ఫారూఖ్‌కు విముక్తి

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు, 82 ఏళ్ల వృద్ధుడు ఫారూఖ్ అబ్దుల్లాను 7 మాసాల గృహ నిర్బంధం నుంచి విడుదల చేయడం ప్రతి ఒక్కరూ హర్షించవలసిన పరిణామం. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనడానికి దీనిని నిదర్శంగా తీసుకోవచ్చని గట్టిగా ఇప్పుడే అనుకోలేము. మరి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ముఫ్తీ మొహమ్మద్ సయీద్, ఒమర్ అబ్దుల్లా ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. అయితే వృద్ధుడు, పార్లమెంటు సభ్యుడయిన ఫారూఖ్‌ను తక్షణమే విడుదల చేయాలని […] The post ఫారూఖ్‌కు విముక్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు, 82 ఏళ్ల వృద్ధుడు ఫారూఖ్ అబ్దుల్లాను 7 మాసాల గృహ నిర్బంధం నుంచి విడుదల చేయడం ప్రతి ఒక్కరూ హర్షించవలసిన పరిణామం. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనడానికి దీనిని నిదర్శంగా తీసుకోవచ్చని గట్టిగా ఇప్పుడే అనుకోలేము. మరి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ముఫ్తీ మొహమ్మద్ సయీద్, ఒమర్ అబ్దుల్లా ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. అయితే వృద్ధుడు, పార్లమెంటు సభ్యుడయిన ఫారూఖ్‌ను తక్షణమే విడుదల చేయాలని పార్లమెంటు లోపలా, బయటా ప్రతిపక్షాలు తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి.

నిర్బంధాలు, నిషేధాజ్ఞల నేపథ్యం కశ్మీర్‌లో పరిస్థితి బాగుపడిందంటున్న దానికి విరుద్ధంగా ఉందని అంతర్జాతీయ పరిశీలకులు అదే పనిగా వేలెత్తి చూపుతున్నారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్), సిపిఐ(ఎం), సిపిఐ, ఆర్‌జెడి పార్టీల అగ్రనాయకులు, వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన యశ్వంత్ సిన్హా, అరుణ్‌శౌరీ కలిసి ఫారూఖ్ అబ్దుల్లా విడుదలను కోరుతూ ఇటీవలనే విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. రెండు సార్లు యూరప్ పార్లమెంటు సభ్యుల బృందాలను తెచ్చి కశ్మీర్‌లో పర్యటింపచేసినా అక్కడ సాధారణ పరిస్థితులు పూర్తిగా నెలకొన్నాయనే అభిప్రాయం అంతర్జాతీయంగా ఏర్పడలేదు.

ఈ పరిస్థితుల్లో తప్పనిసరై ఫారూఖ్ అబ్దుల్లాకు గృహ నిర్బంధం నుంచి విముక్తి కలిగించినట్టు అనుకోవలసి ఉంది. ఇక ముందు జరిగే పరిణామాలను బట్టి అక్కడ నిజంగా మంచి వాతావరణం నెలకొంటున్నదో లేదో సరిగ్గా అంచనా వేయడం సాధ్యమవుతుంది. నిర్బంధంలోని ఇతర నాయకులను విడుదల చేస్తేగాని తనకు పూర్తి స్వేచ్ఛ లభించినట్టు కాదని ఫారూఖ్ అబ్దుల్లా తన విముక్తి తర్వాత చేసిన ప్రకటన గమనించదగినది. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కలిగించిన 370 అధికరణాన్ని రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి అక్కడ కశ్మీరీయేతరులకు ఆస్తి హక్కు లేకుండా చేసిన 35ఎ ఆర్టికల్‌ను కూడా తొలగించిన తర్వాత గత ఆగస్టు 5వ తేదీన ముందుగా ఫారూఖ్ అబ్దుల్లాను గృహ నిర్బంధంలో పెట్టారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న కారణం చూపి పాలకులు ఇందుకు పాల్పడ్డారు.

జమ్మూ కశ్మీర్‌ను ప్రధాన జాతీయ జన జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి, అక్కడ సత్వరాభివృద్ధిని సాధించడానికే దాని ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించినట్టు కేంద్రం ప్రకటించింది. కాని ఆ చర్య తీసుకొని ఇంత కాలమైనా అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనకపోడం, భద్రతా బలగాల అవసరం లేకుండా పాలించగలిగే స్థితి ఏర్పడకపోడం గమనించవలసిన విషయం. అదే సమయంలో ప్రజల స్వేచ్ఛ పూర్తిగా పునరుద్ధరించలేకపోడమూ అక్కడ పరిస్థితి సజావుగా లేదని చాటుతున్నది. పలు చోట్ల 144వ సెక్షన్ అమల్లో ఉండడమూ కశ్మీర్‌లో పరిస్థితిపై అనుమానాలను కొనసాగింపచేస్తున్నది. ప్రధాన పక్షాలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీల నాయకులను నిర్బంధంలో ఉంచుతూనే పంచాయతీ ఎన్నికలు జరపాలని తీసుకున్న నిర్ణయాన్ని వాయిదా వేసుకొన్నారు.

తొలుత తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 5వ తేదీ నుంచే ఈ ఎన్నికల ప్రక్రియ అమలులోకి రావలసి ఉంది. ఎన్నికల్లో పాల్గోడానికి పిడిపి మాజీ అల్తాఫ్ బుఖారీ 40 మంది మాజీ శాసన సభ్యుల అండతో అప్నీ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రధాన పక్షాలు రెండింటి అగ్రనేతలను నిర్బంధంలో ఉంచి జరిపే పంచాయతీ ఎన్నికలకు విలువ ఉండదని గ్రహించిన ప్రభుత్వం వాటి భాగస్వామ్యానికి దారి కల్పించడానికే ఫారూఖ్ అబ్దుల్లాను విడుదల చేసి ఉంటుందని త్వరలో మిగతా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు విముక్తి లభిస్తుందని సాగుతున్న ఊహాగానాలు నిజమైతే అది కశ్మీర్‌లో పూర్తి రాజకీయ కార్యాచరణకు దారి తీసి ప్రజలు పరిపూర్ణంగా అందులో పాల్గొనే అవకాశం కలుగుతుంది.

అది అక్కడ కనుమరుగయిపోయిన ప్రజాస్వామిక ప్రక్రియను, వాతావరణాన్ని తిరిగి నెలకొల్పుతుంది. పార్లమెంటుకు హాజరవుతానని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రద్దు చేసిన కశ్మీర్‌కు సంబంధించిన రాజ్యాంగ అధికరణలపై గళమెత్తుతానని ఫారూఖ్ అబ్దుల్లా ప్రకటించారు. అదేమైనప్పటికీ తాను తీసుకున్న చర్యలతో కశ్మీర్ ప్రజలు సంతృప్తి చెందారని రుజువు చేయడం కేంద్ర ప్రభుత్వంపై గల గురుతరమైన బాధ్యత. బల ప్రయోగంతో వారి స్వేచ్ఛను ఎల్లకాలం హరించడం సాధ్యం కాదు. వారి గొంతును తొక్కిపెట్టడం అలవికాని పని. ఈ విషయాన్ని కేంద్ర పాలకులు గ్రహించి తీరాలి. ఒకవేళ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చర్యను మెజారిటీ కశ్మీరీలు వ్యతిరేకిస్తున్నట్టు రుజువైతే వారి ప్రతినిధులతో చర్చలు జరపవలసిన బాధ్యత కేంద్రంపై ఉంది.

Farooq Abdullah Released

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఫారూఖ్‌కు విముక్తి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.