నల్లమలలో మళ్లీ రాజుకున్న కార్చిచ్చు

Nallamala-forest

నట్టడవిలో అగ్నికి ఆహుతైన భారీ వృక్షాలు
15 రోజుల్లో 10 ఘటనలు
దోమలపెంట అటవీ రేంజ్‌లో మంటలు
వందల హెక్టార్లలో వ్యాపించిన మంటలు

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం మరో మారు కార్చిచ్చు రగులుకొని అడవి తగలబడుతోంది. 15 రోజుల వ్యవధిలో 10 ఘటనలు చోటు చేసుకోవడంతో అటవీ శాఖ అధికారులకు ఊపిరి సల్పడం లేదు. అటవీ శాఖ అధికారులు అచ్చంపేట నుంచి శ్రీశైలం వరకు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్విక్ రెస్పాన్స్ టీంలను అందుబాటులో ఉంచినా కార్చిచ్చు మాత్రం ఆగడం లేదు. రోడ్డు పక్క నుంచి కార్చిచ్చు మొదలై చిట్టడవిలోకి మంటలు వ్యాపిస్తున్నాయి.

మొదటి సారి అమ్రాబాద్ రేంజ్ పరిధిలోని రాసమళ్ళ బావి నుంచి ప్రారంభమైన కార్చిచ్చు వరుసగా ఏదో ఒకచోట రెండు రోజులకు ఒకసారి వెలుగుచూస్తుండడంతో అటవీ శాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. శ్రీశైలం రహదారి వెంట శివభక్తులు వెళ్తుండడం, పర్యాటకులు, ప్రయాణికులు వంటలు చేసి నిప్పును ఆర్పకపోవడం, కొందరు సిగరెట్, బీడీలు కాల్చి అడవిలో పారవేస్తున్న ఘటనలే కార్చిచ్చుకు కారణంగా అటవీశాఖ భావిస్తోంది. తాజాగా నల్లమల అటవీప్రాంతం, దోమలపెంట అటవీ రేంజ్ పరిధిలోని తాటిగుండాల బ్లాక్‌లోని ఉల్లిందన ఏరియాలో బుధవారం మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో కొన్ని వందల హెక్టార్లలో ఎండుగడ్డి, చిన్నా చితకా చెట్లు అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం.

మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన అటవీ అధికారులు, సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటివరకు రాసమళ్ళబావి, ఉర్రుమండ, ఆక్టోపస్ వ్యూ పాయింట్, పదర పరిధిలోని మద్దిమడుగు కాకిరెమ్మ పెంట అటవీ ప్రాంతంలో కార్చిచ్చు రగిలిన విషయం విధితమే. ఈ నెల 14వ తేదీన దోమల పెంట రేంజ్ పరిధిలోని కొల్లం, కొమ్మనపెంట, వటవర్లపల్లి సమీపంలోని సందూటి సార్వ ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. ఇక్కడ కూడా వందలాది ఎకరాల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతయ్యింది. ఇప్పటివరకు అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులోని నల్లమల అటవీ ప్రాంతంలో వేలాది హెక్టార్లలో జరిగిన కార్చిచ్చుల కారణంగా గడ్డి, చిన్నాచితకా చెట్లు, పక్షులు, పాములు, ఉడుముల, బల్లి జాతులు వంటివి ప్రాణాలు కోల్పోతున్నాయని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

fire breaks out in Nallamala forest

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నల్లమలలో మళ్లీ రాజుకున్న కార్చిచ్చు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.