జమిలితో జనాభిప్రాయానికి పాతర

one country, one vote system

 

ఒకే దేశం- ఒకే ఎన్నికలు’ అన్న అంశానికి భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. గత జూన్ 19వ తేదీన జరిగిన అఖిలపక్ష సమావేశంలో బిజెపి ఈ విషయాన్ని లేవనెత్తడం అంటే దానిని అది ఎంత ప్రధానమైన అంశంగా భావిస్తోందో అర్థం అవుతోంది. లోకసభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలన్నది బిజెపి ఆలోచన. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్.డి.ఎ.) లోని పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు ఈ ఆలోచనను సమర్థిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కొన్ని ప్రతిపక్ష పార్టీలు మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహించడం వల్ల రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్యానికి, ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలుగుతుందని వాటిని వ్యతిరేకిస్తున్న పార్టీలు అంటున్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహించడం వల్ల అధికార పార్టీ నియంతృత్వ ధోరణులు మరింత బలపడతాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందువల్ల ఈ ప్రతిపాదనను జాగ్రత్తగా పరిశీలించాలి. చర్చించాలి.

లోకసభకు, శాసనసభలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన కొత్తదేమీ కాదు. 1982లో ఎన్నికల కమిషన్ ఈ ప్రతిపాదన చేసింది. 1999లో లా కమిషన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. నీతి ఆయోగ్ సభ్యులు రూపొందించిన చర్చా పత్రంలో కూడా ఇదే అంశం ప్రస్తావించారు. లా కమిషన్ నివేదికలోనూ ఈ విషయమే చెప్పారు. ప్రధాన మంత్రి ఈ అంశాన్ని తన ప్రసంగాలలోనూ, మన్ కీ బాత్ లాంటి కార్యక్రమాల్లోనూ ప్రస్తావిస్తూ వస్తున్నారు. అందువల్ల దీనికి రాజకీయ ప్రాధాన్యత వచ్చింది. ప్రభుత్వాలు సమర్థంగా పని చేయడానికి, ఎన్నికల వ్యయం తగ్గించడానికి జమిలి ఎన్నికలే మేలు అన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల వ్యయం తగ్గించవచ్చునని భావిస్తున్నారు. ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే విధాన నిర్ణయాలు తీసుకోవచ్చునని కూడా అంటున్నారు. ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నందువల్ల ఎన్నికల నియమావళి అమలులో ఉంటుంది కనక విధాన నిర్ణాయాలు తీసుకోలేక పోతున్నామని చెప్తున్నారు. కానీ ఈ ప్రతిపాదన చేసే వారు రాజ్యాంగ సూత్రాలను, ప్రజాస్వామ్య విలువలను పట్టించుకోవడం లేదు.

జమిలి ఎన్నికలు నిర్వహిస్తే అనేక రాష్ట్రాల శాసన సభల గడువు తగ్గించవలసి వస్తుంది. అంటే ప్రజాస్వామ్య తీర్పును కాల రాసినట్టే. ఒక వేళ 356వ అధికరణం జోలికి పోకుండా ఏకాభిప్రాయంతో శాసన సభల గడువు కుదించడానికి వీలున్నా అది ఫెడరల్ విధానాలకు విఘాతం కలిగించినట్టే. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అతిగా ప్రవర్తించినందువల్ల ఏక కాలంలో ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగింది. దాని వల్ల రాజకీయ శక్తులలో మార్పు రావడంతో పాటు ఫెడరిలిజం బలపడిన మాట వాస్తవం. రాష్ట్రాలకు విడిగా ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రాల సమస్యల మీద దృష్టి కేంద్రీకరించడం వీలవుతుంది. ఒకే సారి ఎన్నికలు జరిగితే రాష్ట్రాల సమస్యలపై దృష్టి కేంద్రీకరించడం తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది. ఒకే పార్టీ పెత్తనం పెరిగిపోతుంది. విడివిడిగా ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్య ఒత్తిడులకు అవకాశం ఉంటుంది. పైగా రాష్ట్రాలకు విడిగా ఎన్నికలు జరగడంవల్ల కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్లో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికీ అవకాశం ఉంటుంది. ప్రజల కోర్కెలను మన్నించవలసిన అవసరం ఉంటుంది.

జమిలి ఎన్నికల కోసం పట్టుబట్టడం అంటే కార్యనిర్వాహక వర్గం బాధ్యత నుంచి తప్పించుకోవడమే. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే చట్ట సభల గడువు నిర్దిష్టంగా ఉండవలసి వస్తుంది. కానీ కేంద్రంలో గానీ, రాష్ట్రాలలోని ఒక ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం నెగ్గితే మళ్లీ ఉమ్మడి ఎన్నికల క్రమం చెదిరిపోతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చట్ట సభల గడువును ప్రభుత్వ పతనంతో నిమిత్తం లేకుండా మారకుండా ఉంచే అవకాశం లేదు. అవిశ్వాస తీర్మానాలు నెగ్గితే కేంద్రంలోగానీ రాష్ట్రాలలో గానీ మధ్యంతర ఎన్నికలు నిర్వహించక తప్పదు. దీనికి ప్రతిపాదిస్తున్న విరుగుడు ఏమిటంటే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేటట్టయితే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏమిటో నికరంగా చెప్పాలని లేదా రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించాలని లేదా ఆ శాసన సభ గడువు ముగియడానికి మిగిలి ఉన్న సమయానికి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని అంటున్నారు.

రాజ్యాంగంలో ఇలాంటి ఏర్పాటుకు అవకాశం లేదు. శాసన సభల గడువు నిర్దిష్టంగా ఉంటే సుస్థిరత నెలకొంటుందని, నిరంతరత ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్యం అన్న అంశాన్ని పట్టించుకోవడం లేదు. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే వారు ప్రత్యామ్నాయ ప్రభుత్వం గురించి కచ్చితంగా చెప్పాలనడం ప్రజాస్వామ్య సూత్రాలతో రాజీ పడడమే. శాసనసభకు బాధ్యత వహించాలన్న నియమాన్ని విడనాడవలసి వస్తుంది. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతంగా ఉండడానికి ఎక్కువ విలువ ఇవ్వాలా లేక సుస్థిరతకే ప్రాధాన్యత ఇస్తారా అన్న ప్రశ్న కూడా ఎదురవుతుంది. అలాంటి పరిస్థితే వస్తే దొడ్డి దారిన అధ్యక్ష తరహా పాలన వైపు వెళ్లినట్టు అవుతుంది. జమిలి ఎన్నికల వల్ల పెద్ద పార్టీలకు ప్రాధాన్యం ఇచ్చినట్టూ అవుతుంది. పెద్ద పార్టీలకు వనరులు ఎక్కువ అందుబాటులో ఉంటాయి. అప్పుడు ప్రధానమైన రెండు పార్టీల మధ్యే పోటీకి పరిమితం కావలసి వస్తుంది. వ్యక్తులకు ప్రాధాన్యత పెరుగుతుంది.

నిర్వహణా సౌలభ్యం కోసం జమిలి ఎన్నికల విధానాన్ని అనుసరించడం అంటే ప్రజాస్వామ్య మౌలిక తత్వానికి వ్యతిరేకమే అవుతుంది. సార్వభౌమాధికారం ప్రజలకు లేకుండా పోతుంది. ఎన్నికలను కేవలం ఒక ప్రక్రియలా, తంతులా భావించినట్టు అవుతుంది. ఈ పద్ధతి అనుసరించడం అంటే ప్రజల బాధ్యత కేవలం అయిదేళ్లకు ఒక సారి ఓటు వేయడానికే పరిమితం చేసి ఆ తరవాత ప్రజలకు ఏ పాత్రా లేకుండా చేసినట్టు అవుతుంది. ఆ తరవాత వ్యవహారం అంతా కార్యనిర్వాహక వర్గం చేతిలోనే ఉంటుంది. క్రియాశీలంగా ఉండే ప్రజలు అయిదేళ్ల పాటు వేచి ఉండలేరు అని డా. రాం మనోహర్ లోహియా చెప్పిన మాటను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

ప్రజోద్యమాలతో పాటు రాష్ట్రాలలో మామూలు పద్ధతుల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటే ప్రజాస్వామ్య భావాలు వ్యక్తం చేయడానికి వీలుంటుంది. ప్రజాస్వామ్యానికి ఇది చాలా అవసరం. నిజానికి ఎన్నికల నిర్వహణ అంటే ప్రజల కార్యకలాపాల, అభిప్రాయాల వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వడమే. ప్రజాస్వామ్య మనుగడకు ఇది అవసరం. డబ్బు, మీడియా ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో జనాభిప్రాయం వ్యక్తం కావడానికి ఉన్న వెసులుబాటు ఏమిటి అన్నది చర్చనీయాంశమే. జమిలి ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తోయడం అంటే జనాభిప్రాయ వ్యక్తీకరణకు అవకాశం లేకుండా చేయడమే.

                                                                                                – (ఇ.పి.డబ్ల్యు.సౌజన్యంతో)

German FA suggests ending one country, one vote system

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జమిలితో జనాభిప్రాయానికి పాతర appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.