గింజల్లోనూ పోషకాలు

grains

చిరుధాన్యం, తృణధాన్యం, పప్పుధాన్యం, డ్రై నట్స్ పేర్లేవైనా అవన్నీ గింజలే… చివరకు వాడే నూనెలన్నీ గింజలనుండే తీసింది. పోషక విలువలు మెండుగా ఉండే ఈ గింజల్లో చాలా రకాలను అస్సలు పట్టించుకోరు. అయితే వాటిలో ఎన్నో ఆరోగ్యానికి ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.

గుండెకు గుమ్మడి గింజ
పూర్వకాలంలో కూరకోసం గుమ్మడికాయకోస్తే అందులోని గింజల్ని ఎండబెట్టో వేయించో తినేవారు. క్రమంగా ఆ అలవాటు పోయింది. కానీ గుమ్మడికాయతో పోలిస్తే గింజల్లో వ్యాధులను అడ్డగించే ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే పైటొ స్టెరాల్స్ శాతం అధికం. ఓమేగా, మోనో అన్‌శ్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలతోబాటు ఫాస్సరస్, మాంగనీసులూ అధికంగా లభిస్తాయి. ఇవన్నీ కీళ్లనొప్పులకు కారణమయ్యే ఇన్‌ఫ్లమేషనరీ తగ్గిస్తాయి. వీటిని వినియోగిస్తే మూత్రాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తక్కువే గర్భిణీలకు ఇందులోని జింక్ వల్ల గర్భాశయ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. కంటి ఆరోగ్యం సరేసరి. ఈ గింజలకు పొట్ట, రొమ్ము ఊపరితిత్తులు, ప్రొస్టేట్ ,పేగు క్యాన్సర్లను నివారించే శక్తి కలిగిఉంటాయి. వీటిలోని అధిక మెగ్నీషియం, పీచు కారణంగా మధుమేహం, బిపి అదుపులో ఉంటాయి. అన్నింటికన్నా వీటిలోని ప్రొటీన్లు ఈ శతాబ్దం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అయిన నిద్రలేమిని నివారిస్తాయి. ఇంకేం ఇన్ని ప్రయోజనాలున్న గుమ్మడి గింజలను సలాడ్లలో , పచ్చిగానో వేయించిగాని వినియోగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. గుండెకీ బలం.
పుచ్చతో సంతాన సాఫల్యత
పుచ్చకాయను తింటూ ఓ గింజ లోపలకు వెళితే పొట్టలో చెట్టు మొలుస్తుందేమోనంటూ భయపడిపోతారు. కానీ వీటిలో పోషకాల గురించి తెలిస్తే వాటిని ప్రత్యేకంగా కొనవలసిందే. పుచ్చగింజల్లో దొరికే ఆర్జినైన్ అనే ప్రొటీన్‌కి బిపిని, హృద్రోగాలను నియంత్రించే శక్తి ఉంది. వీటిలో లభించే నియాసిన్ నాడీ, జీర్ణ వ్యవస్థల పనితీరుకి సాయపడడంతోపాటు చర్మ ఆరోగ్యానికి రక్షణనిస్తుంది. గుండెను కాపాడే మోనో, పాలీఅన్‌శాచురేటెడ్, ఓమెగా ఫ్యాటీ ఆమ్ల్లాలన్నీ ఈ విత్తనంలో పుష్కలం. వీటిలో ఫోలేట్ గర్భిణులకు ఎంతోమంచిది. మెగ్నీషియం అలర్జీలు రాకుండా చూడడంతో బాటు వృద్ధాప్యాన్ని అడ్డుకుంటుంది. ఈ గింజల్లోని ప్రొటీన్లు కండరాలు,కణజాలాల వృద్ధికీ , చర్మ సౌందర్యానికి తోడ్పడతాయి. జింక్, మాంగనీసులు పురుషుల్లో సంతాన సాఫల్యతలను పెంచుతాయనేది పరిశోధనలో వెల్లడైంది.
నువ్వులతో రోగం మాయం ..
రకరకాల వంటల్లో నువ్వులను వాడటం తెలిసిందే. వీటిలో సెసామిన్ అనే లిగ్నన్, పొట్టలోని బాక్టీరియా కారణంగా ఎంటరోల్యాక్టొన్ అనే లిగ్నన్‌గా మారుతుంది. ఇది ఈస్ట్రోజెన్‌గా పనిచేస్తూ రొమ్ముక్యాన్సర్లూ , హృద్రోగాలు రాకుండా కాపాడుతుంది. మెనోపాజ్ దాటిన మహిళలు రోజూ కనీసం ఓ 50 గ్రా. నువ్వుల్ని ఏదో ఒక రూపంలో తినడంవల్ల కొలెస్ట్రాల్ తగ్గడంతోపాటు కీళ్లనొప్పులు మోకాళ్ల నొప్పులు తగ్గినట్లు తెలిసింది. అనేక రకాల వ్యాధులకు కారణమయ్యే ఇన్‌ఫ్లమేషన్‌నీ తగ్గిస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, బి1, విటమిన్‌ఇ, పాస్పరస్ వంటివి వీటిలో లభ్యమవుతాయి. ఇవన్నీ బిపిని తగ్గించడంతోపాటు కాలేయం దెబ్బతినకుండా రక్షిస్తాయి. అర్థెరైటీస్ , అస్తమా, మైగ్రేయిన్, తలనొప్పి, మెనోపాజ్ సమస్యల్నీ, ఆస్టియోపొరాసిస్ వంటి వ్యాధులను నివారిస్తాయి. అరకప్పు నువ్వుల్లో అర కప్పు పాలల్లోకన్నా ఎక్కువ కాల్షియం లభిస్తుంది. అందువల్ల నువ్వుల్ని ఎలా తిన్నా ఆరోగ్యానికి ఎంతోమంచిది.
కొవ్వును కరిగించే పొద్దు తిరుగుడు
నూనె రూపంలో ఎక్కువ పరిచయమైన పొద్దుతిరుగుడు గిం జలు అద్భుతమైన పోషక విలువలుంటాయి. దాదాపు80కి పైగా పోషకాలున్న ఈ గింజ ల్లో విటమిన్‌ఇ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కొవ్వును కరిగించడంతోపాటు గుండె జబ్బులకి ఆర్థరైయిటీస్, అస్తమా వ్యాధులకు కారణమయ్యే ప్రీ రాడికల్స్‌ను నివారిస్తుంది. పేగు క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. సెలీనియం దెబ్బతిన్న జనువుల్నీ సరిచేయడం ద్వారా క్యానర్లు రాకుండా అడ్డుకుంటుంది. మెనొపాజ్‌లో వీటిని తింటే మధుమేహం తలెత్తే సమస్య తగ్గుతుంది. ఈ గింజల్లోని లినోలిక్ ఆమ్లం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మెగ్నీషియం ఎముకల వృద్ధికి నరాల పనితీరుకి తోడ్పడుతుంది. వీటిలో గర్భిణులకు మేలు చేసే ఫోలేట్లు, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే కొవ్వులూ కూడా పుష్కలమే. ఇవి మానసిక ఒత్తిడిని నివారించడంలో ప్రధానంగా ఉపయోగపడతాయి. కొలిన్ జ్ఙాపక శక్తి, తెలివితేటలకు తోడ్పడుతుంది. మొలకెత్తిన గింజలను తినడం వల్ల ఛాతీలో కఫం తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఫ్యాటీ ఆమ్లాలు చర్మం మెరుగుపడి శిరోజాల పెరుగుదలకు తోడ్పడతాయి. కాపర్ తెల్ల జుట్టుని త్వరగా రానివ్వదు. అందుకే ఈ గింజలను వేయించి తిన్నా, పిండి రూపంలో వాడినా ఆరోగ్యానికి మేలు.
అవిసె ఎంతో ఆరోగ్యం
ఫ్లాక్స్ సీడ్స్‌గా పిలిచే ఈ గింజల్లో ఆల్ఫాలినోలిక్ అనే ఓమేగా3 ఫ్యాటీ ఆమ్లం, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, పీచూ ఎక్కువ. ఇవన్నీ ఆస్తమా, క్యాన్సర్, డయాబెటీస్, ఆర్థరైటీస్ వంటి వ్యాధుల నివారణలో ఎంతో కీలకం. చేపలు తినని శాకాహారులకు ఇవి ఎంతో మేలు. అవిసె గింజల్లోని ఒమెగా3 ఫ్యాటీ ఆమ్లాలు హృద్రోగాలు రాకుండా నివారిస్తే, లిగ్నన్లు రొమ్ము , ప్రొస్టేట్ క్యాన్సర్లనీ అడ్డుకుంటాయి. ఇక పీచు పేగుల్లోని విషపదార్థాలన్నీంటిని శుభ్రంగా తుడిచేసి, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. బిసిని తగ్గించే సహజ మందుగాను పేర్కొంటారు. ఆర్థినైన్, ఆస్పార్టిక్, గ్లుటమిక్ అనేప్రొటీన్లు రోగనిరోధక శక్తిని పెంపొందించడంతోబాటు చెడు కొలెస్టాల్‌ను ట్యూమర్లనీ అడ్డుకుంటాయి. వీటిని పిండి రూపంలో వాడితే వాటిలోని పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయి.
కుసుమ సౌందర్యం
పొద్దు తిరుగుడు గింజల్లా ఉండే వీటిని కుసుంబాలనీ అంటారు. ఈ గింజల్లో సన్‌ఫ్లవర్ లోకన్నా లినోలిక్ ఆమ్లం చాలా ఎక్కువ. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. విటమిన్‌ఇ కూడా అధికమే. ఇది మలబద్ధకం, ఆస్తమా , ఎగ్జిమా వంటి వాటి నివారణలో ఉపయోగపడతాయి. అరటీ స్పూను కుసుమ గింజల పొడిలో తేనె వేసుకుని రోజూ రెండుసార్లు తీసుకుంటే ఆస్తమా తగ్గుతుందంట. వీటిని పిస్తా, బాదం, తేనెతో కలిపి రోజూ రాత్రిపూట తింటే పురుషుల్లో వీర్యవృద్ధి కలుగుతుంది. సంతానలేమితో బాధపడేవాళ్లకి ఇవి ఎంతోప్రయోజనం. వీటిలో లభించే పాలి అన్‌శ్యాచురేటెడ్ ఆమ్లాలవల్ల రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అందువల్ల వీటిని పొడిచేసుకుని అన్నిరకాల వంటకాల్లో ఉపయోగించుకోవడం మంచిది.
తామర వసివాడని అందం
ఫూల్‌మఖానా అని పిలిచే తామర గింజల్ని ఉడికించి లేదా వేయించి తింటారు. వీటిలో ప్రొటీన్లు మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలతో పాటు ప్రొటీన్లూ ఎక్కువ. అవన్నీ పక్కనబెడితే, వయస్సు మీదపడనీయని ఎల్-ఐసోఆస్‌పార్టిల్ మిథైల్ ట్రాన్స్‌ఫరేజ్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉన్నట్లు తేలింది. ఇది దెబ్బతిన్న ప్రొటీన్లను సైతం బాగుచేస్తుందని తేలడంతో కొస్మొటిక్ కంపెనీలు వీటిమీద దృష్టిపెట్టాయంట. వృద్ధాప్యం కారణంగా క్షీణించే కణజాలాన్ని క్యాంఫెరాల్ అనే ఫ్లెవనాయిడ్ బాగుచేయడంతోపాటు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడానికి ఉపయోగపడతాయని గుర్తించారు. వీటిని క్రమం తప్పకుండా తినేవారిలో చర్మం మృదువుగా తయారవుతుంది. నిద్రలేమిని తగ్గించి ప్రశాంతంగా ఉంచేందుకు దోహదపడతాయివి. రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేయడం ద్వారా బిపి రాకుండా నివారిస్తుంది. క్యాలరీలు తక్కువగా ఉండే ఈ గింజల్లో పీచు శాతం ఎక్కువే. దీంతో ఆకలి తగ్గుతుంది. తద్వారా చక్కెర వ్యాధికి చక్కని మందులా పనిచేస్తుంది. వేయించి తింటే డయేరియా, వాంతులు, అజీర్తిని తగ్గిస్తాయి. నోటిలో పుండ్లనీ చిగుళ్ల వ్యాధుల్నికూడా నివారించే తామరగింజ ప్రకృతి ప్రసాదించిన వరమే.

Health Benefits of Grains

 

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post గింజల్లోనూ పోషకాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.