దంచికొట్టిన వాన

Heavy Rain in several areas in Telangana

 

రాజధాని సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
హైదరాబాద్‌లో రెండుగంటల పాటు వాహనదారులకు నరకం
నేలకొరిగిన చెట్లు, పలు జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లు
ఉధృతంగా గాలులు, తగ్గని ఉక్కపోత, ఖమ్మం జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

హైదరాబాద్: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షం కురిసింది. నగరంలోని జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, మియాపూర్, మూసాపేట, మేడిపల్లి, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, మారేడుపల్లి, బేగంపేట, తార్నాక, ఉప్పల్, రామాంతాపూర్  ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. వర్షానికి తోడు బలమైన ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపోవడంతో పాటు కొన్నిచోట్ల చెట్లు నేలకొరిగాయి. పలు జిల్లాల్లో రోడ్లు దెబ్బతినడంతో రాకపోకలు స్తంభించాయి. రెండుగంటల పాటు భారీ వర్షం కురిసినా ఉక్కపోత మాత్రం తగ్గలేదని ప్రజలు వాపోతున్నారు.

ములుగు జిల్లాలో 87.5 మిల్లీమీటర్ల వర్షపాతం
శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లాలో 87.5 మిల్లీమీటర్ల వర్షపాతం, మంచిర్యాలలో 79.5, ఆదిలాబాద్ 52.5, హైదరాబాద్ 54, ఖమ్మం 49.5, మేడ్చల్ మల్కాజిగిరి 48.5, రంగారెడ్డి 43.3, జనగాం 43.3, వరంగల్ రూరల్ 41.5, జయశంకర్ భూపాలపల్లి 41.3, కుమురంభీం ఆసిఫాబాద్ 34.3, మహబూబాబాద్ 28.5, సంగారెడ్డి 26.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.

సెప్టెంబర్‌లో 20 శాతం అధిక వర్షపాతం
ఆగష్టు, సెప్టెంబర్ నెలలో అధిక వర్షాలు కురవనున్నట్టు ఐఎండి అంచనా వేసింది. రుతుపవనాల వల్ల సెప్టెంబర్‌లో 104 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. జూలై 30 వరకు దేశవ్యాప్తంగా 44.7 శాతం వర్షం మాత్రమే కురిసినట్టు ఐఎండి వెల్లడించింది. సమృద్ధిగా వర్షాలు కురవడం వల్లే రైతులు అధిక స్థాయిలో విత్తనాలు నాటినట్టు అధికారులు తెలిపారు. వర్షాకాలం రెండో అర్థభాగంలో కావాల్సినంత వర్షాలు కురుస్తున్నాయని ఐఎండి పేర్కొంది. సెప్టెంబర్‌లో సుమారు 20 శాతం వర్షాలు అధికంగా కురుస్తాయని అధికారులు తెలిపారు. జూలైలో ఆశించనంతగా వర్షాలు కురవకున్నా సెప్టెంబర్‌లో అధిక వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి ఒక అంచనాకు వచ్చింది.

Heavy Rain in several areas in Telangana

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post దంచికొట్టిన వాన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.