తడబ్యాటే ముంచింది

Five match Test series in India lost by 14 runs

ఇంగ్లండ్‌తో జరిగిన సుదీర్ఘ సిరీస్ టీమిండియాకు చేదు జ్ఞాపకాలే మిగిల్చింది. సుదీర్ఘ కాలం పాటు సాగిన సిరీస్‌లో భారత్ టెస్టుల్లో ఘోర పరాజయం పాలైంది. వన్డేల్లోనూ టీమిండియాకు పరాజయమే ఎదురైంది. ఒక్క ట్వంటీ20 సిరీస్‌లో మాత్రమే భారత్ విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 14తో చేజార్చుకుంది. వన్డేల్లోనూ 12తో ఓటమి తప్పలేదు. ఇక, టెస్టు సిరీస్‌లో గెలిచే అవకాశాలు లభించినా చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది.

మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఘోర వైఫల్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా 14 తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. బ్యాటింగ్ వైఫల్యం భారత్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. స్వల్ప లక్ష్యాలను సైతం ఛేదించకుండా భారత్ ఓటమి పాలు కావడం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మ్యాచ్‌ను శాసించే స్థితిలో ఉండి కూడా మూడు టెస్టుల్లో భారత్ పరాజయం పాలైంది. దీన్ని బట్టి జట్టు ప్రదర్శన ఎంత పేలవంగా ఉందో ఊహించుకోవచ్చు. తొలి టెస్టులో భారత్ స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక పోయింది. బౌలర్లు అసాధారణ రీతిలో చెలరేగి పోవడంతో ఇంగ్లండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో కాస్త జాగ్రత్తగా ఆడి ఉంటే భారత్‌కు కచ్చితంగా విజయం దక్కేది. అయినా భారత ఆటగాళ్లు కనీస పోరాట పటిమను కనబరచ కుండానే చేతులెత్తేశారు. దీంతో అభిమానుల ఆగ్రహానికి

అంతులేకుండా పోయింది. తొలి మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి తప్ప మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. జట్టుకు అండగా నిలుస్తారని భావించిన శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, అజింక్య రహానె, హార్దిక్ పాండ్య, దినేష్ కార్తీక్ తదితరులు చెత్త బ్యాటింగ్‌తో నిరాశ పరిచారు. వీరిలో ఏ ఇద్దరు క్రీజులో నిలదొక్కుకొని ఉంటే కచ్చితంగా భారత్ మ్యాచ్ గెలుచుకునేదే. అయితే ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి భారత స్టార్లు ఎదురు నిలువలేక పోయారు. దీంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌కు అవమానకర రీతిలో ఓటమి తప్పలేదు. ఇక, తొలి మ్యాచ్‌లో పోరాడి ఓడిన టీమిండియా రెండో మ్యాచ్‌కు వచ్చే సరికి పూర్తిగా డీలా పడి పోయింది. ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసే అవకాశం లభించినా ఫలితం లేకుండా పోయింది. కీలక సమయంలో వికెట్లు తీయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. మరోవైపు బ్యాటింగ్ వైఫల్యం దీనికి తోడైంది. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో ఘోర పరాజయం పాలైంది. ఇక, మూడో టెస్టులో భారత్ అద్భుతంగా ఆడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్‌కు దీటుగా బదులిచ్చింది. టాప్ ఆర్డర్, మిడిలార్డర్ రాణించడంతో సిరీస్‌లో తొలిసారి మెరుగైన స్కోరును అందుకుంది. స్టార్ ఆటగాళ్లు రహానె, పుజారా, కోహ్లి, హార్దిక్‌లు బ్యాటింగ్‌లో సత్తా చాటారు. దీంతో ఈ మ్యాచ్‌లో ఆధిపత్యం చెలాయించింది. చివరికి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఇక, నాలుగో టెస్టులో కూడా భారత్‌కు గెలిచే అవకాశాలు కనిపించాయి. కానీ, మళ్లీ పేలవమైన ప్రదర్శనతో చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది. చివరి వరుస వికెట్లు తీయడంలో భారత బౌలర్లకు ఉన్న బలహీనత మరోసారి పునరావృతమైంది. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమవుతుందని భావించిన ఇంగ్లండ్ అనూహ్యంగా పుంజుకుంది. మ్యాచ్‌ను శాసించే స్కోరును అందుకున్న ఇంగ్లండ్ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరోవైపు

భారత బ్యాట్స్‌మెన్ మరోసారి చేతులెత్తేశారు. సునాయాస లక్ష్యాన్ని కూడా అందుకోలేక చేతులెత్తేశారు. దీంతో నాలుగో టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న ఇంగ్లండ్ మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక, ఆఖరి టెస్టులో కూడా బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో భారత్ విఫలమైంది. కీలక సమయంలో వికెట్లు తీయడంలో భారత బౌలర్ల బలహీనత మరోసారి బయటపడింది. ప్రారంభంలో బాగానే రాణించిన భారత బౌలర్లు ఇంగ్లండ్ చివరి వరుస బ్యాట్స్‌మెన్‌లను త్వరగా ఔట్ చేయలేక పోయారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ మెరుగైన స్కోరును సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో అలిస్టర్ కుక్, కెప్టెన్ రూట్‌లో శతకాలతో కదం తొక్కారు. దీంతో భారత్ ముందు ఇంగ్లండ్ క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది. అయితే లోకేష్ రాహుల్, రిషబ్ పంత్‌లు చారిత్రక శతకాలు సాధించడంతో భారత్ లక్ష్యానికి సమీపంలో వచ్చి చతికల పడింది. కాస్త సమన్వయంతో ఆడి ఉంటే చివరి మ్యాచ్‌లో భారత్‌కు చారిత్రక విజయం దక్కేది. అయితే అందివచ్చిన అవకాశాన్ని భార త ఆటగాళ్లు చేజార్చుకున్నారు. దీంతో సిరీస్‌లో అవమానకర రీతిలో ఓటమి తప్పలేదు.

వెంటాడిన ఓపెనర్ల వైఫల్యం…
సిరీస్‌లో ప్రారంభం నుంచే భారత్‌ను ఓపెనర్ల వైఫల్యం వెంటాడింది. తొలి మ్యాచ్‌లో మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే రెండో ఇన్నింగ్స్ నుంచి భారత ఓపెనర్ల వైఫల్యం ప్రారంభమైంది. ఓపెనర్లుగా మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లు ఘోరంగా విఫలమయ్యారు. రెండు టెస్టుల్లో ఓపెనర్‌గా దిగిన మురళీ విజయ్ ఘోర వైఫల్యం చవిచూశాడు. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి 50 పరుగులు కూడా చేయలేక పోయాడు. ఇటువంటి పరిస్థితే శిఖర్ ధావన్‌ది. అతను కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ధావన్ చెత్త బ్యాటింగ్‌తో నిరాశే మిగిల్చాడు. ఫాస్ట్ పిచ్‌లపై తన తడబాటును మరోసారి నిరూపించాడు. 8 ఇన్నింగ్స్‌లు ఆడిన ధావన్ 162 పరుగులు మాత్రమే చేశాడు. దీన్ని బట్టి అతని వైఫల్యం ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఇక, మరో ఓపెనర్ రాహుల్‌ది కూడా ఇటువంటి పరిస్థితే. కేవలం చివరి టెస్టు ఆఖరి ఇన్నింగ్స్‌లో మాత్రమే రాహుల్ రాణించాడు.

ఈ ఇన్నింగ్స్‌లో 149 పరుగులు చేశాడు. చివరి ఇన్నింగ్స్‌ను మినహాయిస్తే మిగతా 9 ఇన్నింగ్స్‌లలో అతను చేసింది 150 పరుగులు మాత్రమే. ఇది చాలు రాహుల్ వైఫల్యానికి నిదర్శనం. ఇక, సీనియర్లుగా పరిగణించిన చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు కూడా చెత్త ఆటతో నిరాశ పరిచారు. తొలి టెస్టులో పుజారాకు చోటు లభించలేదు. దీంతో మాజీ ఆటగాళ్లు, మీడియా కెప్టెన్ విరాట్ కోహ్లి నిర్ణయంపై దుమ్మెత్తి పోశారు. అయితే తర్వాతి మ్యాచ్‌ల నుంచి పుజారాకు చోటు లభించింది. కానీ, అతని బ్యాటింగ్‌లో మునుపటి జోష్ కనిపించలేదు. 8 ఇన్నింగ్స్‌లలో కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే పుజారా మెరుగ్గా ఆడాడు. మిగతాసార్లు ఘోరంగా విఫలమయ్యాడు. పుజారా సిరీస్‌లో ఒక సెంచరీ, మరో అర్ధ సెంచరీ మాత్రమే సాధించాడు. ఇక, రహానె కూడా జట్టుకు అండగా నిలువలేక పోయాడు. అతని వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. పది ఇన్నింగ్స్‌లు ఆడిన రహానె కేవలం 257 పరుగులు మాత్రమే సాధించాడు. అతను కేవలం రెండు అర్ధ సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు. క్లిష్ట సమయాల్లో జట్టుకు అండగా నిలువడంలో విఫలమయ్యాడు. దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్‌లు కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచలేక పోయారు. ఇలా సమష్టి బ్యాటింగ్ వైఫల్యంతో భారత్ సిరీస్‌లో ఘోర పరాజయం చవిచూసింది.