మూడేళ్ల కనిష్టానికి పసిడి డిమాండ్

Gold demand

 

గతేడాదితో పోలిస్తే 10 శాతం తగ్గిన కొనుగోళ్లు
రికార్డు స్థాయికి ధరలు చేరడమే కారణం
రేట్లు ఇలాగే ఉంటే పండుగ సీజన్ కూడా వెలవెల: పరిశ్రమ వర్గాలు

ముంబై: బంగారం ధరలు కొండెక్కడంతో డిమాండ్ గణనీయంగా తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదిలో దేశీయంగా పసిడి డిమాండ్ 10 శాతం క్షీణించింది. పండుగ సీజన్‌లో అధిక ధరల వల్ల రిటైల్ కొనుగోళ్లు తగ్గి మూడేళ్ల కనిష్టానికి డిమాండ్ పడిపోయిందని జిజెసి (ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్) చైర్మన్ అనంత పద్మనాభన్ అన్నారు. ధరలు పెరిగిన కారణంగా కొనుగోళ్లు తగ్గడమే కాదు, గతేడాదితో పోలిస్తే వాల్యూమ్ పరంగా కూడా డిమాండ్ 10 శాతం క్షీణించిందని అన్నారు. మంగళవారం నాడు దేశీయంగా బంగారం ధర 10 గ్రాములు రూ.35,960తో రికార్డు స్థాయికి చేరింది. గత నెలతో పోలిస్తే 10 శాతానికి పైగా ధర పెరిగింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరగడంతో దేశీయంగానూ రేట్లు ఒక్కసారిగా పెరిగాయి.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, 2018 సంవత్సరంలో భారత్‌లో బంగారం వినియోగం 760.4 టన్నులతో పదేళ్ల సగటు 838 టన్నుల దిగువకు చేరింది, అంటే 1.5 శాతం క్షీణించింది. మార్చి త్రైమాసికంలో డిమాండ్ 5 శాతం పెరిగింది దీంతో ఈ ఏడాదిలో వినియోగం 750 నుంచి 850 టన్నులుగా ఉంటుందని మే నెలలో కౌన్సిల్ అంచనా వేసింది. అయితే అనూహ్యంగా ధరలు పెరుగుదల సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని నగల వ్యాపారులు అంటున్నారు. గత పది రోజుల్లో అమ్మకాలు సాధారణం కంటే దిగువన సగానికి క్షీణించాయని బులియన్ డీలర్లు, జువెలర్లు నివేదిక ఇచ్చారని ఆల్ కేరళ గోల్డ్, సిల్వర్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.గోవిందన్ అన్నారు.

బలహీన డిమాండ్ వల్ల డీలర్లు ఎన్నడూ లేనంతగా ఔన్స్‌కు 25 డాలర్ల వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇంత స్థాయిలో డిస్కౌంట్ ఇవ్వడం 2016 సెప్టెంబర్ నుంచి ఇదే. దేశీయంగా ధరల్లో 10 శాతం దిగుమతి పన్ను, 3 శాతం విక్రయ పన్ను ఉంటుంది. పెళ్లి సీజన్ వల్ల ఈ ఏడాది ద్వితీయార్థంలో డిమాండ్ బాగుంటుంది. దేశీయంగా దసరా, దీపావళి వంటి పండగల సమయంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత స్థాయిలో ధరలు ఉంటే గనుక పండుగల సీజన్‌లో డిమాండ్ తగ్గుతుందని ముంబైలో ఒక డీలర్ ముఖేష్ కొఠారీ అన్నారు. ఈసారి వర్షాలు కూడా ఆశించినంతగా లేకపోవడం బంగారం కొనుగోళ్లను దెబ్బతీయనుందని భావిస్తున్నారు. ఎందుకంటే దేశంలో మూడింట రెండొంతుల బంగారం డిమాండ్ గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటుంది.

అంతర్జాతీయ పరిస్థితుల వల్లే..
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. రాజకీయంగా సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు, ఇన్వెస్టర్లకు రక్షణాత్మక పెట్టుబడి బంగారమే, దీంతో ఇటీవల పసిడికి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక మందగమన భయాలు ఇటీవల పెరిగాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్ సహాయక ప్యాకేజీలు వంటి అంశాలు పసిడి ధరను అమాంతం పెంచాయని నిపుణులు అంటున్నారు. గత గురువారం అమెరికన్ నేవీ డ్రోన్‌ను ఇరాన్ మిలటరీ వర్గాలు కూల్చివేసిన వార్తలతో చమురు, బంగారం ధరలు ఊపందుకున్నాయ్. ఒక దశలో ఇరాన్‌పై సైనికదాడికి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సిద్ధపడినట్లు వెలువడడంతో పసిడి ధరలు పెరిగాయి.

Gold demand could fall 10% this year low to last year

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మూడేళ్ల కనిష్టానికి పసిడి డిమాండ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.