత్యంత వివాదాస్పదమైన రామ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వ్యాజ్యం పై దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు నేడు వెలువడనున్నందున అయోధ్యలో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, దేశమంతటా భద్రతను, అప్రమత్తతను పెంచడంలోని ముందు చూపును హర్షించాలి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో భారీ ఎత్తున బలగాలు దింపి ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు, హింసకు తావు లేకుండా చూడడం గతానుభవాల దృష్టా ఎంతైనా సమర్థించదగిన చర్య. 27 ఏళ్ల క్రితం 1992 డిసెంబర్ 6న జరిగిన అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత దుర్ఘటన దేశ వ్యాప్తంగా హింసకు, మత కల్లోలాలకు, దారుణ మారణకాండకు దారి తీసిన అత్యంత బాధాకరమైన వాస్తవం తెలిసిందే. ఆ నేపథ్యంలో ఇప్పుడీ కీలక ఘట్టానికి ముందు సాధ్యమైనంతగా దృఢమైన భద్రతా చర్యలు చేపట్టడం అర్థం చేసుకోదగిన చర్యే.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తాను పదవీ విరమణ చేయబోతున్న ఈ నెల 17లోగా అయోధ్య వివాదంపై తీర్పు వెలువడేలా చూస్తానని చాలా కాలం క్రితమే ప్రకటించి ఉన్నారు. అందుకు అనుగుణంగా కేసు విచారణను ఆయన పని కట్టుకొని త్వరిత పరిచారు. తన ఆదేశాలపై ఏర్పాటైన మధ్యవర్తుల బృందం కూడా వివాద పరిష్కారంలో విఫలమైన కారణంగా తగవు తీర్చే బాధ్యతను సుప్రీంకోర్టు స్వయంగా స్వీకరించింది. నేటి తీర్పును దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అయోధ్యలో, యుపిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజాగా మరి 4000 మందితో కూడిన అర్ధ సైనిక దళాలను ఉత్తరప్రదేశ్‌కు పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ సూచించింది. ఇదంతా బాగానే ఉందిగాని ఒక కీలకమైన కేసులో వెలువడనున్న దేశ మహోన్నత న్యాయస్థానం తీర్పు ఇంతగా భద్రతాపరమైన భయాలను కలిగించడమే ప్రత్యేకించి గమనించవలసిన అంశం.

మళ్లీ అశాంతికి, అలజడికి, దేశ ప్రజల మధ్య ద్వేషకావేషాలకు, అంతర్యుద్ధం స్థాయి హింసకు దారి తీయబోతుందని భావిస్తున్న తీర్పు అసలు అవసరమా? అనే ప్రశ్నకు ఇక్కడ చోటు కలుగుతుంది. తీర్పు వల్ల అసంతృప్తి చెందే వర్గం నుంచి హింసాయుత దాడులు సంభవించే ప్రమాదం ఏర్పడుతుందనే భయానికి ఆస్కారం కలుగుతున్నది. గెలిచిన వర్గం అవతలి వర్గాన్ని రెచ్చగొట్టే పనులకు పాల్పడవచ్చు. అటువంటి విపరిణామాలకు దారి తీయగల తీర్పుకి బదులు ఉభయ వర్గాలను వివాదాస్పద స్థలం నుంచి దూరంగా ఉంచడం వంటి ఇతర మార్గాలను న్యాయస్థానం సూచించవచ్చు కదా అనే ఆలోచన కూడా శాంతి కాముకుల్లో, మత సామరస్య ప్రియుల్లో కలగడం సహజం. అటువంటి తీర్పును కూడా నిరసిస్తూ హింసకు పాల్పడేవారుంటే వారి ఆట కట్టించడం బలగాలకు అసాధ్యమేమీ కాదు.

ఇటువంటి సమయంలో దేశ సెక్యులర్ వస్త్రానికి ఏమాత్రం హాని కలుగనీయని విజ్ఞతాయుతమైన ముగింపు ఈ కేసుకి లభించాలని కోరుకోవడం ఆక్షేపించదగినది కాదు. ఇటీవలి గతంలోకి వెళ్లి చూసినప్పుడు మత సామరస్యానికి, దేశంలోని భిన్న సామాజిక వర్గాల మధ్య శాంతియుత సహజీవనానికి ముప్పు తెచ్చే సున్నితమైన పరిణామాలు తరచూ ఎదురవుతున్న విషయం స్పష్టపడుతుంది. కశ్మీర్ పరిణామాలు, పాక్ భూ భాగం నుంచి వచ్చి రెచ్చిపోతున్న ఉగ్రవాదుల దాడులు వంటివి దేశంలో శాంతికి విఘాతం కలిగించేవిగా పరిణమిస్తున్న చేదు నిజాన్ని కాదనే వారుండరు. ఇప్పటికే అటువంటి అత్యంత సున్నితమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న దేశానికి అయోధ్య భూ వివాదంపై తీర్పు రూపంలో మరో ఆందోళనకరమైన ఘట్టం ఎదురు కాబోతున్నదని ఈ బలగాల మోహరింపు తీరు సూచిస్తున్నది.

ఇది ఎటువంటి ఘటనలకు దారి తీస్తుందోననే భయం కలగడం సహజాతి సహజం. ఎక్కడో సంభవించిన పరిణామానికి అన్ని ప్రాంతాల ప్రజలు గుండెలు అరచేత పెట్టుకొని బతకవలసిన దుస్థితి తలెత్తుతుంది. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం దేశంలోని ప్రధాన నగరాల్లో సంభవించిన హింసాకాండ గురించి తెలిసిన వారు మళ్లీ అటువంటి అత్యంత ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందనే భయానుమానాలకు గురి అవుతారు. అసాధారణ స్థాయిలో తీసుకుంటున్న భద్రతా చర్యలు మైనారిటీ మత వర్గానికి చెందిన ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తాయి. చిరకాలంగా పీడిస్తున్న రామ జన్మభూమి బాబ్రీ మసీదు వివాదానికి ముగింపు పలకడం అత్యంత అవసరమే. కాని ఆ ముగింపు దేశంలో మరింత హింసాకాండకు అభద్రతకు ప్రజల మధ్య శత్రుత్వం పెంచడానికి దారి తీస్తే అది అత్యంత శోచనీయమైన పరిణామం కాగలదు.

Historic Supreme Court Verdict In Ayodhya Case Tomorrow

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బాబ్రీ తీర్పు- భద్రతా చర్యలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.