సచివాలయం కూల్చివేతకు లైన్ క్లియర్

HC green signal to demolish secretariat building

 

కేబినెట్ నిర్ణయాన్ని తప్పుపట్టలేం

కూల్చివేతను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు సహా మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లన్నీ కొట్టివేసిన హైకోర్టు
ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం
నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం కూల్చివేతకు సోమవారం నాడు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా వేర్వేరుగా దాఖలైన 10 పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. సోమవారం విచారణ జరపగా చివరికి ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు నూతన సచివాలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని తేల్చిచెప్పింది. అదేవిధంగా సచివాలయం కూల్చివేయొద్దంటూ దాఖలైన పిటిషన్‌లను కొట్టివేసింది. నూతన సచివాలయం నిర్మాణం వల్ల వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించగా, ప్రభుత్వ పాలసీ విధానాలపై న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వం తన వాదనలు వినిపించింది.

ప్రస్తుతం ఉన్న సచివాలయంలో సరైన సదుపాయాలు లేవని, ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రభుత్వం వివరించింది. దీంతో ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం సచివాలయ కూల్చివేతకు అనుమతి ఇవ్వడంతో నూతన సచివాలయ నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్ని తొలిగిపోయాయి. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి అత్యాధునిక హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సచివాలయ నిర్మాణం అనేది విధాన పరమైన నిర్ణయమని, అందులో కోర్టు జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వం వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు మంత్రిమండలి నిర్ణయాన్ని తప్పుబట్టలేమని పిటిషన్లను కొట్టివేయడంతో పాటు దీనిపై ఇదివరకు ఇచ్చిన స్టేను ఎత్తేశారు.

పదికి పైగా పిటిషన్లు
సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పదికి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈక్రమంలో ప్రస్తుతం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ సమీపంలో లుంబినీ పార్కు ఎదురుగా కొనసాగుతోన్న పాత సచివాలయం భవనాన్ని కూల్చివేయాలంటూ ఇదివరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీ సహా కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సైతం హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలను పోతోందని, దశాబ్దాల చరిత్ర ఉన్న సచివాలయం భవనాన్ని కూల్చివేయడాన్ని అడ్డుకోవాలంటూ పిటీషన్లను దాఖలు చేశారు. ఈ ఒక్క అంశంపై 10కి పైగా పిటీషన్లు దాఖలు అయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి, మాజీమంత్రి జీవన్ రెడ్డి, ప్రొఫెసర్ విశ్వేశ్వర రావు తదితరులు ఈ పిటిషన్లను దాఖలు చేసిన వారిలో ఉన్నారు.

HC green signal to demolish secretariat building

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post సచివాలయం కూల్చివేతకు లైన్ క్లియర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.