మూడోసారి రెపోరేటులో కోత

  5.75 శాతానికి దిగిరానున్న వడ్డీ రేట్లు గృహ, వాహన రుణ వాయిదాలు ఇకపై చౌక జిడిపి వృద్ధి రేటు 7 శాతానికి తగ్గింపు ఆర్‌బిఐ సమీక్షలో గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి ముంబై: కృంగిపోయిన ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం అందించేందుకు గానూ మరోసారి వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటును తగ్గించింది. ఈ తగ్గింపుతో ప్రస్తుతం వడ్డీ […] The post మూడోసారి రెపోరేటులో కోత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

5.75 శాతానికి దిగిరానున్న వడ్డీ రేట్లు
గృహ, వాహన రుణ వాయిదాలు ఇకపై చౌక
జిడిపి వృద్ధి రేటు 7 శాతానికి తగ్గింపు
ఆర్‌బిఐ సమీక్షలో గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి

ముంబై: కృంగిపోయిన ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం అందించేందుకు గానూ మరోసారి వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) 25 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటును తగ్గించింది. ఈ తగ్గింపుతో ప్రస్తుతం వడ్డీ రేటు 5.75 శాతానికి దిగిరానుండగా, రేటు తొమ్మిదేళ్ల కనిష్టానికి పడిపోయింది. అలాగే పాలసీ విధానాన్ని తటస్థం నుంచి సర్దుబాటుకు ఆర్‌బిఐ మార్పు చేసింది. గత ఐదు నెలల్లో వడ్డీ రేటులో తగ్గింపు వరుసగా మూడోసారి కావడం విశేషం. దీంతో గృహ, వాహన రుణాలపై వాయిదాలు, అలాగే కార్పొరేట్లకు రుణాల చెల్లింపుల భారం తగ్గనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రిజర్వు బ్యాంక్ సుమారు 0.75 శాతం మేరకు వడ్డీ రేటును తగ్గించింది. గురువారం పావు శాతం రేటు తగ్గింపుతో వడ్డీ రేటు 5.75 శాతానికి తగ్గగా, ఇంతకుముందు 2010 జులైలో రెపో రేటు 5.75 శాతం ఉంది. అంటే తొమ్మిదేళ్ల కనిష్టానికి రెపో రేటు పడిపోయింది. అలాగే బ్యాంకులు స్వల్పకాలిక నిధులను రిజర్వ్ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేస్తే లభించే రివర్స్ రెపో రేటు కూడా 5.75 శాతం నుంచి 5.5 శాతానికి పరిమితంకానుంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్) రేటు 6 శాతంగా ఉంది.
ఎంపిసిలో ఏకగ్రీవం
కొత్త ఆర్థిక సంవత్సరం(2019-20)లో చేపట్టిన రెండో ద్వైమాసిక పాలసీ సమీక్ష ఇది. ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మూడు రోజుల పాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపిసి)లో రెపో రేటుకు పావు శాతం కోత విధించగా, ఎంపిసిలో మొత్తం ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా రేటు కోతకు ఓకే చెప్పారు.
జిడిపి 7 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 7 శాతం వృద్ధి సాధించవచ్చని ఆర్‌బిఐ అంచనా వేసింది. గతంలో వేసిన 7.2 శాతం వృద్ధి అంచనాలను స్వల్పంగా తగ్గించింది. అలాగే తొలి అర్ధభాగానికి (ఏప్రిల్-సెప్టెంబర్) 6.8- నుంచి 7.1 శాతం స్థాయిలో వేసిన జిడిపి వృద్ధి అంచనాలను 6.4- నుంచి 6.7 శాతానికి సవరించింది. ద్వితీయార్థంలో(అక్టోబర్-మార్చి) దేశ ఆర్థిక వ్యవస్థ 7.2 నుంచి -7.5 శాతం పెరగనుందని అంచనా వేసింది. ఇదే విధంగా ద్రవ్యోల్బణ అంచనాలను తొలి అర్ధభాగానికి స్వల్పంగా 3.1 శాతానికి పెంచగా, ద్వితీయార్థంలో 3.4- 3.7 శాతానికి స్వల్పంగా తగ్గించింది.

ఆర్‌బిఐ ముఖ్యాంశాలు
* వరుసగా మూడోసారి 25 బేసిస్ పాయింట్లు రెపో రేటును తగ్గింపు
* రివర్స్ రెపో రేటు 5.50 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్) 6 శాతం
* తటస్థంనుంచి సర్దుబాటుకు పాలసీ విధానాన్ని మార్పుచేసిన ఆర్‌బిఐ
* 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ జిడిపి వృద్ధి రేటు 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గింపు
* ఏప్రిల్-సెప్టెంబర్ కాలానికి గాను రిటైల్ ద్రవ్యోల్బణం అంచనా 3 నుంచి 3.1 శాతానికి పెంపు, అక్టోబర్-మార్చిలో 34 శాతం    నుంచి 3.7 శాతానికి పెంపు
* ఆహార ధరల పెరగడం వల్ల సమీప కాలంలో ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా
* రుతుపవనాల అనిశ్చితులు, కూరగాయ ధరల పెరుగుదల, క్రూడ్ ఆయిల్ ధరలు, ఫైనాన్షియల్ మార్కెట్లలో       ఒడిదుడుకులు వంటివి ద్రవ్యోల్బణ ముప్పుకు దారితీయవచ్చని అంచనా
* డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఆర్‌టిజిఎస్, నెప్ట్ చార్జీల రద్దు
* బ్యాంకుల ఎటిఎం చార్జీలు, ఫీజుల సమీక్షకు ప్యానెల్ ఏర్పాటు

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మూడోసారి రెపోరేటులో కోత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: