మెరిసిన బంగారం

Gold price

 

శిఖర స్థాయికి చేరిన డిమాండ్

అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభమే కారణం, దేశీయంగా రూ.40 వేల స్థాయికి
ఆర్‌బిఐలో పసిడి నిల్వలు.. భారీగా పెరిగిన విలువ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ, దేశీయ పరిణామాలు బంగారం ధగధగలకు కారణమవుతున్నాయి. కొద్ది రోజులుగా పసిడి ధర పెరుగుతూ కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తోంది. 10 గ్రాముల పసిడి ధర 40 వేల రూపాయల మార్క్‌కు చేరువ అవుతోంది. తొలిసారిగా రికార్డు స్థాయికి చేరిన పసిడి ధర రూ.38 వేలను దాటి పైపైకి ఎగబాకుతోంది. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.38,470ను చేరుకుంది. అయితే శుక్రవారం 140 రూపాయలు తగ్గి రూ.38,330 వద్ద స్థిరపడింది. వాణిజ్య యుద్ధం ఆందోళనలు, దేశీయ మందగమన పరిస్థితుల నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులే సురక్షితమని ఇన్వెస్టర్లు భావిస్తున్నారని విశ్లేషకులు పెర్కొంటున్నారు.

మరోవైపు బంగారం బాటలోనే వెండి ధర పయనిస్తోంది. కిలో వెండి ధర రూ.44 వేల మార్క్‌ను దాటింది. గురువారం కిలో వెండి ధర రూ.630 పెరిగి రూ.44,300కు చేరింది. శుక్రవారం 290 రూపాయలు తగ్గి రూ.44,010కి చేరింది. అంతర్జాతీయంగానూ పసిడి రేట్లు భారీగా పెరిగాయి. బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 1500 డాలర్ల మార్క్‌ను దాటింది. ఆరేళ్లలో ఈ కీలక మార్క్‌ను క్రాస్ చేయడం ఇదే తొలిసారి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య పరంగా ఉద్రిక్త పరిస్థితులు పెరిగిన కారణంగా ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్లకే మొగ్గుచూపుతున్నారు.

వాణిజ్య యుద్ధం ఎఫెక్ట్
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన టారిఫ్ ప్రకటన, ఒక దశాబ్దం తర్వాత అమెరికాలో తోలిసారిగా రేటు తగ్గింపు వంటి అంశాలు బంగారు ఫ్యూచర్ల ధరలను పెంచడానికి కారణమయ్యాయి. అయితే ఆసియాలోని వ్యక్తులలో భౌతిక బంగారం కోసం డిమాండ్ తగ్గిపోతోంది. వాణిజ్య యుద్ధంతో ఈ నెల ప్రారంభంలో యుఎస్‌లోని కొమెక్స్ మార్కెట్లో బంగారం ఫ్యూచర్స్ ఔన్స్ ఆరు సంవత్సరాల గరిష్ట స్థాయి 1,522 డాలర్లకు చేరుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అనిశ్చితి వల్ల విలువైన లోహం పసిడిలో పెట్టుబడులు సురక్షితమని ఇన్వెస్టర్లు భావిస్తున్నారని నోమురా సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు టాట్సుఫుమి ఒకోషి అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద కొనుగోలుదారులైన చైనా, భారత్‌లో వీటికి డిమాండ్ పెరిగింది. ప్రపంచ బంగారు ఆభరణాల డిమాండ్‌లో ఇరు దేశాలు దాదాపు 60 శాతం ఉన్నాయి.

ఆర్‌బిఐ మారక నిల్వల్లో పసిడి
విదేశీ మారక నిల్వల్లో బంగారాన్ని పెంచే ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వ్యూహం లాభాలను చూపించడం ప్రారంభించింది. ఈ లోహానికి పెరుగుతున్న ధరలు ఇటీవలి పక్షం రోజులలో దోహదపడ్డాయి. ప్రతి వారం ఆర్‌బిఐ విదేశీ మారక నిల్వ సమాచారం ప్రకటిస్తుంది. దీని ప్రకారం, జూన్ చివరి నాటికి విదేశీ మారక నిల్వల మొత్తం 400 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది ఆగస్టు 2న స్వల్పంగా 399 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ విదేశీ మారక నిల్వల్లో బంగారు నిల్వలు మొత్తం 25.164 బిలియన్ డాలర్లకు పెరిగాయి.

బంగారు నిల్వలు పెరగడం వల్ల మొత్తం నిల్వల వృద్ధి సానుకూలంగా ఉంది. బంగారం కారణంగా మొత్తం విదేశీ మారక నిల్వలు పెరిగాయి. నవంబర్ 2009లో అంతర్జాతీయ ద్రవ్య నిధి నుండి 200 టన్నుల బంగారాన్ని ఔన్సు 1,032 డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2018 మార్చిలో 2.4 టన్నులు కొనుగోలు చేసింది. మార్చి 2018 నుండి ఆర్‌బిఐ 60 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చాలా కేంద్ర బ్యాంకులు మారుతున్న ఆర్థిక మార్కెట్లు, యుఎస్ డాలర్‌పై సురక్షితమైన పెట్టుబడులుగా బంగారాన్ని పెంచుకుంటున్నాయి.

Gold price hitting Rs 40,000 per 10 grams

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మెరిసిన బంగారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.