దేనికి ‘వంద’నం?

  ప్రధాని మోడీ ప్రభుత్వం తన వంద రోజుల పాలనను దృఢ నిర్ణయాలు తీసుకున్న అసాధారణ అధ్యాయంగా చెప్పుకుంటూ ఉత్సవ వాతావరణంలో మునిగి తేలుతున్న తరుణంలోనే ఆగస్టు నెలలో ఆటోమొబైల్ రంగంలో అమ్మకాలు మరింతగా పడిపోయి 21 ఏళ్లల్లో ఎన్నడూ ఎరుగని పతనావస్థను చవిచూసిందన్న సమాచారం రావడం ఒక విచిత్ర వైరుధ్యం. పార్లమెంటులో గల ఎదురులేని సంఖ్యాధిక్యతతో రాజకీయంగా ఎంతటి తీవ్రమైన నిర్ణయమైనా తీసుకోగలుగుతున్న ప్రధాని మోడీ రెండో విడత ప్రభుత్వం ఆర్థిక రంగంలో దేశానికి దాపురించిన […] The post దేనికి ‘వంద’నం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రధాని మోడీ ప్రభుత్వం తన వంద రోజుల పాలనను దృఢ నిర్ణయాలు తీసుకున్న అసాధారణ అధ్యాయంగా చెప్పుకుంటూ ఉత్సవ వాతావరణంలో మునిగి తేలుతున్న తరుణంలోనే ఆగస్టు నెలలో ఆటోమొబైల్ రంగంలో అమ్మకాలు మరింతగా పడిపోయి 21 ఏళ్లల్లో ఎన్నడూ ఎరుగని పతనావస్థను చవిచూసిందన్న సమాచారం రావడం ఒక విచిత్ర వైరుధ్యం. పార్లమెంటులో గల ఎదురులేని సంఖ్యాధిక్యతతో రాజకీయంగా ఎంతటి తీవ్రమైన నిర్ణయమైనా తీసుకోగలుగుతున్న ప్రధాని మోడీ రెండో విడత ప్రభుత్వం ఆర్థిక రంగంలో దేశానికి దాపురించిన దుస్థితిని తొలగించలేకపోడ మేగాక ఆ పతనాన్ని ఎక్కడో ఒక చోట ఆపలేకపోడం కూడా కళ్లకు కడుతున్నది.

ఎంతటి సాహసోపేత రాజకీయ నిర్ణయాలైనా ప్రజలందరి ప్రశంసలకు పాత్రం కాలేకపోతాయి. అవి కొందరికి మాత్రం సంతృప్తిని, సంతోషాన్ని కలిగించి మరి కొందరిలో అసంతృప్తిని, ఆగ్రహాన్ని పెల్లుబక చేసే ప్రమాదము న్నది. అందరి బతుకుల్లో వికాసాన్ని ప్రసరింప చేయగల ఆర్థికమైన మంచి మెజారిటీ ప్రజల మెప్పును తప్పని సరిగా పొందుతుంది. దీనిని సుసాధ్యం చేయడంలో మాత్రం వంద రోజుల మోడీ పాలన విఫలమైందని కట్టలు తెంచుకొని సాగిపోతున్న ఆర్థిక పతన పరాకాష్ఠ చాటుతున్నది. మోడీ ప్రభుత్వం ఐదేళ్ల తొలి పాలనలో తీసుకున్న పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి అస్తవ్యస్త అమలు చర్యల దుష్ప్రభావం ఆర్థిక రంగాన్ని ఇంకా పీడిస్తున్నది. కార్ల అమ్మకాలు గత పది నెలలుగా అడ్డూఆపూ లేకుండా పడిపోతున్నాయి. దేశంలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తున్న రంగాలలో మూడవ స్థానంలో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమ ఈ దుస్థితిని ఎదుర్కోడం బాధాకరం.

గత నెలలో (ఆగస్టు 2019) ప్రయాణికుల వాహనాల అమ్మకాలు 31.57 శాతం పడిపోడం భయోత్పాతాన్ని రేపింది. ఏడాది క్రితం ఇదే సమయంలో 2,87,198 పాసింజర్ కార్లు అమ్ముడుపోగా ఈ ఆగస్టులో అది 1,96,524కి పడిపోయింది. ఇప్పటికే మూడన్నర లక్షల మంది పైగా ఉద్యోగులను వీధిన పడవేసిన ఈ రంగం మరింత సంక్షోభాన్ని ఎదుర్కోనున్న సూచనలు కనిపిస్తున్నాయి. వాణిజ్య వాహనాల ఉత్పత్తిలో అగ్రశ్రేణి కంపెనీ అశోక్ లే లాండ్ ఉత్పత్తి విరామాన్ని పనిలేని దినాలను ప్రకటిస్తున్నది. మధ్యతరహా భారీ వాణిజ్య వాహనాల అమ్మకాలు గత నెలలో 70 శాతం తగ్గిపోయినట్టు ఈ కంపెనీ వెల్లడించింది. పండగల సీజన్ మొదలైంది కాబట్టి కార్ల అమ్మకాలు కొంచెమైనా పెరుగొచ్చని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.

వచ్చే రెండు నెలల్లో అటువంటి అభివృద్ధి కనిపించకపోతే ముందున్నది ముసళ్ల పండగేనని భయపడుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి ఇటీవల ప్రకటించిన ఉద్దీపన చర్యలు రోగాన్ని నయం చేయలేకపోయా యని రుజువవుతున్నది. కార్లపై వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి) ను తగ్గిస్తే ప్రయోజనం కలుగుతుందని ఆ పరిశ్రమ యాజమాన్యాలు ఆశిస్తున్నాయి. ఈ నెల 20వ తేదీన జరగనున్న జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోవలసి ఉంది. అయితే ఈ చర్య వల్ల ప్రభుత్వ ఆదాయం భారీగా దెబ్బ తింటుందని అందుచేత తొందర పడవద్దని జిఎస్‌టి ఫిట్‌మెంట్ కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కార్లపై జిఎస్‌టిని తగ్గిస్తే ప్రభుత్వానికి రూ. 50 వేల కోట్ల మేరకు రాబడి హాని కలుగుతుందని చెబుతున్నారు. ఆటోమొబైల్ పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి వస్తున్న మొత్తం వార్షికాదాయం రూ. 3 లక్షల కోట్లు. ఇందులో రూ. 50 వేల కోట్ల మేరకు కోత ఏర్పడితే అది నిజంగానే అసాధారణ లోటుకు దారి తీస్తుంది. ప్రభుత్వం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరిగా ఉంది.

ఇప్పటికే జిఎస్‌టి వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవని పెదవి విరుస్తున్నారు. ఆగస్టు నెలలో ఈ ఆదాయంలో రూ. 98,202 కోట్ల మేరకు గండి పడింది. కార్ల తయారీ రంగంతో పాటు బిస్కెట్ ఫ్యాక్టరీలు, జౌళి, చిన్న మధ్య తరహా పరిశ్రమలు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇది పెరిగే కొద్దీ ఉద్యోగాలు మరింతగా ఊడిపోయి కంపెనీలు పేక మేడల్లా కూలిపోయి మూతపడడం కొనసాగుతుంది. దేశంలోని సామాన్య ప్రజల జీవితాల్లో అది చెప్పనలవి కాని విషాదాన్ని కుమ్మరిస్తుంది. అసోం జాతీయ పౌరసత్వ జాబితా అక్కడి ప్రజల హర్షాన్ని బదులు ఆగ్రహాన్ని చవిచూస్తున్నది.

ఒక మాదిరి బలాల మోహరింపుతో సాగిపోతూ వచ్చిన కశ్మీర్ జన జీవనం ఉన్నపళంగా తీసుకు వచ్చిన పెను మార్పులతో పూర్తిగా స్తంభించిపోయినట్టు అక్కడ తిరిగి మామూలు వాతావరణం నెలకొనేలా చేయడాని కి ప్రభుత్వం మరెంత వ్యయ ప్రయాసలకు సిద్ధ పడక తప్పదని వార్తలు చెబుతున్నాయి. ఆర్థిక పతనం ఈ కష్టాలకు తోడవుతున్నది. ప్రధాని మోడీ ప్రభుత్వం ఆలోచించి ఆర్థిక సంక్షోభ నివారణకు గట్టి చర్యలు ఇప్పటికైనా తీసుకోవాలి.

Financial crisis must be avoided

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post దేనికి ‘వంద’నం? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.