ఫ్లిప్‌కార్ట్ సిఇఒ బిన్నీ బన్సల్ రాజీనామా

flipkart

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ సిఇఒ, ఆ సంస్థ కో ఫౌండర్ బిన్నీ బన్సల్ తన పదవి నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేదన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజీనామాను వాల్‌మార్ట్ వెంటనే ఆమోదించింది. ఆరు నెలల కిందటే ఫ్లిప్‌కార్ట్‌లో మెజార్టీ వాటాను వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తన ప్రవర్తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఇంతకుముందే ఖండించారు. అయితే ఈ విషయం విచారణ దశలో ఉన్నందున బిన్నీని రాజీనామా చేసేలా సంస్థ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది.

తనపై వచ్చిన ఆరోపణలపై బిన్నీ స్పందించిన తీరు సరిగా లేదని, పైగా విచారణ పారదర్శకంగా సాగాలన్న ఉద్దేశంతో ఆయన రాజీనామాను ఆమోదించినట్లు వాల్‌మార్ట్ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన తర్వాత సచిన్ బన్సల్ తన పూర్తి వాటాను అమ్ముకొని వెళ్లిపోగా, బిన్నీ బన్సల్ మాత్రం సిఇఒగా కొనసాగారు. అయితే ఇటీవల కాలంలో ఆయన వ్యక్తిగత ప్రవర్తన సరిగా లేదన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బిన్నీ బన్సల్ తన పదవి నుంచి తప్పుకున్నా.. బోర్డులో సభ్యత్వాన్ని వదులుకుంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

Flipkart CEO Binny Bansal resigned