అమర గాయకునికి అశ్రు నివాళి!

  కామ్రేడ్ అరుణోదయ రామారావు మరణ వార్త అశనిపాతం లాంటిది. ఊహించలేనిది. మూడు వారాల క్రితం హైదరాబాదులో కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య వర్ధంతి సభ రోజున, 12 ఏప్రిల్ నాడు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కలిసి మాట్లాడుకున్నాము. ఆ సభలో కామ్రేడ్ కానూరి రాసిన ‘విప్లవాగ్రణి కొండపల్లి’ అనే పాటను రామారావు పాడారు. ఆయన నోటి నుండి విన్న ఆఖరి పాట అదే అవుతుందని ఎలా అనుకోగలం? 70వ దశకం చివర గుంటూరు గాంధీ పార్క్‌లో కానూరి, […] The post అమర గాయకునికి అశ్రు నివాళి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

కామ్రేడ్ అరుణోదయ రామారావు మరణ వార్త అశనిపాతం లాంటిది. ఊహించలేనిది. మూడు వారాల క్రితం హైదరాబాదులో కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య వర్ధంతి సభ రోజున, 12 ఏప్రిల్ నాడు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కలిసి మాట్లాడుకున్నాము. ఆ సభలో కామ్రేడ్ కానూరి రాసిన ‘విప్లవాగ్రణి కొండపల్లి’ అనే పాటను రామారావు పాడారు. ఆయన నోటి నుండి విన్న ఆఖరి పాట అదే అవుతుందని ఎలా అనుకోగలం?

70వ దశకం చివర గుంటూరు గాంధీ పార్క్‌లో కానూరి, రామారావులు ప్రదర్శించిన బుర్రకథ అనంతరం మొదటిసారి వారిరువురినీ కలిసి మాట్లాడాను. వారితో కలిసి గజ్జె కట్టి ఆడే రోజు ఒకటి వస్తుందని అప్పటికి ఊహామాత్రంగా కూడా నాలో లేదు. ప్రజా సాంస్కృతి కోద్యమ అవసరాలు కాలక్రమంలో నన్ను నిరంతర ప్రదర్శనలు ఇచ్చే కళాకారునిగా కూడా చేశాయి. 1990వ సంవత్సరం నుండి 2004లో ముంబైలో జరిగిన వరల్డ్ సోషల్ ఫోరం దాకా అనేక సాంస్కృతిక వేదికల మీద కా॥ రామారావుతో కలసి ఎన్నో ప్రదర్శనలు ఇస్తూ పాల్గొన్నాము.

కామ్రేడ్ రామారావు ప్రధాన కార్యదర్శిగా, ఉదయ్ కార్యదర్శిగా, చిన్న విమల గోరటి వెంకన్నలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉండిన ఒక అరుణోదయకు, నేను అధ్యక్షుడిగా ఉండిన కాలం ఒకటి ఉండేది. గుంటూరు జిల్లా కాజ నుండి కర్నూలు జిల్లా వెలుగోడు బొల్లవరం దాకా, నల్లగొండ జిల్లా నకిరేకల్లు నుండి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల గోదావరిఖని తదితర చోట్ల దాకా జరిగిన అనేక శిక్షణా శిబిరాలలో రామారావుతో కలిసి మేము పాల్గొన్నాము.

దేశ ప్రధానిగా ఉంటూ పార్లమెంటు సభ్యుడు కావడం కోసం నంద్యాలలో 1991 చివర, పివి నరసింహారావు పోటీ చేసినప్పుడు, అప్పటికే ఆయన ప్రధానిగా డంకెల్ ప్రతిపాదనలపై సంతకం పెట్టి, సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు దేశాన్ని లొంగుబాటు కావించి నందుకు నిరసనగా మేము ‘అప్పుల భారతం’ అనే కళారూపాన్ని ప్రదర్శిస్తూ ప్రచారం గావించాము. ఆ కళారూపం కూచిపూడి యక్షగాన ప్రక్రియగా ప్రారంభమై నృత్య రూపకంగా ముగుస్తుంది.

ఆ ప్రదర్శనకు సూత్రధారుడు కామ్రేడ్ రామారావు. ప్రధాన పాత్రధారుణ్ణి . ‘పరమవీర నారసింహ మహరాజ్’ ని నేను. నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గం లోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపు ప్రతి మండల కేంద్రంలో నెల రోజుల పాటు కామ్రేడ్ మండ్ల సుబ్బారెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతుగా, ఆనాటి ఎంఎల్‌ఎ కామ్రేడ్ ఎన్ వి కృష్ణయ్య ఉపన్యాసాల అనంతరం మా ప్రదర్శన ఉండేది. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 19 జిల్లాల్లో అప్పుల భారతం ప్రదర్శనలు ఇచ్చాము. ముంబాయి మహానగరంలో తెలుగువారు ఉండే ప్రాంతాలలో రోజుకి రెండు మూడు ప్రదర్శనలు చొప్పున 1993లో అనగా సరిగ్గా 26 సంవత్సరాల క్రితం మే నెల మొదటి వారం రోజుల పాటు ఎఐఎఫ్ టియు ఏర్పాటుకై అలుపెరగని ప్రచారం కావించా ము. 1993 సెప్టెంబర్ నెలలో లక్నోలో జరిగిన ‘మతోన్మాద వ్యతిరేక సదస్సు’లో ‘రామజన్మభూమి కాదురో వీధి నాటకాన్ని, 1993 డిసెంబర్ నెలాఖరులో కలకత్తాలో జరిగిన కామ్రేడ్ మావో శత జయంతి ముగింపు సభలో ‘ఎత్తిన జెండా దించకోయ్’ అనే నిశ్చలన దృశ్యరూపకాన్నీ ప్రదర్శించాము. ఎన్నో పెద్ద బహిరంగ సభల అనంతరం, అనేక సదస్సుల తర్వాత, ఒక్కొక్కసారి వంద మందిలోపు మాత్రమే ప్రేక్షకులు ఉండిన సందర్భాల్లోనూ ప్రదర్శనలిచ్చాము.

అరుణోదయ సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా శ్రీకాకుళం నుండి కరీంనగరం దాకా జిల్లా సంఘాల నిర్మాణం కొరకు కలసి పని చేశాము. నాలుగైదు పాటల క్యాసెట్ రికార్డింగ్‌లలో రామారావుతో కలిసి పాల్గొన్నాము. వాటిలో చుండూరు నరమేధం జరిగిన కొద్ది రోజుల్లోనే విజయవాడ సువార్త వాణిలో రికార్డు చేసిన ‘దళిత పోరాట పాటలు’ మొదటిది. ఆ తర్వాత కామ్రేడ్ అంగడి చెన్నయ్య మీద ఒక పాటల క్యాసెట్టు, కామ్రేడ్ విశ్వమోహన్ రెడ్డి మీద మరొక పాటల క్యాసెట్టు రూపొందించాము. విప్లవ పార్టీ వర్గాలలో కామ్రేడ్ వినోదన్నగా పేరుగడించిన, మా తంతి – తపాలా కార్మిక ఉద్యమ నాయకుడు కామ్రేడ్ పి పురుషోత్తం రాజు మీద మరొక క్యాసెట్‌ని కూడా తెనాలిలోనే రూపొందించాము. దళిత పోరాట పాటలు క్యాసెట్‌లో కామ్రేడ్ రామారావు, వీరయ్య విమల మొదలైనవారు పాటలు పాడగా, ఆ క్యాసెట్టుకి వ్యాఖ్యానం ఉదయ్ చెప్పాడు. మొత్తం వ్యాఖ్యానాన్ని నేను రచించాను.

దళిత పోరాట పాటలు లోని కె.వై. ఎసుదాసు రాసిన ‘చిందింది రక్తం చుండూరులోన’ పాటకు కామ్రేడ్ రామారావు, పల్లవి కంటే ముందు ఆలపించిన సాకీ, నాటి చుండూరు విషాదాన్ని మన గుండెలను తాకే లా చేస్తుంది. కామ్రేడ్ రామారావు లాంటి అరుదైన గాయకుడు ప్రజా కళామ రంగానికి అంకితమై 45 సంవత్సరాలకు పైగా నిబద్ధతతో పని చేయడం వల్ల తెలుగునాట పీడిత ప్రజానీకాన్ని, విద్యార్థి యువజనులను విప్లవోద్యమం తన వైపుకి ఆకట్టుకోగలిగింది అని స్పష్టంగా గుర్తించగలుగుతాము. కామ్రేడ్ రామారావు ఏ రాగాన్నయినా, ఏ శృతిలోనైనా పాడగలిగిన నైపు ణ్యం కలవాడు. ఒకొకసారి అతను రాగాన్ని ఎప్పుడు ఆపుతాడో, ఇంకెంతసేపు ఆలపిస్తాడోనని శ్రోతలకి గొప్ప ఉత్కంఠతని కలిగించే విధంగా ఉండేది.

అతన్ని ప్రజా కళాకారుడుగా మలిచిన మహనీయు డు కామ్రేడ్ కానూరి వెంకటేశ్వర రావు. సీనియర్ బుర్రకథ కళాకారుల్లో ఒకరైన బొల్లవరం సుంకులు కామ్రేడ్ చిన్న విమల వీరంతా ఒకే బృందంలో ఉండటం కామ్రేడ్ రామారావు కళా నైపుణ్యానికీ ప్రదర్శనలకు మరింత వన్నె తెచ్చిన మాట వాస్తవం. కమ్యూనిస్టు విప్లవకారుల గ్రూపులు పలు రకాలుగా ఎన్నో విధాలుగా నిలువుగా అడ్డంగా చీలికలు పీలికలకు గురయి, ఒకసారి తీవ్రమైన పరస్పర నిందారోపణలకూ, ఇంకొకసారి దూషణ భూషణలకూ, వేరొకసారి పరస్పర హత్యాకాండకు కూడా పాల్పపడిన సందర్భాలున్నాయి. వారి నడుమ ఎంత విద్వేష పూరిత వాతావరణం నెలకొని ఉన్నా, కామ్రేడ్ రామారావు మాత్రం అందరితో స్నేహంగానే ఉండగలిగేవాడు. అదొక తరహా అవకాశవాదమని కొందరితో విమర్శకు గురయినా తను మాత్రం తన వైఖరినే కొనసాగిస్తూ చివరికంటా సాగాడు.

ఒకసారి నేను కామ్రేడ్ రామారావుతో మాట్లాడుతూ మిమ్ము నడిపించిన జీవ శక్తులు రెండు అని చెప్పాను. అందులో కళాశక్తి కామ్రేడ్ కానూరి అయితే, జీవన గమనాన్ని గమ్యాన్ని నడిపించిన శక్తి రామారావు జీవిత సహచరి కామ్రేడ్ అరుణమ్మది అన్నాను. ప్రజా కళాకారులను కూడా పీడించే కొన్ని జబ్బులకు ఆమె గొప్ప విరుగుడు అని నా అభిప్రాయం.
45 ఏళ్ల పాటు తన జీవితాన్ని విప్లవోద్యమానికి, ప్రజా సాంస్కృతిక కళా రంగాలకు అంకితమై, ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ, పాలకులు విసిరే వ్యామోహాల వలలో చిక్కుకోకుండా, ఆఖరి శ్వాస దాకా ప్రజలకే తన కళా ఉద్యమ నైపుణ్యాలను అంకితం చేసిన కామ్రేడ్ అరుణోదయ రామారావు మృతికి నివాళులర్పిస్తూ, ఆ కామ్రేడ్ స్మృతిని మదిలో పదిలపరుచుకుంటూ ఆ అమర గాయకునికి జోహార్లు చెబుతున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు ఉద్యమ సహచరులకు సానుభూతిని ప్రకటిస్తున్నాను.

Folk singer Arunodaya Rama Rao passed away

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అమర గాయకునికి అశ్రు నివాళి! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.