తొలి ప్రాధాన్యత బంగారానికే

Gold

 

పసిడిలో పెట్టుబడులకే ఇన్వెస్టర్ల మొగ్గు
ఆర్థిక మాంద్యమే కారణం : విశ్లేషకులు

ముంబై : ఆర్థిక మందగమనం నేపథ్యంలో బంగారం ధర రోజురోజుకీ ఆకాశాన్నంటుతోంది. సరికొత్త గరిష్టాలను తాకుతోంది. వెండి ధర కూడా ఇదే స్థాయిలో పైపైకి ఎగసిపడుతోంది. దీంతో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకే అత్యంత ఆసక్తి చూపుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో ఈ విలువైన లోహం ధర మరింత ప్రకాశవంతంగా తయారవుతోంది. మరోవైపు దేశీయ, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల కారణంగా స్టాక్‌మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఆశించిన రాబడి వస్తుందా? అనే సందేహాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. స్టాక్ మార్కెట్లు ఇప్పటికే చాలా నష్టపోయాయి. దీంతో పెట్టుబడిదారులకు సురక్షితమైన పెట్టుబడులుగా బంగారమే మేలని భావిస్తున్నారు.

గతేడాదిలో పసిడి రూ.32,270
దేశంలో విలువైన లోహాలలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ప్రస్తుతం వెండిని తగ్గించుకుంటున్నారు. బంగారం విజృంభణ కొనసాగుతుందని, దీపావళి వరకు దాని ధర కొత్త రికార్డు సృష్టించగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత సంవత్సరంలో బంగారంలో 20 శాతానికి పైగా లాభం ఇవ్వగా, 2018లో పెట్టుబడి రాబడి 6 శాతంగా ఉంది. డిసెంబర్ 31న ఢిల్లీలో బంగారం ధర పది గ్రాములకు రూ.32,270 గా ఉంది. ఇది ప్రస్తుతం 39,000కు చేరింది. దీని ఆధారంగా చూస్తే 2019 సంవత్సరంలో పెట్టుబడిదారులకు బంగారంపై 20 శాతానికి పైగా రాబడి వచ్చింది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో వెండి కూడా కిలోకు రూ.50 వేల స్థాయికి చేరుకుంది. ఈ విధంగా విలువైన లోహాలు పెట్టుబడిదారులకు ఊహించిన దానికంటే మంచి రాబడిని ఇచ్చాయి.

సురక్షిత పెట్టుబడిగా..
ప్రపంచవ్యాప్తంగా మాంద్యం వస్తుందనే భయంతో బంగారం ధరలు పెరిగాయని ఢిల్లీ బులియన్ అండ్ జ్యువెలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు విమల్ గోయల్ అన్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో పాటు అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, ప్రపంచ స్థాయిలో ఇతర పరిణామాలు బంగారం వైపు పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచాయని గోయల్ చెప్పారు. ఇదే కాకుండా డాలర్‌తో పోలిస్తే రూపాయి తగ్గడం వల్ల బంగారం కూడా బలపడుతోంది. పెట్టుబడి పరంగా ఈ సమయంలో బంగారం కంటే మంచి ఎంపిక మరొకటి లేదని గోయల్ పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా బంగారం రూ.42 వేలకు, వెండి రూ .52 వేలకు చేరుకోగలదని చెప్పారు. రూపాయి విలువ క్షీణించడం కూడా బంగారం ధరలకు తోడ్పడుతుందని ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సురేంద్ర జైన్ అభిప్రాయపడ్డారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మాత్రమే కాదు ఇతర కరెన్సీలు కూడా బలహీనపడుతున్నాయని జైన్ చెప్పారు.

రూపాయి విలువ క్షీణించడం
బడ్జెట్ తరువాత భారత స్టాక్‌మార్కెట్ నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల(ఎఫ్‌పిఐ) నుండి రూపాయిపై ఒత్తిడి పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 72 స్థాయికి చేరింది. బంగారం పెరగడం వెనుక దేశీయ, అంతర్జాతీయ అంశాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా,-చైనా వాణిజ్య యుద్ధం, గ్లోబల్ వృద్ధిరేటుపై ఆందోళనలు, బ్రెగ్సిట్ కారణంగా బంగారం పట్ల పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది.

ఈ ఏడాది చివరికి రూ.41,500లకు
ఈ ఏడాది చివరి నాటికి పది గ్రాముల బంగారం రూ.41,500లు మించనుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి తగ్గడం బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వారు పేర్కొంటున్నారు. ఈ సమయంలో బంగారం ధర జోరుగా ఉందని, ధరల పెరుగుదల అమ్మకంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని, ఇది మొత్తం పరిస్థితిని మలుపు తిప్పగలదని భావిస్తున్నారు. డాలర్‌తో పోలిస్తే డాలర్‌కు రూపాయి 72 స్థాయిలో ఉంటే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు 1,580 డాలర్లకు చేరుకుంటుంది. ఆరు వారాలలో మూడు రోజులు బంగారం ప్రకాశించగా, మిగతా మూడు రోజులు బోల్తా పడ్డాయి. ఓ దశలో బంగారం పది గ్రాములు రూ .40,470లకు చేరగా, వెండి కూడా కిలో 51,600 రూపాయలకు చేరుకుంది.

Gold Price Rs 40,470 in India

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post తొలి ప్రాధాన్యత బంగారానికే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.